ఇస్లామాబాద్ : జన సమూహం ఉన్నచోట పొరపాటున తుమ్మినా అందరూ మనవైపే అనుమానంతో కళ్లు పెద్దవి చేసి చూస్తారు. ఆస్పత్రికిగానీ వెళ్లామంటే పక్కా కరోనానే అని ఫిక్సయిపోయి పలకరింపు కాదు కదా.. దరిదాపుల్లో కూడా కనిపించరు. అలాంటిది కోవిడ్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది కూడా మాస్కు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా! ఇంకేముందీ.. పై ప్రాణం పైనే పోతుంది. ఇలాంటి షాకింగ్ ఘటన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగింది. స్థానిక న్యూస్ ఛానల్ రిపోర్టర్ పెషావర్‌లో పెట్రోల్ సంక్షోభం గురించి క్షేత్ర స్థాయిలో వివరిస్తూ ఉన్నాడు. ముఖానికి మాస్కు ఉన్నప్పటికీ కర్మకాలి దాన్ని కిందికి లాగి నేరుగా మాట్లాడుతున్నాడు. "చాలా చోట్ల పెట్రోల్ దొరకడం లేదు. ఉన్న కొద్ది పెట్రోల్ బంకుల్లో బారెడంత క్యూ ఉంది" అని చెప్పుకొస్తున్నాడు.
అనంతరం అక్కడున్న ఓ వ్యక్తికి మైక్ అందించి తాజా పరిస్థితి గురించి చెప్పమన్నాడు. వెంటనే అతను 'అవును, ఇక్కడ పెట్రోలే దొరకట్లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 'నాకు కరోనా ఉంది. ఆస్పత్రికి వెళ్తున్నా' అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఒక్క క్షణం ఆ జర్నలిస్టు గుండె ఆగి పోయినట్లు అనిపించింది. పైగా సదరు కరోనా పేషెంట్ కూడా ఫేస్ మాస్కు ధరించకపోవడం ఇక్కడ మరింత విషాదం. ఈ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓవైపు తన్నుకొస్తున్న నవ్వును ఆపుకుంటూనే నెటిజన్లు.. పాపం రిపోర్టర్ అంటూ సానుభూతి కురిపిస్తున్నారు. కొందరేమో నిర్లక్ష్య కరోనా పేషెంట్‌పై మండిపడుతున్నారు.