Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment: Atchannaidu Open U On CBN Cheating1
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!

ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్‌ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్‌ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్‌ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్‌తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్‌ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్‌ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్‌దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్‌ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kethireddy Venkatarami Reddy Sensational Comments On Chandrababu And Pawan Kalyan2
కూటమి కొత్త కథ .. రాబోయే రోజుల్లో పవన్‌ జీరో

సాక్షి: తాడేప‌ల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్‌లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్‌కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్‌లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్‌ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్‌లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్‌ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్క‌ర్ కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు స‌మ‌ర్పించ‌కుండానే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా క‌థ‌నాలు ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి. జ‌డ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముంద‌రే ఈ రెండు పేప‌ర్ల‌కి ఎలా లీక‌వుతోంది.? ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో ఎవ‌రి మీద‌నైతే వార్త‌లు రాస్తున్నారో సిట్ వారి మీద‌నే కేసులు న‌మోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పిన‌ట్టు సిట్ న‌డుస్తుందా అనే అనుమానాలు క‌ల‌గకుండా ఉండ‌వు. సిట్ కి విశ్వ‌స‌నీయత లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్‌ల నిండా వేల కోట్ల డ‌బ్బులు దాచిపెట్టార‌ని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్ల‌లో డిబేట్లు న‌డుపుతున్నారు. త‌ప్పుడు క‌థ‌నాలు రాసి విష ప్ర‌చారం చేస్తున్నారే కానీ, ఎక్క‌డా అంత పెద్ద మొత్తంలో సిట్ డ‌బ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ప్పుడు రూ.50 వేల కోట్ల లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఆ విలువ‌ను రూ. 3,500 కోట్ల‌కు త‌గ్గించుకుంటూ వచ్చారు. న్యాయ‌ప‌రంగా ప్ర‌భుత్వ అరాచకాల‌ను ఎండ‌గ‌ట్టే ఏ అవ‌కాశాన్ని మేం వ‌దులుకోం. ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీస్తాం. కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.డిస్టిల‌రీన్నీ చంద్ర‌బాబు అనుమ‌తుల‌తో ఏర్పాటైన‌వే:డిస్టిల‌రీల నుంచి క‌మీష‌న్లు తీసుకున్నార‌నేది సిట్ చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ. కానీ వాస్త‌వంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిల‌రీల‌న్నీ చంద్ర‌బాబు అనుమ‌తులిచ్చిన‌వే. వైయ‌స్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వ‌లేదు. కొంత‌మంది అధికారుల‌ను లోబ‌ర్చుకుని, బెదిరించి, భ‌య‌పెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు న‌మోదు చేశారు. లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెప్ప‌డానికి సిట్ వ‌ద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయ‌స్సార్సీపీని ఇబ్బంది పెట్టాల‌న్న ఉద్దేశ్యంతోనే క‌క్ష‌పూరితంగా లిక్క‌ర్ కేసును సృష్టించారు.రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు:నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబ‌స్తు క‌ల్పించాల‌ని కోర్టు స్ప‌ష్టంగా చెప్పినా పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పోలీసులు య‌థేచ్చ‌గా చ‌ట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి కూట‌మి నాయ‌కుల అరాచ‌కాల‌కు స‌హ‌క‌రిస్తున్న పోలీసులు, ప్ర‌భుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వైయ‌స్సార్సీపీని ఎంత అణ‌గ‌దొక్కాల‌ని చూస్తే అంత‌కు మూడింత‌లు బ‌లంగా తిర‌గ‌బ‌డ‌తాం. వైఎస్సార్‌సీపీ పోరాటాలు కొత్త‌కాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొద‌లైంది.ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయారు:త‌న‌కు పాల‌న చేత‌కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చెప్పేశాడు. ఏదైనా అల‌జ‌డి సృష్టించి వైఎస్సార్‌సీపీ మీద బుర‌ద జ‌ల్ల‌డానికే చంద్ర‌బాబు ఆయ‌న్ను వాడుకుంటున్నాడు. ఆయ‌న‌కున్న సినిమా క్రేజ్‌ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో ల‌బ్ధిపొందింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌లం, బ‌ల‌హీన‌త జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తిగా అర్థ‌మైంది. రాబోయే రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ జీరో కావ‌డం త‌థ్యం. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్య‌మయ్యార‌ని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉంద‌ని ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మా ప్ర‌భుత్వ హ‌యాంలో న‌మోదైన కేసును కూట‌మి ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. దీనిపై క్రిమిన‌ల్ రివిజ‌న్ పిటిష‌న్ వేసి న్యాయ‌స్థానాల్లో పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi says BC reservation is Central Govt Responsibility3
కేంద్రానిదే బాధ్యత: రాహుల్‌గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్‌రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్‌ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్‌ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్‌ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్‌ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్‌ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్‌ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్‌ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్‌ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్‌రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్‌రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్‌ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్‌ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర, సంవిధాన్‌ బచావ్‌ ర్యాలీల్లో రాహుల్‌గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్‌.. జై సంవిధాన్‌’ అనే రాహుల్‌ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్‌రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్‌కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్‌రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్‌ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్‌ గాందీని అభినందిస్తున్నా. రాహుల్‌ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు.

