ఢిల్లీ : యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్... వీరిద్దరి గురించి ప్రస్తావిస్తే ఒక విషయం తప్పకుండా గుర్తుకు రావాల్సిందే. అదే 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్. ఆ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్ భారత్‌కు 326 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే ఒక దశలో భారత్ ఓడిపోతుందన్న స్థితిలో వీరిద్దరు కలిసి అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియాకు కప్పును సాధించిపెట్టారు. ఆ సందర్భంలోనే అప్పటి జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి లార్డ్స్ బాల్కని నుంచి చొక్కాను తిప్పడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా యూవీ, కైఫ్‌లు కలిసి భారత్‌కు ఎన్నో విజయాలు సాధించిపెట్టారు.
తాజాగా యువరాజ్ సింగ్ తన ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునే క్రమంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను బుధవారం ఇన్‌స్గాగ్రామ్‌లో షేర్ చేశాడు. మీ బాడీ ఫిట్‌నెస్‌గా ఉంచుకోవాలంటే ఈ కసరత్తులను చేయండి అంటూ పేర్కొన్నాడు. దీనిపై మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. 'యూవీ భయ్యా.. మీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను నాకు పంపండి.. నేను ట్రై చేస్తా. అంతేకాదు నీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ కూడా పంపు. ' అంటూ ట్రోల్ చేశాడు. యూవీ భార్య హాజెల్ కీచ్ కూడా స్పందిస్తూ.. 'ఏయ్ యూవీ.. నీ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చలేదు.' అంటూ పేర్కొంది. బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఎమోజీలు పెట్టి తన సంతోషం వ్యక్తం చేసింది.
కాగా డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ గతేడాది ఆటకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. మొత్తం 18 ఏళ్ల కెరీర్‌లో 304 వన్డేలాడిన యూవీ 8701 పరుగులు చేశాడు.