భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు చేస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించిన వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. న్యాయమూర్తులు వెల్లడించిన అంశాలు తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొంది.
ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం మునుపెన్నడూ లేని అసాధారణ చర్య అని, జడ్జీలు లేవనెత్తిన అంశాలను సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభుత్వానికి సూచించారు. సోహ్రాబుద్దీన్ కేసును విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయ అనుమానాస్పద మృతి కేసును సరిగ్గా విచారించాల్సిన అవసరముందని, ఈ కేసులో స్వతంత్ర విచారణ జరగాలని అన్నారు. దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, వారందరూ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.