బెంగళూరు : ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధిస్తూ, విశ్వ రహస్యాలను సైతం ఛేదిస్తున్నా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. తాజాగా సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఘటననే దీనికి నిదర్శనం. సూర్యగ్రహణం రోజున అంగవైకల్యం కలిగిన పిల్లల శిరస్సు వరకు మట్టిలో పాతితే.. అంగవైకల్యం పోతుందన్న భూత వైద్యుడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు.. చెప్పిందే చేశారు. మెడ వరకు గొయ్యి తీసి.. పిల్లలను పాతిపెట్టారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో చేశారు.
కలబురాగి జిల్లా తాజ్‌సుల్తానాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ప్రజలు అంగవైకల్యంతో బాధపడుతున్న తమ చిన్నారులను మట్టిలో కప్పిపెట్టారు. వారు చేసిన వింత పని అందరిని విస్తుపోయేలా చేసింది. చిన్నారులు ఏడుస్తున్నా పట్టించుకోకుండా చాలా సేపు అలాగే ఉంచారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. కాగా గురువారం దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనం ఇచ్చింది. ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం11.11 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు.