Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Conspiracy with EC new rules on validity of postal ballot
కుట్రపూరితం! పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ విష­యంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్‌ నంబర్‌తో డిక్లరేషన్‌ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్‌ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్‌ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్‌.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్‌ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్‌ అధికారి హోదా వివరాలు, సీల్‌ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేయడం ద్వారా పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్‌ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్‌ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్‌ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్‌ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్‌ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్‌ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంత మంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్‌) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్‌ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్‌ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సీల్‌ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్‌ వేయకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు
తెలంగాణ రాష్ట్ర గేయం రెండు వెర్షన్లు

సాక్షి, హైదరాబాద్‌: ‘జయ జయహే తెలంగాణ’ గేయం రెండు వెర్షన్లను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తి అవుతున్న సందర్భంగా జూన్‌ 2న ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లోనే ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్నిఅందరి ఆమోదంతో, భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు వెల్లడించారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించామన్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం సాయంత్రం సచివాలయంలో అధికార, మిత్రపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఎం.. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో అందెశ్రీ, కీరవాణితో పాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు పార్లమెంటులో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2.30 నిమిషాల్లో మూడు చరణాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్‌గా, 13.30 నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌గా రూపొందించారు. రెండున్నర నిమిషాల వెర్షన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా కార్యాచరణ ‘రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలనే నిర్ణయం కూడా జరిగింది. కొత్త అధికారిక చిహ్నానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు అందాయి. ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. తుది రూపమేదీ ఖరారు కాలేదు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదు. కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా మా కార్యాచరణ ఉంటుంది..’ అని రేవంత్‌ చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన రాష్ట్ర గేయం అందరినీ అలరించింది. ఇలావుండగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ధనవంతుల విగ్రహంలా ఉందంటూ.. తెలంగాణ కష్టజీవుల బతుకు పోరాటం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం చెప్పినట్లు తెలిసింది. టీఎస్‌కు బదులు టీజీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు ఈ సమావేశంలో సీఎం తెలిపారు. ‘వాహనాల రిజి్రస్టేషన్‌ నంబర్లకు సంబంధించి, అలాగే అన్ని ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా టీఎస్‌ను టీజీగా మార్పు చేశాం..’ అని చెప్పారు.

YSRCP amendment petition challenging latest order of Election Commission: AP
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం

సాక్షి, అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్‌ మోషన్‌ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలై­లో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టీడీపీకి అను­కూలంగా వాటిని సడలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయ­వాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్‌ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్‌ అవసరం అయినా, ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్‌ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్‌ చెప్పారు.ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్‌ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్‌ చెప్పిన విషయాలను రికార్డ్‌ చేసింది. అవినాష్‌ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్‌ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Lok Sabha Election 2024: Congress Party strangled Constitution during Emergency says PM
Lok Sabha Election 2024: ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు

హోషియార్‌పూర్‌: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు. అవినీతిలో కాంగ్రెస్‌ డబుల్‌ పీహెచ్‌డీ కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్‌ పీహెచ్‌డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్‌ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ గర్భంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్‌ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్‌ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్‌లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్‌’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్‌ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్‌ మెమోరియల్‌లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్‌ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు.

Israel-Hamas war: Israeli forces kill 53 people across enclave
Israel-Hamas war: ఇజ్రాయెల్‌ దాడుల్లో 53 మంది మృతి

గాజా: ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇద్దరు పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీకి చెందిన పారా మెడికల్‌ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్‌ అస్‌–సుల్తాన్‌ ప్రాంతంలో జరిగిన బాంబుదాడిలో బాధితులకు సాయం అందించేందుకు వెళ్లగా వీరు గాయపడినట్లు వెల్లడించింది. తాజా మరణాలతో గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్లు అంచనా. ఇలా ఉండగా, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ గురువారం తెలిపింది.

Tight security for India Pakistan T20 World Cup match
నిఘా నీడలో... భారత్‌–పాకిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌

న్యూయార్క్‌: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్‌ 9న భారత్, పాకిస్తాన్‌ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియం’లో జరిగే మ్యాచ్‌ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్‌ అటాక్‌’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్‌ జరిగే రోజు ఐసన్‌ హోవర్‌ పార్క్‌ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ బ్రూస్‌ బ్లేక్‌మన్, పోలీస్‌ కమిషనర్‌ ప్యాట్రిక్‌ రైడర్‌ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్‌ మ్యాచ్‌ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్‌ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. సుదీర్ఘ సాధన... తొలి రోజు ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్‌ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్‌ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్‌ పార్క్‌లో ఈ ప్రాక్టీస్‌ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉండగా భారత్‌ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్‌ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్‌ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు.

High Court order to Central Election Commission and DGP
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి

సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్‌ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్‌స్పెక్టర్‌ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్‌ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్‌ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్‌స్పెక్టర్‌ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్‌లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

Lok Sabha Election 2024: BJP and Congress in a fierce battle for power in Himachal Pradesh
Lok Sabha Election 2024: హిమాచల్‌ప్రదేశ్‌లో.. బీజేపీకి పరీక్ష!

హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్‌పూర్‌ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తదితరులున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్‌ సింగ్‌ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్‌ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్‌ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ సురేశ్‌ కుమార్‌ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్‌ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్‌ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్‌ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్‌ ప్రతిభాసింగ్‌ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్‌ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్‌ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.హమీర్‌పూర్‌ కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్‌ సింగ్‌ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్‌ కొడుతుందని అనురాగ్‌ ఠాకూర్‌ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్‌ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్‌ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్‌పూర్‌ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Cm Jagan Tweet On YSRCP Completes 5 Years Of Govt
AP: ఐదేళ్ల ప్రజాపరిపాలనపై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: సరిగ్గా ఐదేళ్ల క్రితం చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు.గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఐదుసంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024కాగా151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. అదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన అందించారు. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి జనం దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 TDP Shock To Janasena Polavaram Assembly Constituency
అక్కడ గాజు గ్లాస్‌ ముందే పగిలిందా..?

ఎన్నికల ఫలితాల డేట్‌ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్‌ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్‌ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్‌కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్‌ఆర్‌సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్‌, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement