ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న తెలుగుతేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మరోసారి తన సత్తాను చాటింది. ఇప్పటికే సెమీస్ చేరి ప్రాధాన్యత లేని మ్యాచ్ అయినా సరే... తన దూకుడు ఏమాత్రం తగ్గదని నిరూపించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–9, 21–13 స్కోరుతో అకానె యామగుచి (జపాన్)ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా తన గ్రూప్‌లో అందరినీ ఓడించి మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఈ లీగ్ మ్యాచ్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది.