‘ఏపీ దిశ’ చట్టం విప్లవాత్మకమని, మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టించేలా రాష్ట్రంలో ఈ చట్టం తీసుకొచ్చామని.. ప్రతి మహిళకు భద్రత, భరోసా కల్పిస్తూ దీన్ని రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిర్వహించి.. శిక్ష ఖరారు చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి, సత్వర న్యాయం కోసం రూపొందించిన ‘ఏపీ దిశ’ బిల్లుపై శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. దిశ చట్టం విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.