రెండో టెస్టు: సాహో సాహా! | Watch, Saha Takes One Handed Screamer To Get Rid Of De Bruyn | Sakshi
Sakshi News home page

రెండో టెస్టు: సాహో సాహా!

Published Sun, Oct 13 2019 11:04 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

పుణే: దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో చాలాకాలం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండో టెస్టుఆదివారం నాల్గో  రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ఆడుతున్న క్రమంలో సాహా మరో అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన డిబుయ్రిన్‌ ఓ బంతిని లెగ్‌సైడ్‌కు ఆడబోగా అది బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వెళుతున్న క్యాచ్‌ను సాహా అద్భుతమైన డైవ్‌ కొట్టి మరీ పట్టుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాల్గో బంతిని డిబ్రుయిన్‌(8) ఆడబోగా అది కాస్తా బ్యాట్‌ అంచుకు తగిలి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతుండగా సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు.

డైవ్‌లు కొట్టి క్యాచ్‌లు అందుకోవడంలో సాహాకు తిరుగులేదు. గతంలో కూడా చాలా సందర్బాల్లో సాహా అసాధారణ క్యాచ్‌లతో మైమరిపించాడు కూడా. ఈ టెస్టు సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటలో కూడా డిబ్రుయిన్‌ క్యాచ్‌ను సాహానే అందుకున్నాడు. అది కూడా డైవ్‌ కొట్టి పట్టుకున్నాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్‌ లో డిబ్రుయిన్‌ మళ్లీ సాహా వలలో చిక్కాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డిబ్రుయిన్‌.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సాహా అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతోనే వెనుదిరిగాడు. దాంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు ఓపెనర్‌ మార్కరమ్‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

ఇషాంత్‌ శర్మ నుంచి తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన మార్కరమ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌కు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ప్రమాదంలో పడింది. ఈరోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సఫారీల చేత ఫాలోఆన్‌ ఆడించడానికి మొగ్గుచూపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement