పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఇప్పటికీ చల్లారలేదు. పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి పోలీసులు కారణం కాదని, పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపలేదని పోలీసు ఉన్నతాధికారులు ఒకటికి పదిమార్లు చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు యథేచ్ఛగా కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో 15 మంది చనిపోగా పలువురు బుల్లెట్ల దాడిలో గాయాలతో బయటపడ్డారు. అయితే తాము ఎలాంటి కాల్పులు జరపలేదని పోలీసులు ప్రకటించారు.