వార్షికంగా 26% అప్
బ్యాంకింగ్ మోసాల సంఖ్య పెరిగినా..విలువల్లో కట్టడి
2024–25లోనూ 7% పైన వృద్ధి!
ఇదే జరిగితే వరుస మూడేళ్లలో పురోగతి
చెక్కు చెదరని ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ’ ట్యాగ్ వార్షిక నివేదికలో సెంట్రల్ బ్యాంక్ కీలకాంశాలు...
బ్యాంకుల్లో అన్‌క్లైమ్డ్ డిపాజిట్ల విలువ 2024 మార్చితో గడచిన ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరింది. ఖాతాదారులు లేదా వారసుల కోసం ఒకవైపు ప్రయతి్నస్తూనే... మరోవైపు ఇలా ఎవ్వరూ క్లైమ్ చేయకుండా మిగిలిపోయిన మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ ఫండ్‌లో (డీఈఏ) బదలాయించడం జరుగుతుంది. ఈ ఫండ్ ఇలాంటి నిధుల మొత్తం 2023 మార్చి నాటికి రూ.62,225 కోట్లు ఉంది. బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్‌బీఐ పర్యవేక్షణలోని డీఈఏకు బదలాయిస్తాయి.
⇒ భారత్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని సమతౌల్యం చేసే సానుకూల పరిస్థితులూ ఉన్నాయి. 2022–23లో ఎకానమీ 7 శాతం పురోగమిస్తే, 2023–24లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదుకానుంది. 2024–25లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ తన హోదాను కొనసాగించనుంది.
⇒ ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ 2024 మార్చి 31 నాటికి 11.08 శాతం వృద్ధితో రూ.70.48 లక్షల కోట్లకు చేరింది (దాదాపు 845 బిలియన్ డాలర్లు). పాకిస్తాన్ జీడీపీ 340 బిలియన్ డాలర్లకంటే ఇది 2.5 రెట్లు అధికం.
⇒ అంతర్జాతీయంగా దేశీయ కరెన్సీ రూపీని మరింత చలామణీలోకి తేవడంలో భాగంగా భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (పీఆర్‌వోఐ) విదేశాల్లోనూ రూపీ అకౌంట్లను
తెరిచేందుకు అనుమతి.
⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది.
⇒ బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 13,564 నుంచి 36,075కు ఎగసింది. అయితే మోసాలకు సంబంధించిన విలువ మాత్రం 46.7 శాతం పడిపోయి రూ.13,930కోట్లకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment