అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్‌మెంట్లు ఆదేశించాయి.
21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్‌ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్‌కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.
ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్‌ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment