ఓక్లహోమా: కరోనా వచ్చిన తర్వాత మాస్క్ కూడా మన శరీరంలో ఓ అవయవంగా మారిపోయింది. అనేక చోట్ల మాస్కు లేకుండా గడప దాటితే జేబుకు చిల్లు పడేలా జరిమానా వసూలు చేస్తున్నారు. అటు కరోనా కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనాలు స్వతాహాగానే మాస్కు ధరించే బయటకు వెళుతున్నారు. అయితే మాస్కు పెట్టుకోమని విజ్ఞప్తి చేసినందుకు ఓ మహిళ దురుసుగా ప్రవర్తించిన ఘటన అమెరికాలోని ఓక్లహోమాలో చోటు చేసుకుంది. ఓక్లహోమా సిటీకి చెందిన ఓ మహిళ మాస్కు లేకుండానే చెప్పుల షాపులోకి వెళ్లింది. అక్కడున్న మహిళా సిబ్బంది ఆమెను మాస్కు పెట్టుకోమని సూచించింది. సదరు వినియోగదారురాలు అదేమీ పట్టించుకోలేదు.
దీంతో ఆమె మరోసారి చెప్పి చూసింది. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ దగ్గరున్న షూ బాక్సులను తీసుకుని సిబ్బందిపైకి విసిరిపారేసింది. అనంతరం ప్రధాన ద్వారం గుండా బయటకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న మహిళా సిబ్బంది వెంటనే తేరుకుని "మీరు నాపై దాడి చేశారు.. మీ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి" అంటూ ఆమె వెనకాలే వెళ్లింది. కానీ అప్పటికే ఆమె కారులో వెళ్లిపోయింది. అయితే ఆమె పర్సును కౌంటర్‌లో వదిలి వెళ్లిపోవడంతో దాని ఆధారంగా షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 8న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన తాలూకు వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.