టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన నైపుణ్యాలున్న ఈ స్టార్ బౌలర్‌పై పనిభారాన్ని తగ్గించే బాధ్యత బీసీసీఐపై ఉందన్నాడు. అదే విధంగా.. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కూడా అతడిపై భారం పడకుండా కాపాడుకోవాలని సూచించాడు.
టీ20 ప్రపంచకప్-2024కు ఎక్కువగా సమయం లేదు కాబట్టి బుమ్రాకు ఎంత ఎక్కువ విశ్రాంతినిస్తే అంత మంచిదని కనేరియా అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ మైదానంలో దిగాడు బుమ్రా.
సఫారీ గడ్డపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించి తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ రైటార్మ్ పేసర్. తద్వారా టీమిండియా సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ సిరీస్ తర్వాత బుమ్రా మళ్లీ ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ ద్వారానే బంతితో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత అతడు ఐపీఎల్-2024తో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా బుమ్రా గురించి మాట్లాడుతూ కీలక సూచనలు చేశాడు.
‘‘జస్ప్రీత్ బుమ్రాకు ఇంకెంతో భవిష్యత్తు ఉంది. సుదీర్ఘకాలం పాటు అతడు కెరీర్ కొనసాగించాలంటే టీమిండియా మేనేజ్‌మెంట్ అతడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఫాస్ట్ బౌలర్ కాబట్టి తరచూ గాయాల బారిన పడటం సహజం.
అందుకే అతడి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బీసీసీఐతో పాటు ముంబై ఇండియన్స్ కూడా బుమ్రా విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ ముంబై తరఫున అతడిని ఐపీఎల్‌లో విశ్రాంతి లేకుండా ఆడిస్తే టీమిండియాకు కచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే తగులుతుంది.
అతడు టీమిండియాకు విలువైన ఆస్తి. తరానికొక్క ఆటగాడు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా’’ అని కనేరియా పేర్కొన్నాడు. ఐపీఎల్ తాజా ఎడిషన్ తర్వాత టీమిండియా ప్రపంచకప్ టోర్నీ ఆడాల్సి ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ ఆఖరి దశ మ్యాచ్‌లలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని సూచించాడు. కాగా వెన్నునొప్పి కారణంగా బుమ్రా టీ20 ప్రపంచకప్-2022కు దూరమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment