ముంబై: మనం అడిగినవాటికి ఎవరైనా 'నో' చెప్తే కోప్పడతాం. కానీ కొందరు ఆగ్రహంతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకుంటామంటూ బసులు కొడుతుంటారు. మహారాష్ట్రలోని ఓ వ్యక్తికి కూడా కోపమొచ్చింది. అంతే.. పెట్రోల్ పంపులో పామును వదిలి తన కసి తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే బుల్దానాకు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి పెట్రోల్ పోయమన్నాడు. అక్కడున్న సిబ్బంది తల అడ్డంగా ఊపుతూ కుదరదని వెళ్లగొట్టారు. కారణం.. అతను పెట్రోల్ కొట్టించేందుకు బండికి బదులు బాటిల్ పట్టుకొచ్చాడు. అయితే తనకు పెట్రోల్ ఇవ్వనందుకు అక్కడి సిబ్బందిపై కక్ష కట్టాడా సదరు వ్యక్తి.
కాసేపటికి మరింత పెద్ద బాటిల్ పట్టుకొచ్చి అందులో నుంచి పెద్ద పామును పెట్రోల్ బంకులోని గదిలో వదిలాడు. ఆ పాము వెంటనే వెంటనే అక్కడి బల్ల కిందకు దూరిపోయింది. ఆ సమయంలో గదిలో ఒకే ఒక మహిళ ఉంది. దీంతో ఆమె బిక్కుబిక్కుమంటూనే నెమ్మదిగా అక్కడి నుంచి ఎలాగోలా బయటకు వచ్చేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ పుటేజీ ప్రకారం ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. అతను ఒక్క పాముతో వదల్లేదని, మరో పామును కూడా తీసుకొచ్చి గదిలో వదిలేశాడని పెట్రోల్ బంకు సిబ్బంది పేర్కొన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గదిలో ఉన్న మహిళను ధైర్యవంతురాలని కొనియాడుతుండగా, పామును పట్టుకొచ్చి ప్రతీకారానికి పూనుకున్న వ్యక్తికి సిగ్గులేదని తీవ్రంగానే విమర్శిస్తున్నారు.