పోలీసులంటేనే కఠినాత్ములనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ వారు కూడా మనుషులే... వారికి మానవత్వం ఉందని నిరూపించుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా పగ్ధల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ బిల్లోరే అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ రైలు కింద నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడిని దాదాపు రెండు కిలోమీటర్ల మేర భుజంపై మోసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందించాడు. ఓవైపు భుజంపై బరువు, మరోవైపు మొనతేలిన కంకరరాళ్లపై పరుగుతీస్తూ ప్రయాణికుడికి సకాలంలో వైద్యం అందించాడు. దీంతో కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన అజిత్ (35) రైలులో ముంబైకి వెళుతుండగా ప్రమాదవశాత్తూ రైలు నుంచి కిందపడిపోయాడు. ప్రయాణికులు హెల్ప్‌లైన్ నంబర్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కొండ ప్రాంతం కావడంతో అంబులెన్స్ అక్కడకు చేరుకోలేకపోయింది. దీంతో కానిస్టేబుల్ పూనమ్ బిల్లోరే పట్టాలపై పడివున్న అజిత్‌ను భుజాలపైకి ఎత్తుకుని 1.5 కిలోమీటర్ల దూరంలో పగ్ధల్ రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. మరోవైపు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.