మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే.
ఎటు చూసినా అంతా హిస్పానిక్
భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్‌నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్‌స్టిట్యూషన్ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్.
క్రియేటివ్ సిటీగా..
మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్‌లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.
మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా.
చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్
మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది.
ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్ బాట పట్టాం !
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment