ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో సంఘటన జరిగినప్పుడు కాస్త హడావుడి చేసి ఆపై ఆ కాలేజీ యాజమాన్యాలు చేతులు దులుపుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. సిబ్బంది భౌతికంగా దాడి చేయడంతో మనస్తాపానికి గురై విద్యార్థి బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది.
సూర్యాపేటకు చెందిన విద్యార్థి సూర్య, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే కాలేజీ సిబ్బంది వేధింపులకు పాల్పడటం, భౌతికదాడి చేసిన నేపథ్యంలో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజీ సిబ్బంది వల్లే తమ స్నేహితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సోమవారం 300 మందికిపైగా విద్యార్థులు నారాయణ కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో పాటు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు విద్యార్థి సంఘాలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నాయి. కాలేజీ సిబ్బంది వారికి నచ్చజెప్పాలని చేసినా విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.