శశికళపై వేటు | Chennai: Sasikala, Dinakaran sacked from AIADMK | Sakshi

చిన్నమ్మ బహిష్కరణ

Apr 19 2017 2:20 AM | Updated on Sep 5 2017 9:05 AM

శశికళపై వేటు

శశికళపై వేటు

తమిళనాడులో ఊహించని పరిణామం. చిన్నమ్మ శశికళ కుటుంబంపై రాష్ట్ర కేబినెట్‌ మూకుమ్మడిగా తిరుగుబాటు ప్రకటించింది.

దినకరన్, కుటుంబం వెలి
- తమిళనాడు కేబినెట్‌ కీలక నిర్ణయం.. శశికళ పేరు ప్రస్తావించకుండా ప్రకటన
- రోజువారీ కార్యకలాపాల కోసం త్వరలో కమిటీ: ఆర్థికమంత్రి వెల్లడి
- పంతం నెగ్గించుకున్న పన్నీర్‌సెల్వం.. విలీనం చర్చలకు ‘వెలి’ షరతు
- రెండాకుల చిహ్నం కోసం ఒక్కటైన అన్నాడీఎంకే వర్గాలు


సాక్షి ప్రతినిధి, చెన్నై/ఢిల్లీ: తమిళనాడులో ఊహించని పరిణామం. చిన్నమ్మ శశికళ కుటుంబంపై రాష్ట్ర కేబినెట్‌ మూకుమ్మడిగా తిరుగుబాటు ప్రకటించింది. అన్నా డీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని (శశికళ పేరు ప్రస్తావించకుండా) పార్టీ నుంచి, ప్రభు త్వం నుంచి వెలివేశారు. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఈ. కె.పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ ‘సంప్రదింపుల’ భేటీలో ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆర్దిక మంత్రి డి.జయ కుమార్‌ ప్రకటించారు.

పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని మంగళవారం రాత్రి ఇక్కడ విలేకరులకు తెలి పారు. అది పార్టీ శ్రేణులతో పాటు అత్యున్నత స్థాయి నాయకులు, జిల్లా కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకున్న నిర్ణయమని జయకుమార్‌ పేర్కొన్నారు. పార్టీ రోజువారీ కార్యకలాపాలను నడిపించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి జయలలిత బహిష్కరించగా శశికళ పునర్నియమించడం తెలిసిందే. బెంగళూరు జైలుకు వెళ్లడానికి ముందు దినకరన్‌ను పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమించారు.

అన్నా డీఎంకేలోని రెండు గ్రూపులూ విలీనం కావడానికి చర్చలు జరపాలంటే... పార్టీ జనరల్‌ సెక్రటరీ శశికళను, ఆమె మేనల్లు డు దినకరన్‌ను దూరంగా ఉంచాలని తిరుగు బాటు నాయకుడు పన్నీర్‌సెల్వం విధించిన ముందస్తు షరతుకు, కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదని జయకుమార్‌ పేర్కొన్నారు. పన్నీర్‌ సెల్వంతో చర్చలు జరప డానికి మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని ఆయ న తెలిపారు. ఈ భేటీలో దిండిగల్‌ సి. శ్రీనివా సన్, ఎస్‌పి వేలుమణి, ఆర్‌బి ఉదయకుమార్, తంగమణి, సి వేషన్ముగమ్, రాజ్యసభ ఎంపీ వి.వైతలింగం తదితరులు పాల్గొన్నారు.

రెండాకుల చిహ్నం చుట్టూ..
అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని, రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దినకరన్‌తో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సీఎం సహా కొందరు సీనియర్‌ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నుంచి పార్టీ విలీనంపై చర్చకు సిద్ధమని ఆహ్వానం అందింది. అయితే, పార్టీ, ప్రభుత్వంపై శశికళ, దినకరన్‌ కుటుంబ పెత్తనం లేకుండా చేయాలని పన్నీర్‌సెల్వం ముందస్తు షరతు విధించారు. ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు దినకరన్‌తో తెగతెంపులు చేసుకోవాలనే సంకల్పంతో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లో 20 మంది మంత్రులు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు అనేక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రి జయకుమార్‌ మీడియాతో సమావేశం నిర్ణయాలు ప్రకటించారు.

శశికళ పేరు ప్రస్తావించకుండా...
దినకరన్, ఆయన కుటుంబీకులతో ఎటువంటి సంబంధం పెట్టుకోరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జయకుమార్‌ చెప్పారు. ఎలాంటి కారణం చేతనూ ఇకపై వారిని చేరదీసే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తల, ప్రజల మనోభీష్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పా రు. అయితే శశికళ పేరును ప్రస్తావించకుండా దినకరన్‌ కుటుంబీకులు అని మాత్రమే పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా, దినకరన్‌ తొలగింపు లేదా మరేదైనా చర్యపై పార్టీ సర్వసభ్య సమావేశంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే అధికారం మంత్రులకు లేదని ఉత్తర చెన్నై అన్నాడీఎంకే అధ్యక్షుడు, పెరంబూరు ఎమ్మెల్యే వెట్రివేల్‌ మంగళవారం వ్యాఖ్యానించారు.

దినకరన్‌ కోసం చెన్నైకి ఢిల్లీ బృందం
అన్నా డీఎంకే (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్‌ కోసం ఢిల్లీ పోలీసులు త్వరలో చెన్నైకి ఓ బృందాన్ని పంపించనున్నారు. తమ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించేలా చూడడం కోసం ఎన్నికల కమిషన్‌ అధికారికి దినకరన్‌ లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. బ్రోకర్‌ సుకేష్‌ చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన వెంటనే దినకరన్‌పై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. కాగా చంద్రశేఖర్‌ను వరుసగా మూడో రోజైన మంగళవారం కూడా క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులు విచారించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement