ఆస్ట్రేలియా పరిమత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ తన కోపాన్ని కుర్చీపై చూపించాడు. రెండోరోజుల క్రితం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్‌గా ఉన్న ఫించ్ రనౌటైన క్రమంలో పెవిలియన్‌లోకి వెళుతూ అక్కడ ఉన్న కుర్చీపై విశ్వరూపం ప్రదర్శించాడు. రెండుసార్లు కుర్చీని బలంగా బాది దాన్ని విరగొట్టే యత్నం చేశాడు.
ఆదివారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య బిగ్‌బాష్ ఫైనల్‌మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ఫించ్ బ్యాటింగ్ చేసే క్రమంలో అతని ఏమరుపాటు కారణంగా అనుకోకుండా రనౌట్ అయ్యాడు.ఫించ్‌కు మరో ఎండ్‌లో ఉన్న కామెరూన్ బంతిని ఆడాడు. దీన్ని బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. ఈలోపు అనవసర పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఫించ్ కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేసేది లేక పెవిలియన్ చేరేటప్పుడు దారిలో ఉన్న చైర్‌ను రెండుసార్లు బ్యాట్‌తో కొట్టాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
‘అసలు దీని ద్వారా ఏం సందేశం ఇద్దామని అనుకుంటాన్నావ్ ఫించ్’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా, ‘అతని దెబ్బకు కుర్చీ దాదాపు చెత్త అయిపోవడం ఖాయం’ మరొకరు సెటైర్ వేశాడు. ‘ఫించ్ కెమెరాకు చిక్కావ్.. నీకు జరిమానా తప్పదు’ మరొకరు ఎద్దేవా చేశాడు. అసహనంలో ఇలా ప్లాస్టిక్ చైర్‌పై దాడి చేయడం నీకు తగదు.. ఇదేమీ గొప్పగా అనిపించడం లేదు. ఇది పిల్లలకు ఒక చెడు సందేశం’ అని మరో అభిమాని విమర్శించాడు.ఇదిలా ఉంచితే, కుర్చీపై తన కోపాన్ని ప్రదర్శించిన ఫించ్‌కు బీబీఎల్ యాజమాన్యం మందలింపు సరిపెట్టింది. ఇలా మరొకసారి చేయవద్దని హెచ్చరించింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఫించ్ నేతృత్వంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది.