Job Ad
-
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్‌కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్‌ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
తాత్కాలిక కొలువుల పందేరం!
♦ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట అడ్డగోలు నియామకాలు ♦ కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్లుగా ఇంజనీర్లకు ఉద్యోగాలు ♦ నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా నేరుగా ఉత్తర్వులు ♦ జీతాలు నేరుగా చెల్లిస్తుండటంతో భవిష్యత్తులో క్రమబద్ధీకరించే అవకాశం ♦ ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో దొడ్డిదారిలో 50 మందికిపైగా కొలువులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటన లేదు.. ఏ పరీక్షా లేదు.. రిజర్వేషన్లు అంతకన్నా లేవు.. రోస్టర్ పాయింట్ల లేనే లేవు. అసలు నిబంధనల ఊసే లేదు.ఉన్నత స్థాయిలో పైరవీలతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట దొడ్డిదారిలో కొలువులు ఇస్తున్నారు. కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమిస్తున్నారు. 50 మంది నియామకం.. విద్యుత్ సౌధ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ప్రధాన కార్యాలయాల పరిధిలో ఇప్పటి వరకు 50 మంది ఇంజనీర్లను కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రుల సిఫారసుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. జెన్కోలో 30 మందికి, ట్రాన్స్‌కోలో 20 మందికి టెక్నికల్ అసిస్టెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది. వీరిలో కొందరిని 6 నెలలు, మరికొందరిని ఏడాది కాలానికీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ.. కాలపరిమితి తీరిన ప్రతీసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను సైతం ఖాతరు చేయకుండా నియామకాలు చేసేశారు. నియామకాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో.. వేతనాలను సైతం అంతే అశాస్త్రీయంగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు ఒకేలా ఉన్నా.. సిఫారసు చేసిన నేతల స్థాయినిబట్టి జీతాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు సిఫారసు చేస్తే.. గరిష్టంగా రూ.35 వేలు.. మిగిలిన వారికి రూ.30 వేలు, రూ.25 వేలు, కనిష్టంగా రూ.20 వేల జీతం నిర్ణయించారు. తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలు చెల్లిస్తుండడం అనుమానాలు కలిగిస్తోంది. పెద్ద పోస్టుల భర్తీలోనూ విద్యుత్ సంస్థలు ప్రతిభకు పాతరేశాయి. ఇటీవల తెలంగాణ జెన్కో కాంట్రాక్టు లా ఆఫీసర్ పేరుతో ఓ న్యాయవాదిని ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేకుండా నేరుగా నియమించడం గమనార్హం. ఒకవైపు ఏఈ, సబ్ ఇంజనీర్ల నియామకాల కోసం విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తాత్కాలిక పద్ధతుల్లో ఇంజనీర్లను నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఏఈ, ఎస్ఈల రిక్రూట్మెంట్లలో సైతం పైరవీలకు ఆస్కారముందని, కొందరు ఇప్పటికే వసూళ్లకు తెరలేపడంతో ఇటీవల విద్యుత్ శాఖ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు(జీవో ఎంఎస్ నం.94) ♦ రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యేక రోస్టర్‌ను మెయింటెయిన్ చేయాలి. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ రెగ్యులర్ నియామకాలు జరిపే నియామక సంస్థే కాంట్రాక్టు నియామకాలకు బాధ్యత వహించాలి. ఉద్యోగ నియామక ప్రకటన జారీతో పాటు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాలి. -
జీహెచ్ఎంసీకి కొత్తనీరు!
త్వరలో పలు ఖాళీల భర్తీ సిటీబ్యూరో రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోకి కొత్త ఉద్యోగులు రానున్నారు. వేల రూ. కోట్ల నిధులున్నా, చేయాల్సిన పనులెన్నో ఉన్నా వాటిని పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు తగినంతమంది అధికారులు, ఉద్యోగులు లేరు. దాంతో జీహెచ్ఎంసీలో పలు పనులు ఎక్కడివక్కడే కుంటుతున్నాయి. ఈ పరిస్థితి త్వరలో మారనుంది. తెలంగాణ ప్రభుత్వ తొలి ఉద్యోగ ప్రకటన వెలువడటంతో ఇక దశలవారీగా జీహెచ్ఎంసీలో పోస్టులు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్ మీద తీసుకుంటుంది. అలా వివిధ విభాగాల్లో వెరసి 843 డిప్యుటేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 300కు పైగా ఇంజినీర్ల పోస్టులు కూడా ఉన్నాయి. తొలివిడత భర్తీ కానున్న ఇంజినీర్ల పోస్టుల్లో దాదాపు వందమంది జీహెచ్ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఆయా బాధ్యతలు నిర్వహించేందుకు పబ్లిక్‌హెల్త్, డీటీసీపీ, టీఎస్పీడీసీఎల్, డెరైక్టరేట్ ఆఫ్ హెల్త్, హార్టికల్చర్, పోలీస్, పశుసంవర్థకశాఖ, ఆడిట్, అగ్నిమాపక శాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖ, న్యాయవిభాగం, గణాంక.. తదితర విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో త్వరలో భర్తీ కానున్న పోస్టుల్లో నియమితులయ్యేవారు గణనీయసంఖ్యలో జీహెచ్ఎంసీకి వచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ అవసరాల దృష్ట్యా 2607 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందని ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే ప్రసాదరావు కమిటీ సిఫార్సు చేసింది. అందులో 1300 పోస్టుల్ని తొలిదశలో భర్తీచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు.. తదితర పరిణామాల నేపథ్యంలో అవి భర్తీ కాకుండా పెండింగ్‌లో పడ్డాయి. ఇదిలా ఉండగా, గ్రేటర్లో పెద్దఎత్తున చేపట్టనున్న గృహనిర్మాణ కార్యక్రమానికి ఇంజినీరింగ్ విభాగానికి 390 మంది టెక్నికల్ అధికారులు అవసరమని కోరారు. తొలి నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్న ఇంజినీర్లలో దాదాపు వందమంది జీహెచ్ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు. బీపీఎస్ అమలుకు 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు.. భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు..త్వరలోనే అమల్లోకి రానున్న బీపీఎస్‌ను అమలు చేసేందుకు కనీసం 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా కావాలని కోరారు.స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం అమలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 18 మంది అధికారులను జీహెచ్ఎంసీకి పంపించాలని కోరారు. ఇలా వివిధ విభాగాలు, అంశాల వారీగా దాదాపు 1500 మంది అధికారులను ప్రథమప్రాధాన్యతగా భర్తీ చేయాల్సిన అవసరముందని జీహెచ్ంఎసీ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.