పిల్లి కల్లు మూసుకుని పాలు తాగుతుందంటారు. మరి కళ్లు తెరిచి ఐస్‌క్రీమ్ తినగలదా? తింటే దాని రియాక్షన్ ఎలాగుంటుంది? ఇదిగో, ఇలాంటి అనుమానాలు వచ్చాయో వ్యక్తికి. ఇంకేముందీ.. డైనింగ్ టేబుల్‌కు దగ్గరగా కుర్చీని లాగి పిల్లిని కూర్చుండబెట్టాడు. అనంతరం దాని పాలగిన్నె ముందు పెట్టి పాలకు బదులు ఐస్ క్రీం తినిపించబోయాడు. కానీ ఆ పిల్లి అతడికన్నా తెలివైనదానిలా ఉంది. తన వల్ల కాదన్నట్టుగా తలను అటూ ఇటూ ఊపుతూ ఐస్ క్రీం రుచి చూడలేను బాబోయ్ అని వెనక్కు జరుగుతోంది. ఇంతలో ఐస్ క్రీం ఉన్న చెంచాను అంటీఅంటించనట్టుగా దాని మూతకు ఆనించగానే అది కళ్లు తిరిగి పడిపోయినట్లుగా కుర్చీపై వాలిపోయింది. ఈ పిల్లి రియాక్షన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
గత నెలలోనే బయటకొచ్చిన ఈ వీడియోను బాస్కెట్‌బాల్ ఆటగాడు రెక్స్ చాప్‌మాన్ మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "ఓరి.. దీని వేషాలో..", "దీని డ్రామా మామూలుగా లేదుగా" అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీకు నవ్వులాటగా ఉందా? ఇది జంతు హింస కిందకే వస్తుంది", "పాపం దానికి ఐస్‌క్రీమ్ అస్సలు నచ్చలేదు, దాన్ని చూస్తుంటే బాధగా ఉంది" అని మార్జాలంపై జాలి చూపుతున్నారు.