డుప్లెసిస్‌ను వదల్లేదు..! | Watch Video, Netizens Hail Sahas Juggling Low catch To Get DuPlessis | Sakshi
Sakshi News home page

డుప్లెసిస్‌ను వదల్లేదు..!

Published Sun, Oct 13 2019 11:58 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

సాహాలో కసి కనిపిస్తుంది.  ఆట ద్వారా తనను తాను నిరూపించుకోవాలనే కసి కనిపిస్తుంది. తనను చాలాకాలం పక్కన పెట్టిన కసి కనిపిస్తుంది. తానొక అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మరోసారి చాటుకోవాలని కసి కనిపిస్తుంది. జట్టుకు కీపింగ్‌ అనేది ఎంత కీలకమో తెలియజేయాలనే కసి కనిపిస్తోంది. తనను మళ్లీ తీసేస్తే టీమిండియా ఆలోచించాలనే కసి కనిపిస్తోంది. అందుకే సాహా చెలరేగిపోతున్నాడు.  ప్రధానంగా తన కీపింగ్‌పై అపారనమ్మకమున్న సాహా తనకు వచ్చిన అవకాశాల్ని ఏమాత్రం వదులుకోవడం లేదు.

పుణే: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లను వృద్ధిమాన్‌ సాహా పట్టగా, అందులో డిబ్రుయిన్‌ క్యాచ్‌ అద్భుతమైనది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎడ్జ్‌ తీసుకున్న బంతిని సాహా డైవ్‌ కొట్టి అందుకున్నాడు. అదే సీన్‌ను మళ్లీ రిపీట్‌ చేశాడు సాహా. అదే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో డిబ్రుయిన్‌ లెగ్‌సైడ్‌కు ఆడిన బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోగా అమాంతం గాల్లోకి ఎగిరి మరీ పట్టేసుకున్నాడు. దాంతో సఫారీలు 21 పరుగుల వద్దే రెండో వికెట్‌ కోల్పోయారు. కష్ట సాధ్యమైన క్యాచ్‌ను తనకే సాధ్యమైనట్లు సాహా అందుకోవడం ఈ రోజు ఆటలో ఒక హైలైట్‌. అయితే ఇది జరిగిన కాసేపట్లోనే సాహా మరో అద్భుతం చేశాడు.

డుప్లెసిస్‌ను వదల్లేదు..
ఫాలోఆన్‌ ఆడుతున్న సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అశ్విన్‌ వేసిన 24 ఓవర్‌ మూడో బంతి డుప్లెసిస్‌ బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయినంత పని అయ్యింది.  తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా వదల్లేదు. తనను బ్యాలెన్స్‌ చేసుకుంటూనే బంతిని గాల్లో ఉండగానే పట్టేసుకున్నాడు.  సాహా ఇలా క్యాచ్‌ పట్టాడో లేదో.. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ సాహా అత్యుత్తమ వికెట్‌  కీపర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక తనను తప్పించాలంటే ఆలోచించాలనే సంకేతాలు పంపాడు. ‘ వచ్చే నెలకు 35వ ఒడిలో అడుగుపెట్టనున్న సాహా.. తన సామర్థ్యం ఏమిటో జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిసేలా చేశాడు’  అంటూ కొనియాడుతున్నారు. నాల్గో రోజు లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఈ నాలుగు వికెట్లలో అశ్విన్‌ రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు. ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను అందుకోవాలంటే ఇంకా 252 పరుగుల వెనుకబడి ఉంది. దాంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం ఖాయంగా కనబడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement