తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చి బుట్టా రేణుకను గెలిపించారన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారు. ఎందుకంటే నవంబర్ 2 నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ పాదయాత్రలో టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు. పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్ జగన్ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు. రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని వైఎస్‌ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదు. బలహీన వర్గాలకు చాలా హామీలిచ్చి మోసం చేశారు.