పామును చూస్తేనే చాలూ ‘వామ్మో’ అంటూ పరుగులు తీసే వాళ్లను చాలా మందినే చూసి ఉంటాం. దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే కర్ణాటకు చెందిన నిజారా చిట్టీ అనే మహిళ మాత్రం ఇందుకు మినహాయింపు. పాములను పట్టడమే కాదు, విష సర్పాలను కూడా లొంగదీసి వాటిని సురక్షితంగా జనావాసాల నుంచి పంపించేయగల నేర్పు, ధైర్యసాహసాలు ఆమె సొంతం. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే చీర ధరించి, నజారా నాగుపామును పట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకకు చెందిన నజారా చిట్టీ ఓరోజు పెళ్లికి వెళ్లేందుకు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. అయితే అంతలోనే తమ ఇంట్లో ఉన్న పామును బయటకు పంపేయాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో అప్పటికప్పుడు అక్కడికి బయల్దేరిన చిట్టీ.. నాగుపామును ఎంతో ఒడుపుగా పట్టుకున్నారు. తోకను పట్టి ఆడిస్తూ ఇంట్లో నుంచి బయటకు తెచ్చి ఓ కవర్లో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో గతేడాది జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నజీరా ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ అంటూనే, మరోసారి పామును పట్టుకునేపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.