ENG VS IND 4th Test Day 2: England team in strong position4
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు

మాంచెస్టర్‌: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ మళ్లీ ‘బజ్‌బాల్‌’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్‌ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్‌లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను గాయపడిన రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు దిగి ఆదుకున్నాడు. టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శార్దుల్‌ ఠాకూర్‌ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్‌ ఆర్డర్‌పై ప్రతాపం చూపిన బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్‌ (20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), రూట్‌ (11 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్‌ కంబోజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. తడబడిన మిడిలార్డర్‌ రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ సెషన్‌ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్‌ ముగిసింది. రెండో సెషన్‌లో పంత్, సుందర్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్‌ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలో సుందర్‌ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్‌ కంబోజ్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో 6 కొట్టిన పంత్‌... స్టోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్‌... పంత్‌తో పాటు బుమ్రా (4) వికెట్‌ పడగొట్టడంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలీ (బి) వోక్స్‌ 46; సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్‌ 12; పంత్‌ (బి) ఆర్చర్‌ 54; జడేజా (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 20; శార్దుల్‌ (సి) డకెట్‌ (బి) సోŠట్‌క్స్‌ 41; సుందర్‌ (సి) వోక్స్‌ (బి) స్టోక్స్‌ 27; అన్షుల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; బుమ్రా (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 4; సిరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్‌) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్‌: వోక్స్‌ 23–5–66–1, ఆర్చర్‌ 26.1–3–73–3, కార్స్‌ 21–1–71–0, స్టోక్స్‌ 24–3–72–5, డాసన్‌ 15–1–45–1, జో రూట్‌ 5–0–19–0. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) అన్షుల్‌ 94, ఒలీ పోప్‌ (బ్యాటింగ్‌) 20; రూట్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. బౌలింగ్‌: బుమ్రా 13–4–37–0, అన్షుల్‌ కంబోజ్‌ 10–1–48–1, సిరాజ్‌ 10–0–58–0, శార్దుల్‌ 5–0–35–0, జడేజా 8–0–37–1. ఫ్రాక్చరైనా... ప్యాడ్లు కట్టుకొని... తొలి రోజే రిషభ్‌ పంత్‌ గాయపడటంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్‌ సంధించిన బంతి పంత్‌ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తదనంతరం స్కానింగ్‌లో బొటనవేలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్‌ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్‌పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్‌ పంత్‌ క్రీజ్‌లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్‌ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఆడటం వల్లే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్‌ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్‌ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాను అవుట్‌ చేశాడు.

Sakshi Editorial On Britain, India trade5
స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం

దాదాపు నాలుగేళ్ల కాలం... పదహారు దఫాల చర్చలు... నలుగురు ప్రధానులు– ఎట్టకేలకు బ్రిటన్‌ అభీష్టం నెరవేరింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ల సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్‌ గోయెల్, జొనాథన్‌ రేనాల్డ్స్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై లండన్‌లో సంతకాలు చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ధ్రువీకరించాల్సి వుంది. ఆ ప్రక్రియకు ఏడాది సమయం పడుతుందంటున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్య పరిమాణం 12,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఎఫ్‌టీఏ లక్ష్యం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్న భారత్‌తో ఎఫ్‌టీఏ సాకారం కావాలని ఆ దేశం ఎంతగానో ఎదురుచూసింది. అందుకు కారణముంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బయటికొచ్చాక సాగిస్తున్న ఒంటరి ప్రయాణం దాని ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లో పడేసింది. ఒకప్పుడు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన దేశం నేల చూపులు చూడటం మొదలైంది. అందుకే కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా వున్నప్పుడు 2022లో తొలిసారి ఎఫ్‌టీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన లిజ్‌ ట్రస్‌ వచ్చారు. ఆమె 49 రోజుల్లోనే పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం భారత్‌ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. ఆయన కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించి ప్రస్తుత ప్రధాని స్టార్మర్‌ బాధ్యతలు స్వీకరించారు. వీరిలో అందరూ భారత్‌తో ఎఫ్‌టీఏ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినవారే. మొన్నటి ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ప్రధాన వాగ్దానాల్లో భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంటామన్నది ఒకటి. మొత్తానికి అనేక రకాల అడ్డంకులూ, అపోహలూ అధిగమించి ఒప్పందం సాకారమైంది. ఎఫ్‌టీఏ వల్ల బ్రిటన్‌లో ఏటా కొత్తగా 2,200 ఉద్యోగాలొస్తాయని, దేశ జీడీపీ 480 కోట్ల పౌండ్ల (రూ. 56,150 కోట్లు) మేర పెరుగుతుందని అంచనా. అయితే రెండు దేశాల్లోనూ ఎఫ్‌టీఏపై అసంతృప్తి తక్కువేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా లాభపడేది స్కాచ్‌ విస్కీ, జిన్‌ ఉత్పత్తిదార్లు, బ్రిటన్‌ కార్ల పరిశ్రమలు. జిన్, స్కాచ్‌ విస్కీలపై ప్రస్తుతం 150 శాతం దిగుమతి సుంకాలుండగా, అవి 75 శాతానికి పడిపోతాయి. వచ్చే పదేళ్ల కాలంలో 40 శాతానికొస్తాయి. అలాగే బ్రిటన్‌ కార్లపై ప్రస్తుతం 100 శాతం సుంకాలున్నాయి. అవి పది శాతానికి పడిపోతాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు ఇది ఊరటనిచ్చే కబురు. మన ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లకు కూడా గిరాకీ ఏర్పడుతుంది. ఈ రంగంలో టాటాలకు డబుల్‌ ధమాకా అని చెప్పాలి. బ్రిటన్‌లో ఆ సంస్థ ఉత్పత్తి చేసే జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లకు మన దేశంలో... ఇక్కడ ఉత్పత్తయ్యే టాటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లకు బ్రిటన్‌లో మార్కెట్‌ లభ్యత పెరుగుతుంది. మన దేశం నుంచి వెళ్లే 99 శాతం ఎగుమతులకు కూడా ఎఫ్‌టీఏ అమల్లోకొస్తే సుంకాల బెడద వుండదు. బ్రిటన్‌ నుంచి మనకొచ్చే దిగుమతులపై సుంకాలు 15 శాతం నుంచి ఒక్కసారిగా 3 శాతానికి పడిపోతాయి. చాలా సరుకులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గిపోతాయి. మన సాగు రంగానికి ఎఫ్‌టీఏ ఎంతగానో దోహదపడుతుందని వాణిజ్య నిపుణులంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు మన వార్షిక సాగు ఎగుమతుల విలువ కేవలం 81 కోట్ల డాలర్లు. ఈ ఒప్పందం వల్ల మన నుంచి తేయాకు, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు వగైరాల ఎగుమతులు అపారంగా పెరుగుతాయని అంచనా వుంది. సేవల రంగా నికి సంబంధించినంతవరకూ యోగా బోధకులు, సంగీతవేత్తలు, పాకశాస్త్ర ప్రవీణులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే వారికోసం ఏటా 1,800 వీసాలు జారీచేస్తారు. వాహన విడి భాగాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడోపకరణాలు, ఆటబొమ్మలు, బంగారం, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఇంజిన్లు వగైరాలపై దాదాపు 4 నుంచి 16 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఒప్పందం అమల్లోకొస్తే ఆ సుంకాలు కనుమరుగవుతాయి. కనుక ఎగుమతులు ఊపందుకుంటాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఎఫ్‌టీఏపై రెండు దేశాల్లోనూ విమర్శలూ, ఆందోళనలూ వున్నాయి. ఇది అమల్లోకొస్తే స్వల్పకాలిక వీసాపై వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యాలకూ జాతీయ బీమా సంస్థ ఎన్‌ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్ల మినహాయింపు ఇవ్వదల్చుకున్నారని, ఇందువల్ల దేశ ఖజానాకు ఏటా పది లక్షల పౌండ్ల నష్టంతోపాటు దేశీయ కార్మికుల ఉపాధికి గండిపడుతుందని కన్సర్వేటివ్‌ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ మినహాయింపు ఏడాది కాలానికి మాత్రమే వుంది. వలస విధానం మారదని, ఇప్పటికన్నా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. తమ రంగాన్ని ఎఫ్‌టీఏ విస్మరించిందని, మేధోహక్కుల పరిరక్షణ సంగతి పట్టించుకోలేదని బ్రిటన్‌ ఫార్మా రంగం ఆరోపణ. ఒకవేళ పట్టించుకుని ఉంటే మన దేశంలో జెనెరిక్‌ ఔషధ పరిశ్రమ దెబ్బతింటుంది. ఆటోమొబైల్‌ విడిభాగాల రంగంలో బ్రిటన్‌ ప్రవేశిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగం నష్టపోతుంది. అందుకు ప్రతిగా మన ఎంఎస్‌ఎంఈలకు కూడా బ్రిటన్‌ చోటిస్తే వేరుగా వుండేది. ఇక 2027 నుంచి బ్రిటన్‌ అమలుచేయబోతున్న ‘కార్బన్‌ టాక్స్‌’ అంశాన్ని ఏం చేశారో వెంటనే తెలియలేదు. కార్బన్‌ టాక్స్‌ వల్ల మన ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్‌ రంగాలు దెబ్బతినే అవకాశం వుంది. మొత్తానికి ఎఫ్‌టీఏ అమల్లోకొచ్చాకే దాని అసలు కథ ఏమిటన్నది తెలుస్తుంది.

Sakshi Guest Column On Nimisha Priya Issue6
అమానుషంపై స్పందించి తీరుదాం!

నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్‌ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్‌లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది. హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్‌లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్‌ స్క్వాడ్‌ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్‌లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది. నాలుగు ఆశలువర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్‌కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిమిష లీగల్‌ డిఫెన్స్‌ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్‌ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్‌ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్‌ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం. రెండు– యెమెన్‌లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు. మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది. నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్‌ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.ఒకవేళ ఆశలు అడియాసలైతే...పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్‌ ఏం చేయవలసి ఉంటుంది? భారత్‌ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు. అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్‌ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా? నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్‌ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది. అసంతృప్తిని చాటి తీరాలి!సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్‌లోని ఒక భూభాగంలో ఫైరింగ్‌ స్క్వాడ్‌ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్‌ రాహత్‌ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్‌లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్‌ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్‌కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్‌కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్‌లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్‌ చేసి తీరవలసిన పని మరొకటుంది. పాకిస్తాన్‌లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్‌ జాధవ్‌ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్‌ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్‌కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్‌ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Draft ordinance submitted to Central Govt7
కేంద్రం వద్దకు ఆర్డినెన్స్‌ ముసాయిదా!

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టం–2018ని సవరించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను.. న్యాయ సలహా కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు సైతం కేంద్రానికి వెళ్లగా..దీనిపై 30 నుంచి 32 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపించినట్లు కూడా తెలిసింది. కాగా ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్ర హోం శాఖకు పంపిన అంశంపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించడం లేదు. ప్రస్తుత పరిమితి 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రానికి హక్కు ఉన్నట్లుగా ముసాయిదాలో పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పీఆర్‌ చట్టానికి సవరణల వరకే ప్రతిపాదించారా? 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు జరుగుతుందా? ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది చర్చనీయాంశమౌతోంది. ఢిల్లీ స్థాయిలో చర్చ.. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుదల వంటి వాటిపైఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలను గురించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు.. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు రాహుల్‌గాందీ, ప్రియాంక, కాంగ్రెస్‌ ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ఆర్డినెన్స్, పంచాయతీరాజ్‌ చట్టంలో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఉండాలనే క్లాజ్‌ సవరణ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాను గవర్నర్‌ కోరినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో చట్ట, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై ఆయన స్పష్టత కోరినట్టు తెలుస్తోంది.

WWE Great Hulk Hogan Dies At 71 Due To Cardiac Arrest Says Report8
WWF దిగ్గజం హల్క్‌ హోగన్‌ కన్నుమూత

దిగ్గజ రెజ్లర్‌, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్‌ స్టార్‌ హల్క్‌ హోగన్‌ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్‌ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా హోగన్‌ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్‌ 11న జన్మించిన హోగన్‌ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్‌ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్‌ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్‌ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్‌కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆఫ్‌ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్‌ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. హోగన్‌ తన కెరీర్‌ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్‌, మాఛో మ్యాన్‌ రాండీ సావేజ్‌, అల్టిమేట్‌ వారియర్‌ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్‌కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్‌ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్‌ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ప్రచారం చేశాడు. హోగన్‌కు భారత్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్‌ సుపరిచితుడు.

cracks in Telangana Secretariat building 9
తెలంగాణ సచివాలయంలో మరోసారి ఊడిపడ్డ పెచ్చులు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్‌ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్‌ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్​జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ రెగ్యులర్ డిపార్ట్‌మెంట్‌ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్‌సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. దీంతో జీఆర్‌సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నాం అని’’ ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా, మరోసారి సచివాలయంలో పెచ్చులు ఊడడం చర్చాంశనీయంగా మారింది.

Russian plane carrying 50 passengers Missing Latest News Live Updates10
ఆఖరి నిమిషంలో కూలిన విమానం 

మాస్కో: ల్యాండింగ్‌ విఫలంకావడంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్‌ కోసం గాల్లో చక్కర్లు కొడుతున్న 50 ఏళ్ల పాత రష్యా విమానం ఒకటి అనూహ్యంగా కొండప్రాంతంలో కూలిపోయింది. రష్యాలోని చైనా సరిహద్దుల్లోని మారుమూల అమూర్‌ రీజియన్‌లోని టిండా పట్టణ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పకూలిన విమానం నుంచి చెలరేగిన మంటల్లో విమానంలోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. టిండా విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రష్యా శివారు అమూర్‌ రీజియన్‌ గవర్నర్‌ వాసిలీ ఓర్లోవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోవియట్‌ కాలంనాటి అంగారా ఎయిర్‌లైన్స్‌ ఆంటోనోవ్‌ ఏఎన్‌24 విమానం ఖబరోవ్సŠక్‌ నుంచి బ్లాగోవెచెన్సక్‌ సిటీకి బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం మార్గమధ్యంలో టిండా పట్టణంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్‌కు ప్రయత్నించగా అది సాధ్యంకాలేదు. దీంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్‌ కోసం ఆకాశంలో అలా చుట్టూ తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంపై ఎగురుతుండగా హఠాత్తుగా రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఈ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి ఎంఐ–8 హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టగా సమీప కొండప్రాంతంలో విమానం శకలాలు కనిపించాయి. ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం అదుపుతప్పి నేలరాలి ఉంటుందని స్థానిక ఇంటర్‌ఫ్యాక్స్‌ న్యూస్‌ఏజెన్సీలో కథనాలు వెలువడ్డాయి.🚨 JUST IN: Aerial footage shows the wreckage of the crashed An-24 in Russia’s Amur Region.Civil Defense confirms: no survivors found.The plane was carrying nearly 50 people.🎥👇 #Russia #PlaneCrash #An24 #Breaking pic.twitter.com/LyXWnBmRa9— Depin Bhat (@DepinBhat) July 24, 2025#BREAKING: Russian plane missing with about 50 people on board.the plane, operated by the Angara airline, was headed for the town of Tynda in the Amur region bordering China.#Russia #PlaneMIssing #AngaraAirline #An24 #China #RussianPlane #aviation #aviationnews pic.twitter.com/RQVKxlfKOM— upuknews (@upuknews1) July 24, 2025 దుర్ఘటనలు:2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌ జరిగి ఓ బిల్డింగ్‌ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్‌- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్‌.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement