డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!
డయాబెటీస్‌కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్‌లో ప్రచురించారు.
25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు.
ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు.
షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్‌లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్‌తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్‌గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.
ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment