మహారాష్ట్రలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంఐఎం అడుగులు | Cautious MIM feels party can capitalise on pockets of strength in the region | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంఐఎం అడుగులు

Aug 7 2013 10:55 PM | Updated on Oct 8 2018 8:39 PM

హైదరాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మహారాష్ట్రలో కూడా తమ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

 సాక్షి, ముంబై: హైదరాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మహారాష్ట్రలో కూడా తమ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఓ ప్రముఖ మరాఠీ పత్రికలో వచ్చిన కథనం మేరకు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందుగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముంబై, ఠాణేలతోపాటు నవీముంబైలలోని మైనారిటీల ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో తొలుత పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
 
 అనంతరం ఔరంగాబాద్‌లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నారు. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. నాందేడ్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మైనారిటీ ఓటర్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
 
 ఈద్ తర్వాత కార్యాలయాల ఏర్పాటు
 నగరంలోని బాంద్రా, మహమ్మద్‌అలీ రోడ్డుతోపాటు అంబర్‌నాథ్, వాషీలో రంజాన్ తర్వాత ఎంఐఎం పార్టీ కార్యాలయాలను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత విదర్భ, మరాఠ్వాడాతోపాటు పశ్చిమ మహారాష్ట్రలో కూడా తమ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది.  
 
 కాంగ్రెస్‌కు నష్టం ?
 ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నించినట్టయితే కాంగ్రెస్‌కు కొంత మేర నష్టం వాటిల్లొచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
 
 ప్రస్తుతం రాష్ట్రంలో కూడా మైనారిటీ ఓటుబ్యాంకు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. అయితే ఇప్పటికీ మైనారిటీలపై సమాజ్‌వాదీ పార్టీ కొంతమేర ప్రభావం చూపింది. దీంతో కొందరు ఎస్‌పీ వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో దిగినట్టయితే అనేకమంది మైనారిటీలు వారివైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.
 
 హైదరాబాద్ నుంచి...
 1956లో హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీని ఏర్పాటుచేశారు.  హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పార్టీ మంచి పట్టు సాధించింది. పార్టీ అధ్యక్షుడైన అసదుద్దీన్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ పార్టీ తర ఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఒకరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement