సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు
యువత అవకాశాలను కాజేస్తున్న చొరబాటుదార్లు
తృణమూల్ సర్కారుపై మోదీ ధ్వజం
కాక్‌ద్వీప్/మయూర్‌భంజ్/బాలాసోర్: ‘వికసిత్ భారత్’ సాకారం కావాలంటే ‘వికసిత్ బెంగాల్’ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశి్చమ బెంగాల్‌లోకి అక్రమ వలసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, స్థానిక యువతకు దక్కాల్సిన అవకాశాలను చొరబాటుదార్లు కాజేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల భూములను, ఆస్తులను లాక్కుంటున్నారని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతోందని, అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారిచేస్తోందని విమర్శించారు.
బెంగాల్‌లోకి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని కాక్‌ద్వీప్, ఒడిశాలోని మయూర్‌భంజ్, బాలాసోర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
దేశ భద్రతను పణంగా పెడుతున్నారు
‘‘ఇతర దేశాల్లో మత హింస కారణంగా వలస వచి్చన హిందువులకు, మతువాలకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో ఓ వర్గాన్ని మచి్చక చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తోంది. ముస్లింలకు ఓబీసీ హోదా కలి్పంచడాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. కానీ, కోర్టు తీర్పును తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఈ తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోంది. దేశ భద్రతను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెడుతోంది. అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవడం లేదు.
నవీన్ పటా్నయక్ అనారోగ్యం వెనుక కుట్ర!
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఆరోగ్యంగా హఠాత్తుగా క్షీణించిందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పటా్నయక్ తరఫున ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బలమైన లాబీ ఈ కుట్రకు తెరతీసిందా? అనే సందేహాలు లేకపోలేదు. నవీన్ బాబు ఆరోగ్యం క్షీణించడం వెనుక మిస్టరీ ఏమిటో బయటపడాలి. ఒడిశాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవీన్ పటా్నయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంపై కారణాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం’’. అని మోదీ స్పష్టం చేశారు.
నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది: నవీన్ పటా్నయక్
తన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment