విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెలరోజుల తర్వాత బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్య రాయ్ మెట్టినింటిని వీడారు. తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఆమె అత్త రబ్రీ దేవి నివాసం నుంచి కన్నీటితో వెనుదిరిగారు. గత ఏడాది మేలో ఆర్భాటంగా వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచి తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య అత్తవారింట్లోనే ఉన్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే వీరి మధ్య కలతలు చెలరేగాయి. తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఐశ్వర్యా రాయ్ గత నెలలో ఆరోపించారు. గృహ హింస నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె సెక్షన్ 26 కింద ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.