దానికి చంద్రబాబు వైరస్ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడ
అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే
గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక
సీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..
పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్ర
అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్
చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం
గోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నం
అందులో భాగమే సీఎస్‌పై అభూతకల్పనలతో కథనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే ఎన్నికల కమిషన్ అంపైర్‌లా నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని.. పోలింగ్ రోజు నుంచి ఇప్పటివరకూ వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అన్నింటినీ గత ఐదేళ్లూ సీఎం జగన్ అమలుచేశారు. సుపరిపాలన అందించారు.
పరీక్షలో వంద శాతం మార్కులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం పరీక్షలు అలాగే రాశాం. వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యం. వారంలో టీడీపీ పీడ విరగడ కావడం ఖాయం. బహుశ బీజేపీకి ఉత్తరాదిలో కలిసొస్తుందన్న కారణంతో అమిత్ షా దక్షిణాదిలో సీట్లు వస్తాయని చెప్పారేమో. ఉద్యోగులూ సమాజంలో భాగమే. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు.. తమకు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ భ్రమపడుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై సీరియల్ నంబర్‌లేదని తిరస్కరించారు. ఈసారి ఏమీలేకున్నా పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలు జారీచేసినా దేశమంతా ఒకేలా ఉండాలి. దేశమంతా ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలుచేయాలి.
మాచర్లలో పిన్నెల్లి లక్ష్యంగా కుట్ర..
ఇక 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతోందో అందరూ గమనించాలి. అక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోంది. మాచర్ల కేంద్రంగా టీడీపీ, ఎల్లోమీడియా గందరగోళం సృష్టిస్తోంది. నిష్పక్షపాతంగా ఈసీ వ్యవహరించాలన్నదే మా కోరిక. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకినట్లుగా ఉంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరే ఈ అనుమానాలకు కారణం. ఈసీ జోక్యం మాచర్ల కేసులో తీవ్రంగా కనిపిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసినట్లుగా ఉన్న వీడియో ఎలా బయటకొచ్చిందో ఈసీ చెప్పడంలేదు. అదే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలను బయటపెట్టాలి. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడుల వీడియోలనూ బయటపెట్టాలి. ఈవీఎంలు ధ్వంసమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో రిగ్గింగ్‌కు పాల్పడింది కాబట్టే టీడీపీ రీపోలింగ్ కోరడంలేదు. వైఎస్సార్‌సీపీకి అన్యాయం జరిగింది కాబట్టే ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్ కోరుతున్నారు.
పదిరోజులు ఆ సీఐ నిద్రపోయారా?
ఇక ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వగానే.. పోలింగ్ మరుసటి రోజు అంటే ఈనెల 14న జరిగిన అల్లర్లలో తన తలకు గాయమైందని.. ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారని పది రోజుల తర్వాత సీఐ కేసు పెట్టడమేంటి? పది రోజులూ సీఐ ఎక్కడ నిద్రపోయారు? ఆ సీఐ తరఫున ప్రైవేట్ లాయర్ ఎలా వాదిస్తారు? ఇందుకు ఈసీ ఎలా అనుమతిస్తుంది. పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు.
అలాగే, మాచర్లలో పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేశారు. కారంపూడిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, ఆస్తులపై టీడీపీ రౌడీలు ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడితే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంలో ఆంతర్యమేమిటి? పోలింగ్ అయిపోయిన తరువాత బైండోవర్, రౌడీషీట్లు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇదంతా తాత్కాలికమే. ఫలితాల అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. గీత దాటి పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
కౌంటింగ్ సమయంలో ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలి
చంద్రబాబు గతంలో ఎన్నికల కమిషన్‌పై ఎలా దాడికి వెళ్లారో చూశాం. వైఎస్ జగన్ ఎప్పుడూ ఈసీపై చంద్రబాబులా వ్యవహరించలేదు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కౌంటింగ్ సమయంలోనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మేం కోరుతున్నాం. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
గోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వ హననానికి పాల్పడి.. బెదిరించి అధికారులను లొంగదీసుకుని తమ వైపు తిప్పుకునేలా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం. ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ (సీఎస్)ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయనపై అభూతకల్పనలతో తప్పుడు కథనాలు అచ్చేసి.. వాటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment