మీకు బాగా ఆకలి వేస్తుందనుకోండి. ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే ఏముందో అది తినేస్తారు. అదే బయట ఉంటే అర్జంటుగా హోటల్‌కు వెళ్లి నచ్చింది తినేస్తారు. లేదంటే పార్సిల్ కట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు. మరి ఆ మధ్యలోనే మీ తిండినెవరైనా గద్దలా తన్నుకుపోతే ఎలా ఉంటుంది? తలుచుకోడానికే కష్టంగా ఉంది కదూ.. ఇంచుమించు ఇలాంటి ఇబ్బందికర ఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. ఆహార పొట్లంతో పాటు ఓ కూల్‌డ్రింక్‌ను పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై సీగల్స్(సముద్ర పక్షులు) కన్ను పడింది. అతని చేతిలో ఉన్న పొట్లాన్ని అందుకునేందుకు అతన్ని ఫాలో చేశాయి.
దీంతో ఎలాగైనా వాటి బారి నుంచి తన తిండిని కాపాడేందుకు అతను పరుగు లంకించుకున్నాడు. అయినా సరే, అతన్ని వదిలేది లేదని ఆ పక్షులు కూడా వెనకాలే వెళ్లాయి. ఇవి నన్ను వదిలేలా లేవని ఆయన వెంటనే ఓ దుకాణంలోకి చొరబడటంతో ఆ పక్షులు అతడిని విడిచిపెట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను డార్విన్ అవార్డ్ ట్విటర్‌లో షేర్ చేశారు. "సీగల్స్ మీ చుట్టూరా ఉన్నప్పుడు తినే ప్రయత్నం చేయకండి" అని క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వలేకుండా ఉండలేకపోతున్నారు.