
జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)లేకుండానే భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది. వెన్నునొప్పి కారణంగా అతడు ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. యువ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) జట్టులోకి వచ్చాడు. అయితే, ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేరంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting).
కానీ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కు ఉందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు అర్ష్ నైపుణ్యాలు ఏమీ తీసిపోవని.. టీమిండియా బౌలింగ్ విభాగానికి అతడు ప్రధాన బలం కాబోతున్నాడని పేర్కొన్నాడు. కాగా బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
దుబాయ్ వేదికగా మొదట బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత తుదిజట్టులో ఆడబోయే పేసర్ల గురించి ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో భాగంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘బుమ్రా స్థానాన్ని నేనైతే అర్ష్‌దీప్ సింగ్‌తోనే భర్తీ చేస్తాను. టీ20 క్రికెట్‌లో అతడి ఆట తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక అర్ష్ నైపుణ్యాల విషయానికొస్తే.. బుమ్రా మాదిరే అతడు కూడా కొత్త బంతితో ఆరంభ ఓవర్లలో అద్భుతం చేయగలడు.

అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ రాణించగలడు. ఏదేమైనా టీమిండియా బుమ్రా సేవలను కోల్పోవడం నష్టదాయకమే. అయితే, అర్ష్ బుమ్రా లేని లోటును కొంతవరకైనా తీర్చగలడు. ఇక హర్షిత్ రాణా కూడా ప్రతిభావంతుడైన ఫాస్ట్‌బౌలర్ అనడంలో సందేహం లేదు.
అయితే, ఆరంభంలో రాణించినంత గొప్పగా.. ఆఖరి ఓవర్లలో అతడు రాణించలేకపోవచ్చు. అర్ష్‌దీప్ మాదిరి నైపుణ్యాలు అతడికి లేవు. అందుకే నా ఓటు అర్ష్‌కే’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌కు ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వన్డేలు ఆడిన అనుభవం మాత్రమే ఉండగా.. హర్షిత్ రైనా ఇటీవలే అరంగేట్రం చేశాడు.
ఇక అర్ష్‌దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీయగా.. అతడి లిస్ట్-‘ఎ’ గణాంకాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. 33 మ్యాచ్‌లలో కలిపి అతడు 55 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే..అంతర్జాతీయ టీ20లలో మాత్రం 26 ఏళ్ల అర్ష్‌దీప్‌నకు గొప్ప రికార్డు ఉంది. 63 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు కూల్చిన అతడు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.
మరోవైపు హర్షిత్ రాణా టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 6, 3 వికెట్లు తీశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా రూపంలో మరో ఇద్దరు యువ పేసర్లతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్