టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్నేళ్లుగా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడని.. టీ20 ప్రపంచకప్-2024లోనూ కచ్చితంగా ప్రభావం చూపుతాడని అభిప్రాయపడ్డాడు.
కాగా వెన్నునొప్పి కారణంగా బుమ్రా టీ20 ప్రంపచకప్-2022కు దూరమైన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో రోహిత్ సేన సెమీస్‌లోనే ఇంటిబాట పట్టి విమర్శలు మూటగట్టుకుంది.
పునరాగమనంలో
ఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2023లో పునరాగమనం చేసిన బుమ్రా.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో దుమ్ములేపాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గానూ రాణించాడు.
ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు తీసిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఎకానమీ రేటు 6.48.
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీకి ముందు బుమ్రా ఈ మేరకు రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ బుమ్రానే అని ధీమా వ్యక్తం చేశాడు.
లీడింగ్ వికెట్ టేకర్ జస్‌ప్రీత్ బుమ్రానే
‘‘నా అంచనా ప్రకారం.. ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ జస్‌ప్రీత్ బుమ్రానే. అతడొక అద్భుతమైన ఆటగాడు. చాలా ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. న్యూ బాల్ చేతికి ఇస్తే ఓ ఫాస్ట్‌బౌలర్ ఏం చేయగలడో అన్నీ చేయగల సమర్థుడు.
బంతిని సూపర్‌గా స్వింగ్ చేస్తాడు. ఇక ఎకానమీ విషయానికొస్తే.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఓవర్‌కు ఏడు పరుగుల చొప్పున ఇచ్చి వికెట్లు తీశాడు. కఠిన సమయాల్లోనూ బంతితో మ్యాజిక్ చేశాడు.
టీ20 క్రికెట్‌లో ఎలా ఆడాలో అలాగే ఆడాడు. కాబట్టి ఈసారి అతడే లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని భావిస్తున్నా’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
చదవండి: ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: డివిలియర్స్
Comments
Please login to add a commentAdd a comment