క్రికెట్‌లో ఆటగాళ్లు హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరడం కొత్తేమీ కాదు. దిగ్గజ ఆటగాళ్ల సైతం హిట్ వికెట్‌గా ఔటైన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. సాధారణంగా బ్యాట్స్‌మన్ బంతిని కొట్టిన తర్వాత అదుపు చేసుకోలేక వికెట్లపై పడటమే హిట్ వికెట్‌లో ఎక్కువ చోటు చేసుకుంటుంది. అయితే బంతిని వదిలేసి, వికెట్లను హిట్ చేసిన సందర్భాల్లో అరుదుగానే చెప్పాలి. ఈ తరహాలో ఔటయ్యాడు పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో మాలిక్ బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్లను కొట్టేశాడు. ఇది అటు అభిమానులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లలో నవ్వులు పూయించింది. ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన 47 ఓవర్ నాల్గో బంతిని ఆడే క్రమంలో వికెట్లను కొట్టేశాడు మాలిక్. ఇక్కడ మాలిక్‌ను దురదృష్టం వెంటాడటంతో భారంగా పెవిలియన్ చేరాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు సాయంతో 41 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్న మాలిక్ ఇలా ఔట్ కావడం పాక్ శిబిరంలో నిరాశ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో అయితే మాలిక్ ఔటైన తీరు ఫన్నీగా మారిపోయింది.