‘దళిత మహిళను కాబట్టే నాకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడినా మంత్రి పితాని అధికారంతో ఏ పనులూ చేయలేకపోయా, అవమానం భరించలేక, అడుగడుగునా మంత్రి పితాని అడ్డుపడటంతోనే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నాను’ ఇవి అధికార పార్టీకి చెందిన పెనుగొండ మండల ఎంపీపీ సురేఖ వ్యాఖ్యలు. తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెనుగొండ మండల ఎంపీపీ పదవి వివాదం రాజీనామా వరకు వెళ్లింది. పెనుగొండ ఎంపీపీగా ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉండే సురేఖకు పార్టీ నాయకులు పగ్గాలు అందించారు. అయితే చివరి నిమిషంలోటీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ సురేఖ పితాని వర్గం కాకపోవడంతో మరో వ్యక్తిని ఎంపీపీగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు.