మైనర్ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడటంపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో వారికి మద్దతుగా నిలిచినందుకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు.