బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి! | Youth Congress Workers Stage Protest Outside Of Nitin Gadkaris Home | Sakshi
Sakshi News home page

బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!

Published Thu, Sep 12 2019 2:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో భారీ ట్రాఫిక్‌ జరిమానాలు విధిస్తుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ గురువారం వినూత్న నిరసనను చేపట్టింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నివాసం ఎదుట కొన్ని మోటారు బైక్‌లను వదిలేసింది. ఈ బైక్‌ల ధరల కన్నా చలాన్ల రుసుమే ఎక్కువగా ఉందని, నమ్మశక్యంగానీరీతిలో విధించిన ఈ చలాన్లను భరించలేక బైక్‌లను వదిలేసి పోతున్నామని యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ నివాసం ఈ బైక్‌లతో ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్త చట్టంలో సామాన్య ప్రజలు భరించేలేనిరీతిలో జరిమానాలు విధిస్తున్నారని, చాలా కేసుల్లో బైక్‌ల ధరల కన్నా.. జరిమానాల మొత్తం అధికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీ శ్రీనివాస్‌ నేతృత్వంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు పౌరుల వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ నోటీసుల పేరిట తమ వెబ్‌సైట్‌లో వాహనదారుల పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని, కేవలం బండి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉంటే చాలు.. వాహనదారుల పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో తెలుసుకునేవిధంగా ఉన్నాయని, ఇది పౌరుల వ్యక్తిగత ప్రైవసీపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి చేరే అవకాశముందని బీ. శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement