Shivpal Yadav
-
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్‌పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్‌తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మూడుసార్లు సీఎంగా, రక్షణమంత్రిగా పనిచేసిన మూలయంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగాను ఆయన ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు. సొంత కుమారుడు, సీఎం హోదాలో ఉన్న అఖిలేశ్ యాదవ్‌నే ఓ సారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ములాయం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2012లో మొదలు 2012లో అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే అఖిలేశ్ సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీలో కొందరు స్వాగతించగా.. ములాయం, ఆయన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మాత్రం వ్యతిరేకించారు. తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను సీఎం చేయాలని ములాయం భావించడమే ఇందుకు కారణం. అంతేకాదు ఆ సమయంలో తన బాబాబ్ అయిన శివ్‌పాల్‌ను అఖిలేశ్ రెండు సార్లు కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో కుటుంబ కలహాలు మరింత ముదిరాయి. అఖిలేశ్‌తో ములాయంకు, శివపాల్ యాదవ్‌కు దూరం పెరిగింది. సంచలన నిర్ణయం సమాజ్‌వాదీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో 2016లో సంచలన నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్. తన కుమారుడు, సీఎం అఖిలేశ్ యాదవ్, తన బంధువు రామ్ గోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ రెండుగా చీలిపోకుండా కాపాడేందుకు, తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఆ మరునాడే సీఎం అఖిలేశ్ యాదవ్ తన బలమేంటో నిరూపించుకున్నారు. వెంటనే తన నేతృత్వంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ భేటికి మొత్తం 229 ఎస్పీ ఎమ్మెల్యేల్లో 200మంది హాజరయ్యారు. అలాగే కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అఖిలేశ్ యాదవ్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేలాది మంది సీఎం కార్యాలయం ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు అప్పుడు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్, రామ్ గోపాల్ యాదవ్ వర్గం బాహాబాహీకి దిగింది. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెనక్కితగ్గి.. అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ములాయం సింగ్ వెంటనే అప్రమత్తయ్యారు. తన కుమారుడు అఖిలేశ్, సోదరుడు రామ్ గోపాల్‌పై సస్పెన్షన్‌ను 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. ములాయంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2017 కొత్త ఏడాదికి ముందు ఇదంతా జరిగింది. కానీ పార్టీలో అంతర్గత విభేదాలు అక్కడితో ఆగిపోలేదు. 2017 జనవరి 1న జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అఖేలిశ్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు రామ్ గోపాల్ యాదవ్. అప్పటికే ఆ పదవిలో ములాయంను పార్టీ సంరక్షుడి పదవికి పరిమితం చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించారు. మరో షాక్.. ములాయం సింగ్ యాదవ్ మాత్రం వీటికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడైన తాను లేకుండా ఈ సమావేశం నిర్వహించడం అక్రమం అన్నారు. తానే సమాజ్ పార్టీ అధినేత అని, అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అని, శివ్‌పాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాత్రం అఖిలేశ్ యాదవ్‌నే సమర్థించింది. ఆయన వర్గానికే ఎస్పీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఇదంతా జరిగింది. ఈసీ నిర్ణయం అనంతరం తాను కొత్తగా సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని స్థాపిస్తానని, ములాయం సింగ్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తారని శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. కానీ.. కొన్ని నెలల తర్వాత తాను కొత్త పార్టీ స్థాపించడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. చివరకు శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎస్పీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018 ఆగస్టులో ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేష్ యాదవ్ కూటమిలోనే చేరారు. ఎస్పీ గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. చదవండి: అర్బన్ నక్సల్స్ గుజరాత్లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త! -
‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి డబుల్ షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఝలక్ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన సొంత బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్సీ కూటమి పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. శుక్రవారం రాత్రి సీఎం యోగి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు ఇద్దరూ. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నన్నేం పిలవలేదు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటేయమనీ అడగలేదు. సీఎం యోగి ఆదిత్యానాథ్ నన్ను ఆహ్వానించి.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని అడిగారు. అందుకే అంగీకరించాం’’ అని బాబాయ్-అబ్బాయ్ మధ్య నెలకొన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టారు శివపాల్ యాదవ్. అఖిలేష్‌కు సరైన రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే.. తనను కీలక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందుకే కూటమిలోని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్ యాదవ్ మండిపడ్డారు. అఖిలేష్ గనుక నా సలహాలు గనుక పాటించి ఉంటే.. ఎస్పీ పరిస్థితి యూపీలో ఇవాళ మరోలా ఉండేదన్నారు ఆయన. ఇక ద్రౌపది ముర్ముకు మద్ధతు విషయంపై రాజ్‌భర్ కూడా స్పందించారు. ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారాయన. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారాయన. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై.. గురువారం అఖిలేష్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ.. కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు సైతం ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి.. తమవైపు తిప్పుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ సొంత బాబాయ్ అయిన శివపాల్ యాదవ్.. 2012-17 అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న టైంలో ‘నెంబర్ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్‌తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే.. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన. ఆ ఎన్నికల్లో.. జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శివపాల్ యాదవ్. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం. మరోవైపు ఓంప్రకాశ్ రాజ్‌భర్ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్‌పై ఓంప్రకాశ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్‌యాదవ్‌కు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఓంప్రకాశ్. 2012 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఓంప్రకాశ్. -
‘అఖిలేష్ కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నారు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జట్టుకట్టిన బీఎస్పీ, ఎస్పీ కూటమిపై ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్పీ) చీఫ్ శివపాల్ యాదవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి మోసపూరితమైనదని, మాయావతిని అంత తేలికగా నమ్మకూడదని శివపాల్ ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పాటు తన తండ్రి ములాయ్ సింగ్‌ను కూడా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అఖిలేష్.. కూటమికి కాంగ్రెస్‌ను దూరం పెట్టడం సరికాదన్నారు. అధికారం కోసం మాయావతి ఎంతకైనా తెగిస్తారని.. 1993లో ఆమె చేసిన మోసాన్ని ఈ సందర్భంగా శివపాల్ గుర్తుచేశారు. గతంలో మాయావతి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషాయాన్ని అఖిలేష్ గ్రహించాలని సూచించారు. ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ కారణంగానే పార్టీ నష్టపోయిందని ఆరోపించారు. రాంగోపాల్ వల్లనే గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని పేర్కొన్నారు. అఖిలేష్‌తో విభేదాల కారణంగా శివపాల్ పీఎస్పీని స్థాపించిన విషయం తెలిసిందే. -
‘ఆమెను నమ్మడం అంత మంచిది కాదు’
లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గతంలో బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఎస్పీ- బీఎస్పీ పొత్తుపై అఖిలేశ్ యాదవ్ బాబాయ్ (ములాయం సింగ్ యాదవ్ సోదరుడు), సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్ సింగ్ యాదవ్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని చందోలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత్రి మయావతిని నమ్మడం అంత శ్రేయస్కరం కాదని అఖిలేశ్ యాదవ్‌కు సూచించారు. ఈ క్రమంలో 1995 నాటి ‘లక్నో గెస్ట్‌హౌజ్ ఘటన’ ను ప్రస్తావించిన ఆయన..‘ బెహన్జీ(మాయవతి) నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ సమయంలో విచారణ ఎదుర్కొనేందుకు, అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్టుకు కూడా సిద్ధమని నేను చెప్పాను. అదేవిధంగా మాయావతి కూడా నాలాగే నార్కో టెస్టు చేయించుకోవాలని కోరాను. కానీ ఆమె అందుకు నిరాకరించారు. టిక్కెట్లు అమ్ముకునే అలాంటి వ్యక్తులను నమ్మకూడదు. నేతాజీ(ములాయం)ని గూండా అంటూ దూషించిన ఆమెను ఎలా నమ్ముతారు. ఆమె ఎక్కువ సీట్లు గెలుచుకోలేరు’ అని వ్యాఖ్యానించారు. 1995లో ఏం జరిగింది? 1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఈ క్రమంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు. శివ్‌పాల్ యాదవ్ -
హనుమంతుడి ముందు కుప్పిగెంతులు
దేవుడిపై ప్రయోగించిన కులం కార్డు ఎటు తిరుగుతోందన్న చర్చ తీవ్రరూపం దాలుస్తోంది. ఓ వైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో హిందూ సంస్థలు నిమగ్నమైతే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడి కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త విషయాల్ని తెర మీదకు తెచ్చారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో.. హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న యోగి ఆ వర్గం నుంచి ఓట్లు రాలుతాయని ఆశించి ఉండొచ్చు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే.. హనుమంతుడు మనువాడీలకు బానిస అని, రాముడి కోసం ఎంతో చేశాడని, అయినా ఆయనకు తోక ఎందుకు పెట్టారని ప్రశ్నించి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఉద్రిక్తత రాజేసిన భీమ్ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని హనుమంతుడి ఆలయాలన్నింటిని దళితులు స్వాధీనం చేసుకోవాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఆ ఆలయాలన్నింటిలో దళిత పూజారుల్ని నియమిస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు భీమ్ ఆర్మీ సభ్యులందరూ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ఆలయాలను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీకి ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ మద్దతు పలకడంతో ముజఫర్‌నగర్‌లో హనుమాన్ ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ కార్యకర్తలు గత మంగళవారమే సంకటవిమోచన హనుమాన్ ఆలయాన్ని ఆక్రమించుకొని అక్కడి పురోహితుడ్ని తొలగించి దళితుడిని పూజారిగా నియమించారు. ‘హిందూ మతానికి యోగి ఆదిత్యనాథ్ ఒక రాజ్యాంగపరమైన అధికారి. అందుకే ఆయన వ్యాఖ్యలపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది’ అని కొత్త పూజారి దీపక్ గంభీర్ అంటున్నారు. మతంతో రాజ్యాధికారం! ఆంజనేయుడి ఆలయాలపై పెత్తనం సాధిస్తామంటూ భీమ్ ఆర్మీ చేసిన ప్రకటనను దళితుల్లోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడకుండా ఇలా ఆలయాల్లో పూజారులుగా నియమిస్తే ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, చైతన్యపరచడం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బహుజన్ డైవర్సిటీ మిషన్‌కు చెందిన హెచ్.ఎల్.దుసధ్ వాదన భిన్నంగా ఉంది. మతం అత్యంత శక్తిమంతమైనదని, దానిని చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బలం పుంజుకొని రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కులానికో దేవుడుంటే లాభమా? కులానికో దేవుడు ఉన్న ఈ రోజుల్లో తాజా వివాదం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాదవులందరూ కృష్ణుడు తమ కులదైవం అంటారు. కుష్వాహాలు రాముడి కుమారుడైన కుశుడి సంతతి వాళ్లమని భావిస్తారు. కుర్మీలు లవుడు తమ వాడేనని అంటారు. విశ్వకర్మ తమ కులదైవమని లోహార్లు చెబుతారు. వాల్మీకీ సంతతికి చెందినవాళ్లమని పారిశుధ్ధ్య కార్మికులు చెప్పుకుంటారు. జరాసంధుడి వారసులమని కహరా కులస్తులు (పల్లకీలు మోసే వృత్తి) చెప్పుకుంటారు. ఇలా ప్రతీ వెనుకబడిన కులాల వాళ్లూ సామాజికంగా తమ హోదాలు పెంచుకోవడానికి ఫలానా దేవుళ్లకి వారసులమని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని సోషయాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు. -
ఆదిత్యనాథ్ ఎత్తులు, జిత్తులు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకునేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చి హిందుత్వ ఎజెండాను ముందుకు నెట్టారు. రాష్ట్రంలోని చిన్నా, చితక పార్టీలను చేరదీసి ప్రధాన ప్రతిపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను, ముఖ్యంగా సమాజ్‌వాది పార్టీని దెబ్బతీసేందుకు పెద్ద వ్యూహమే పన్నారు. సమాజ్‌వాది పార్టీ నుంచి విడిపోయి ఇటీవల ‘సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా’ను ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ బాబాయి)కు మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను ఆదిత్యనాథ్ కేటాయించారు. రాజాభయ్యాగా పేరు పొందిన స్వతంత్య్ర శాసన సభ్యుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్‌ను చేరదీసి సమాజ్‌వాది పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అఖిలేష్ యాదవ్‌తో పడక శివపాల్ యాదవ్ బయటకు వచ్చి బీజేపీలో చేరాలని అనుకోవడం, ఆయన తరఫున ఎస్పీ మాజీ నాయకుడు అమర్ సింగ్ మంతనాలు కూడా జరపడం తెల్సిందే. అయితే పార్టీలో చేరే బదులు కొత్త పార్టీని ఏర్పాటు చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాది ఓట్లను చీల్చాలని, అందుకు ప్రతిఫలం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఆయన్ని ఒప్పించిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బీజేపీ సూచనల మేరకు శివపాల్ యాదవ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో అందుకు నజరానాగానే విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను ఇప్పుడు కేటాయించారు. సమాజ్‌వాది సెక్యులర్ మోర్చాకు రాష్ట్రంలోని 30 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. సమాజ్‌వాది పార్టీకి మొదటి నుంచి బలం ఉన్న ఈ 30 జిల్లాలో ఇప్పుడు యాదవ్‌లు, ముస్లింలు సెక్యులర్ మోర్చా వైపు వెళ్లే అవకాశం ఉందని అటు మోర్చా అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో ఎస్పీ విజయావకాశాలను మోర్చా దిబ్బతీస్తుందని, తద్వారా తాము విజయం సాధించవచ్చన్నది బీజేపీ, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అంచనా. ఎస్పీలో తనకు అన్నుదన్నుగా నిలిచిన నాయకులంతా ఎన్నికల నాటికి తన మోర్చాలో చేరుతారని, అందుకు అవసరమైతే ధన సహాయం కూడా బీజేపీ చేస్తుందని శివపాల్ యాదవ్ నమ్ముతున్నారు. ఇక ‘కుండా’ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఇటీవల జనసత్తా పార్టీని ఏర్పాటు చేశారు. ఆదిత్యయోగి ప్రోద్బలంతోనే ఆయన ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఠాకూర్ల సమాజంలో మంచి బలమే ఉంది. ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన ప్రభావితం చేయగలరు. కొత్త పార్టీని ఏర్పాటు చేసినందుకు నజరానాగానే ఆయనకు కూడా ప్రభుత్వం నివాసం దక్కిందని భావించవచ్చు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతూ రావడంతో ఈ కొత్త వ్యూహాలకు ఆదిత్యయోగి శ్రీకారం చుట్టారని గ్రహించవచ్చు. వ్యూహాలు ఫలిస్తాయా? శివపాల్ యాదవ్ కొత్త పార్టీ ప్రభావం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీపై కొంత ప్రభావం చూపించవచ్చేమోగానీ, విజయావకాశాలను దెబ్బతీసేంతగా ఉండదని, అందుకు కారణం ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా కుమారుడి పక్షాన నిలబడడమేనని కాన్పూర్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఏకే వర్మ అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీలోని శివపాల్ యాదవ్ అసమ్మతి వర్గానికే ములాయం సింగ్ యాదవ్ మద్దతిచ్చిన విషయం తెల్సిందే. పైగా మాస్ జనాల్లో శివపాల్ యాదవ్‌కు ఆదరణ లేదని ఆయన చెప్పారు. ప్రతాప్ సింగ్ ప్రభావం కూడా ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని తెలిపారు. ఇక్కడ ఓటర్ల మన స్థత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఓటర్లు సాధారణంగా విజయం సాధిస్తుందనుకున్న పార్టీకే ఓటు వేస్తారని, ఇలాంటి చిన్నా, చితక పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోవాలని కోరుకోరని ఆయన చెప్పారు. -
శివ్‌పాల్ యాదవ్‌కు జడ్ క్యాటగిరి భద్రతా
లక్నో : సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్ యాదవ్‌కు జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శివ్‌పాల్ యాదవ్‌కు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిన నేపథ్యంలో యోగి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఖాళీ చేసిన బంగ్లాతో పాటు.. హై లెవల్ భద్రత కల్పించారు. ఇప్పటివరకూ యూపీలో ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి ప్రతిపక్ష నేతలకు మాత్రమే జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి శివ్‌పాల్ యాదవ్ చేరారు. ప్రతిపక్ష నేతకు అధికార బంగ్లాతో పాటు, జడ్ ప్లస్ కేటగిరి భద్రతాను కల్పించడంతో ప్రతిపక్షాలు సీఎం యోగిపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో శివ్‌పాల్‌ని బీజేపీలో చేర్చుకోవడం కోసమే యోగి ప్రభుత్వం ఇలాంటి గిమిక్కులు ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ విషయం గురించి శివ్‌పాల్ ‘నేను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మాజీ మంత్రిని కూడా. ఇంటిలిజెన్స్ బ్యూరో నాకు ముప్పు ఉందని ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ప్రభుత్వం నాకు ఈ బంగళాను కేటాయించింది’ అని తెలిపారు. ప్రస్తుతం శివ్‌పాల్‌కు లాల్ బహదూర్ శాస్త్రీ మార్గ్‌లో ఉన్న బంగాళను కేటాయించారు. గతంలో ఈ బంగళాను మాయావతికి కేటాయించారు. -
సమాజ్‌వాది చీలిక వెనక అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహా కూటమి ఆవిర్భవించక ముందే సమాజ్‌వాది పార్టీలో చీలిక రావడం విచారకర పరిణామమే. పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, తన అన్న కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ‘సమాజ్‌వాది సెక్యులర్ ఫ్రంట్’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. చీలికవైపు శివపాల్ యాదవ్‌ను ప్రోత్సహించిందీ తెరముందు నుంచి అమర్ సింగ్ అయితే, తెరవెనక నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అని నిస్సందేహంగా చెప్పవచ్చు! ఎందుకంటే శివపాల్ యాదవ్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 24 గంటల ముందే అమర్ సింగ్ లక్నోలో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతో బీజీపీ పార్టీలో శివపాల్ యాదవ్‌కు సముచిత స్థానం కల్పించడం కోసం ఆ పార్టీ అధినాయకులతో మాట్లాడానని, అయితే చివరి నిమిషంలో శివపాల్ తన మనసు మార్చుకున్నారని చెప్పారు. శివపాల్ యాదవ్‌కు, అమర్ సింగ్‌కు మధ్యన మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. శివపాల్ కారణంగానే అమర్ సింగ్ రెండోసారి సమాజ్‌వాది పార్టీలోకి వచ్చారు. శివపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి బదులు సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారంటే ఇందులో ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. శివపాల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్ పార్టీని దెబ్బతీయవచ్చని, తద్వారా ఎస్పీ–బీఎస్పీ కూటమి విజయావకాశాలను అడ్డుకోవచ్చని అమిత్ షా ఆలోచించి ఉంటారు. యూపీలోని రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయోత్సాహంతో 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఐక్యంగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నిర్ణయించుకోవడంతోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఈలోగా శివపాల్ యాదవ్ రూపంలో పార్టీలో చీలిక రానుంది. పార్టీలో ఎంతో కాలం సీనియర్ నాయకుడిగా చెలామణి అయిన శివపాల్ యాదవ్‌కు పార్టీలో పలుకుబడి బాగానే ఉంది. అందుకనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్‌కే అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మద్దతు ఇచ్చారు. పార్టీలో భిన్న శిబిరాలు ఏర్పడిన కారణంగా నాటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని గ్రహించిన పార్టీలోని శిబిరాలు ఎన్నికల అనంతరం కనీసం బయటకు ఐక్యంగానే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శివపాల్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘గత ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్‌లో మార్పు వస్తుందని ఎదురు చూశాను. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. నాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు అలాగే ఫీలవుతున్నారు. నేను ఇక లాభం లేదనుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. మిగతా వారు కూడా వస్తారు’ అని శివపాల్ యాదవ్ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్ యాదవ్ దీవెనలు ఉన్నాయని అయన చెప్పారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్ షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్ యాదవ్‌కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు. -
హమ్ సాత్ సాత్ హై...
సాక్షి, లక్నో : ఈ దీపావళి పండగ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో.. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీలో కొత్త వెలుగులు నింపింది. ఏడాదిన్నర కాలంగా అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్ ఒక్క తాటిపైకి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం మొత్తం కలుసుకుని వేడుకలో పాల్గొనటంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి గురువారం అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి సైఫై నిలయంలో సందడి చేశారు. తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. కాసేపటికే శివపాల్ అక్కడికి చేరుకోగా.. అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో శివ్‌పాల్ అబ్బాయిని ఆశీర్వదించగా.. ఈ దృశ్యంతో అక్కడున్న మిగతా పార్టీ నేతల ముఖంలో ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి. ములాయం ఇంట ముసలం, ఆపై యూపీ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత తండ్రి.. బాబాయ్, అబ్బాయ్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి. బుధవారమే సైఫై నిలయానికి చేరుకున్న అఖిలేశ్ కుటుంబం అంతకు ముందు అక్కడికి చేరుకున్న మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో సరదాగా గడిపారు. అయితే ఆ కాసేపటికే ములాయం కూడా అక్కడికి చేరుకుని రాంగోపాల్ యాదవ్‌తో ఏకాంతంగా రాజకీయాలపై చర్చించారంట. ఇక ఈ దీపావళితో తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని ములాయం ప్రకటించారు. పార్టీ-కుటుంబం ఇప్పుడు అంతా ఒక్కట్టే. అంతా కలిసి పార్టీని బలోపేతం చేసి.. ఉన్నతస్థాయికి చేర్చేందుకు యత్నిస్తాం అని ములాయం చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసే దిశగా ములాయం కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది. -
యూపీలో కొత్త పార్టీ..!
► సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా స్థాపిస్తా.. ► ములాయం జాతీయ అధ్యక్షునిగా ఉంటారు: శివపాల్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పేరిట కొత్త పార్టీ స్థాపించనున్నట్టు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ ప్రకటించారు. ఈ పార్టీకి ములాయం నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. శుక్రవారం ఎతావాలో బంధువుల నివాసంలో ములాయంతో సమావేశమైన అనంతరం శివపాల్ ఈ ప్రకటన చేశారు. ‘పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగిస్తానని అఖిలేశ్ హామీ ఇచ్చాడు. ఆ హామీ నెరవేర్చాలి. అందరం కలసి సమాజ్‌వాదీ పార్టీని పటిష్టపరచాలి. అఖిలేశ్‌కు మూడు నెలల సమయం ఇస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ పగ్గాలను ములాయంకు అప్పగించాలి. ఒకవేళ అతను పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగించడంలో విఫలమైతే.. నేను కొత్త పార్టీ స్థాపిస్తా’ అని బుధవారమే శివపాల్ చెప్పారు. దేశానికి మంచిదే: అఖిలేశ్ శివపాల్ హెచ్చరికలపై అఖిలేశ్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి మీడియా ద్వారానే తెలుసుకున్నానని, అలాంటి పార్టీ ఏర్పాటైతే అది దేశానికి మంచిదేనని అన్నారు. యూపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, శివపాల్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్‌కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్‌కు కోపం వచ్చింది. 'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్‌గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి. -
నేను చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ?
ఎవరికైనా సెక్యూరిటీ తగ్గిస్తే వాళ్లు హత్యలకు గురైన ఘటనలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గించడం వల్ల రేపు తాను మరణిస్తే అందుకు బాధ్యత ఎవరిదని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మండిపడ్డారు. శనివారం నాడు తనకు బెదిరింపు లేఖలు వచ్చాయని, ఆదివారం నాడు తన సెక్యూరిటీని సమీక్షించి తగ్గించేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రుల్లో ఆజమ్ ఖాన్ ఒకరన్న విషయం తెలిసిందే. తనకు భద్రత తగ్గించడంపై తీవ్రంగా ఆవేదన చెందన ఆయన.. రాంపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆజమ్‌ఖాన్‌కు ఇంతకుముందు వరకు వై ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉండేది. ఇప్పుడు ఆయనకు భద్రత కొంత తగ్గించినా, ఇప్పటికీ ఆయన వెంట సాయుధ గార్డులు ఉంటూనే ఉంటారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, డీజీ (సెక్యూరిటీ)లతో కూడిన రాష్ట్ర భద్రతా కమిటీ నిశితంగా పరిశీలించి, వందమంది వ్యక్తులకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను సమీక్షించింది. ఆజమ్ఖాన్తో పాటు సమాజ్‌వాదీ నేతలు రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ తదితరుల భద్రతను కూడా తగ్గించారు. వంద మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు, సలహాదారులకు కూడా భద్రతను ఇంతకుముందు కంటే కాస్త తగ్గించారు. తాజా సమీక్ష తర్వాత కనీసం 1200 మంది భద్రతా సిబ్బంది తమకు అదనంగా మిగులుతారని, వాళ్లను సంబంధిత జిల్లాల్లో శాంతిభద్రతల విధుల్లో నియమిస్తామని భద్రతా కమిటీ సభ్యులు చెప్పారు. -
‘నేనూ బీజేపీలోకా.. మా అన్నతోనే ఉంట’
మధుర: బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలను సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కొట్టిపారేశారు. తనకు అసలు అలాంటి ఆలోచన ఏ కోశానా లేదని అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో జరిగిన సమావేశం కేవలం మర్యాద పూర్వకంగా జరిగిందే తప్ప మరొకటి కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరో కోణంలో తీసుకోరాదు’ అని శివపాల్ యాదవ్ బృందావనంలోని కృష్ణ గోపాల్ పీఠ్‌లో చెప్పారు. సమాజ్ వాది పార్టీకి తాను అసలైన సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. తన సోదరుడు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఏది చెబితే అదే చేస్తానని తెలిపారు. సమాజ్‌వాది పార్టీలోనే ఉంటానని చెప్పిన ఆయన మరోసారి అఖిలేశ్‌ను విమర్శించారు. వాస్తవానికి తండ్రికే విశ్వాసంగా ఉండని ఓ కుమారుడు ఇతరులకు ఎలా ఉంటారని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు. బుధవారం శివపాల్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రితో బాబాయ్ మంతనాలు
లక్నో : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, రాజకీయ సమీకరణలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం హాట్ టాఫిక్‌గా మారింది. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది. . ముఖ్యమంత్రి నివాసంలో జశ్వంత్‌నగర్ ఎమ్మెల్యే అయిన శివపాల్‌యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే అని చెబుతున్నా, శివపాల్ ...సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణ యాదవ్ పలుమార్లు యోగి ఆదిత్యనాథ్‌తో కలిసిన విషయం తెలిసిందే. త్వరలో అపర్ణయాదవ్ కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు శివపాల్ కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ములాయం కుటుంబసభ్యులు కమలానికి చేరువ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ.. అబ్బాయ్ అఖిలేష్, బాబాయ్ శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావలనుకున్న అఖిలేష్‌కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎస్పీ ఓటమితో ములాయంతో పాటు శివపాల్ కూడా అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే. -
అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!
నిన్న మొన్నటి వరకు ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు అభిమానం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇది. యూపీలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ది కాదని పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు శివపాల్ - అఖిలేష్ ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇంతటి మోదీ గాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా శివపాల్ మాత్రం జస్వంత్‌నగర్ స్థానంలో బీజేపీ నాయకుడు మనీష్ యాదవ్ పాత్రేను 52 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరినీ నిందించబోమని, నేతాజీ పోరాటానికి ఇప్పుడు కూడా తామంతా మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ ఇంతకుముందు ఎక్కడ ఉండేదో మళ్లీ అక్కడకు తీసుకెళ్తామన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరో తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జరిగిందేదో జరిగిపోయిందని నిట్టూర్చారు. -
బాబాయ్ గెలిచేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయ దిశగా పయనిస్తున్న క్రమంలో బాబాయ్ గెలుపు కిరీటం ఎగురవేశారు. జస్వంత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ నేత, ములాయం సింగ్ తమ్ముడు శివ్ పాల్ సింగ్ యాదవ్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. ఏకంగా 1,26,834 ఓట్లతో ఆయన ఆధిక్యం సాధించగా.. ఆయనపై పోటీకి దిగిన బీజేపీ మనీష్ యాదవ్ పాత్రే 74,218 ఓట్లతో శివ్ పాల్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఏకంగా 52వేల పైచిలుకు ఓట్లు తేడాతో శివ్ పాల్ విజయభావుటా ఎగురవేశారు. తనకి ఓటు వేసిన జస్వంత్ నగర్ ప్రజలకు శివ్ పాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3.65 లక్షల ఓటర్లున్నారు. వీటిలో 1.15 లక్షల ఓట్లు యాదవ్ లవే. మరోవైపు యూపీలో బీజేపీ భారీ ఆధిక్య దిశగా కొనసాగుతోంది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది. కులం, మతం ప్రాతిపదికను పక్కనపెట్టి, యూపీ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని బీజేపీ నేతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ మాత్రం భారీగా చతికిల పడిపోయింది. ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయ పోరులో పార్టీ కంట్రోల్ ను శివ్ పాల్ కోల్పోయారు. పార్టీ బాధ్యతలన్నీ అబ్బాయి అఖిలేష్ యాదవ్ తన చేతుల మీదుగా నడిపించారు. కానీ కాంగ్రెస్ తో పొత్తు బెడిసికొట్టి, ఓటమి దిశగా ఈ కూటమి పయనిస్తోంది. -
అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీ గుర్తు సైకిల్‌ను పంచర్ చేయగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ చైన్ తెంచారని అన్నారు. దీంతో సైకిల్ నడవలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీలో ములాయం కుటుంబంలో ఇటీవల విభేదాలు ఏర్పడి, ఆ తర్వాత సమసిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత విభేదాలను పక్కనబెట్టి తామంతా ఒక్కటేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో విభేదాల కారణంగా ఆ పార్టీ బలహీనపడిందని రాజ్‌నాథ్ అన్నారు. -
‘కాంగ్రెస్‌కు ప్రచారం చేయను.. అన్న చెబితే ఓకే’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరుపున తాను ప్రచారం చేయబోనని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాల్లోపాల్గొంటున్నాయి. అయితే, తాను మాత్రం కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనబోనని శివపాల్ చెప్పారు. అయితే, తన సోదరుడు చెబితే అప్పుడు వెళతానని, తాను ఒక్క ఎస్పీకి మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎస్పీ టికెట్‌పై పోటీ చేయడం తప్పనిసరి పరిస్థితి అని, మార్చి 11 వరకు ఆ పార్టీతోనే ఉంటానని, ఒక వేళ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తనకు ఎలాంటి అవమానం ఎదురవకుంటే అప్పుడు పరిస్థితిని బట్టి ముందుకెళతానని చెప్పారు. అఖిలేశ్ వర్గానికి చెందిన నేతలు తనను పదేపదే అవమానిస్తున్నారని, ఈనేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానని గతంలోనే శివపాల్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు పార్టీ పెట్టబోరని ములాయం చెప్పారు. అయినప్పటికీ శివపాల్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం ఆయన ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. -
శివపాల్ కాన్వాయ్‌పై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్, ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆదివారం ఎతావా జిల్లా జస్వంత్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఓటేసిన ప్రముఖులు: ఈ రోజు జరుగుతున్న యూపీ మూడో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, బీజేపీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి తదితరులు ఓటు వేశారు. ఈ రోజు యూపీలో 12 జిల్లాల్లో 69 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 826 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.41 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
‘నేను అసలు ఏ పార్టీ పెట్టట్లేదు’
లక్నో: ‘కొత్త పార్టీ పెడతాను.. నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావో చూస్తాను’ అంటూ అనూహ్య కామెంట్లు చేసి సమసిపోయిందనుకున్న సమాజ్‌వాది పార్టీలోని అసమ్మతి ముసలానికి మరోసారి ఊపిరిలూదీన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ మాట మార్చారు. ఎట్టకేలకు తాను అసలు ఏ పార్టీ పెట్టడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం మీడియా ముందు స్పష్టం చేశారు. ఆ రోజు ఏవో కోపంతో మాటలు అని అర్ధం వచ్చినట్లుగా ఆయన బదులిచ్చారు. ఎప్పటికీ తన సోదరుడు ములాయంతోనే ఉండిపోతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితా తేది మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొడుకు చేసిన చర్యలపై తొలుత అలకబూనిన ములాయం ఆ వెంటనే అందులో నుంచి బయటకు రావడమే కాకుండా కాంగ్రెస్, ఎస్పీలు విజయం సాధిస్తాయని స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు శివపాల్ ఏదో కోపంలో ఆ రోజు పార్టీ పెడతానని, అన్నాడేగానీ నిజానికి అలాంటిదేమీ లేదని చెప్పారు. దీనికి కొనసాగింపుగానే తాజాగా శివపాల్ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత మరిన్ని వార్తలకై చదవండి పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్‌కు రెండు చక్రాలం -
అలక తుస్.. ఇక ప్రచార హోరులో పెద్దాయన
న్యూఢిల్లీ: అనుకున్నదే అయింది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అలక పూర్తిగా పోయింది. చిన్నచితక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రేపటి నుంచి ప్రచార రంగంలోకి ఆయన దూకుతున్నారు. అది కూడా పూర్తి సంతృప్తితో.. తమ పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ విషయంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కూటమి గెలిస్తే అఖిలేశ్ సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి’ అని ములాయం సోమవారం పార్లమెంటులో చెప్పారు. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఎస్పీతో విభేదించి ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశంపై ప్రశ్నించగా ‘అతను ఎలా కొత్త పార్టీ పెడతారు? ఒక వేళ మాట్లాడి ఉంటే ఏదో కోపంలో అనుంటాడు. పార్టీని విడిచి పెట్టి నాసోదరుడు ఎక్కడికీ వెళ్లడు. నేను కూడా రేపటి నుంచి ప్రచారంలోకి దిగుతాను’ అని స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమి విషయంలో ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారంలోకి కూడా వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నంటికీ ముగింపు పలుకుతూ ములాయం తాజా నిర్ణయం ప్రకటించారు. -
పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనగా మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అఖిలేష్‌కు శివపాల్ స్వయానా బాబాయ్ అవుతారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడాన్ని శివపాల్ తప్పుపట్టారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన ములాయం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎతాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, యూపీలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవలేదు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ తరఫునే జస్వంత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ములాయంను అఖిలేష్ అవమానించారని, కావాలనే తన వర్గీయులకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎక్కువ మంది తనతోనే ఉన్నారని శివపాల్ చెప్పారు. యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 11న ఓట్లను లెక్కిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ.. అఖిలేష్, శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి అఖిలేష్ పోరాడుతున్నారు. సంబంధిత వార్తలు చదవండి అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్‌కు రెండు చక్రాలం -
బాబాయికి అబ్బాయ్ మళ్లీ ఝలక్
సమాజ్‌వాద్ పార్టీనంతా తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్న సీఎం అఖిలేష్ యాదవ్ ఇటు బాబాయికి భలే ఝలకిలిస్తున్నారు. తండ్రి ములాయం సింగ్‌కు, తనకు తీవ్ర స్థాయిలో చిచ్చులు రేపిన శివ్‌పాల్ యాదవ్ కున్న అధికారాలన్నింటిన్నీ కత్తిరిస్తూ పోతున్నారు. టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చిన అఖిలేష్‌యాదవ్, బాబాయిని కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ తరుఫున తొలి దశ పోల్స్‌కు ప్రచారం నిర్వర్తించాల్సిన జాబితాను సమాజ్ వాద్ పార్టీ విడుదల చేసింది. ఆ జాబితాలో శివ్‌పాల్ యాదవ్‌ను చేర్చలేదు. ప్రత్యర్థి బాబాయికి టిక్కెట్ ఇవ్వడంతో అఖిలేష్, శివ్‌పాల్ మధ్య నెలకొన్న సంక్షోభం సమసిపోయినట్లేనని కార్యకర్తలు భావించారు. కానీ అంతకముందు పార్టీలో పొరపచ్చలు రేపిన బాబాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానీయకూడదని, ఆయన్ను ప్రచారానికి వాడుకోకూడదని అఖిలేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేతాజీ కోరికమేరకు శివ్‌పాల్‌కు జస్వంత్ నగర్ నియోజకవర్గ టిక్కెట్‌ను అఖిలేష్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తండ్రి మాట మేరకు మళ్లీ తదుపరి ప్రచార జాబితాల్లో శివ్‌పాల్ పేరును చేర్చినా ఆశ్చర్యం పోవాల్సినవసరం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు ఏడు దశల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రచార పోరుకు పార్టీలన్నీ సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఎస్పీ-కాంగ్రెస్‌లకు పోటీగా ఎన్నికల ప్రచారానికి కమలనాథులు సిద్ధమయ్యారు. బీఎస్పీ కూడా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. -
కొడుకు కోసం తమ్ముణ్ని బలి చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై విమర్శలు కురిపించారు. ములాయం తన కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం, తమ్ముడు శివపాల్ యాదవ్‌ను బలిపశువును చేశారని విమర్శించారు. ములాయం కుటుంబంలో విభేదాలన్నీ డ్రామాగా ఆమె అభివర్ణించారు. అఖిలేష్ తమతో విభేదిస్తున్నట్టుగా ములాయం డ్రామా నడిపించారని ఆరోపించారు. అఖిలేష్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ములాయం కుటుంబ సభ్యులు ఈ నాటకం ఆడారని ధ్వజమెత్తారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అఖిలేష్‌కు ఓటమి ఖాయమని మాయావతి అన్నారు. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రథయాత్రపై స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అభ్యర్థులను నిలబెట్టలేని దయనీయ పరిస్థితిలో ఉందని అన్నారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మాయావతి పైవిధంగా స్పందించారు. -
బాబాయ్.. అబ్బాయ్ దోస్తీ ఓకేనా!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరంటారు. సమాజ్‌వాదీ పార్టీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తండ్రీకొడుకుల మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదు గానీ, తమ పార్టీకి చెందిన 191 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అఖిలేష్.. అందులో తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కూడా స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు ఉన్నట్లుగా ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు. ఫిబప్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత నెలలో ములాయం విడుదల చేసిన జాబితాను పక్కన పెట్టి అఖిలేష్ యాదవ్ తన సొంత జాబితా సిద్ధం చేశారు. ములాయం జాబితాలో అఖిలేష్ కీలక అనుచరులైన అతుల్ ప్రధాన్, అరవింద్ సింగ్ లాంటి వాళ్లను పక్కన పెట్టగా తాజా లిస్టులో వాళ్లకు స్థానం దక్కింది. వారితో పాటు శివపాల్ యాదవ్‌కు కూడా చోటు ఇవ్వడంతో తండ్రీ కొడుకుల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని తెలుస్తోంది. అసలు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ ఇద్దరినీ పార్టీ నుంచి పంపేయాలని కూడా ఒక దశలో డిమాండ్ చేసిన అఖిలేష్, ఇప్పుడు తన తొలి జాబితాలోనే బాబాయ్‌కి టికెట్ ఇవ్వడంతో కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడిన విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించకపోయినా చెప్పినట్లే అయ్యింది. ములాయం సింగ్ యాదవ్ చెప్పినట్లే జస్వంత్‌నగర్ నియోజకవర్గ టికెట్‌ను శివపాల్‌కు కేటాయించారు. దాంతో ఇక అటు పార్టీలోను, ఇటు కుటుంబంలోను సమస్యలు ఏమీ ఉండకపోవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ములాయం 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుక్కి ఇచ్చారు. వాటిలో శివపాల్ పేరు ఉంది. -
అయిననూ పోటీచేసి తీరుతాను!
లక్నో: అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అంతర్గత కుటుంబపోరులో చతికిలపడి.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి భ్రష్టుడైన శివ్‌పాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీకి వెనుకాడటం లేదు. అన్న ములాయం కొడుకు అఖిలేశ్ యాదవ్‌తో పార్టీ ఆధిపత్యం విషయమై శివ్‌పాల్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేలు అఖిలేశ్ వైపు మొగ్గు చూపడంతో పార్టీ అధికారిక సైకిల్ గుర్తును అఖిలేశ్ వర్గానికి ఈసీ కేటాయించింది. దీంతో ఎస్పీని అధికారికంగా అఖిలేశ్ చేజిక్కించుకున్నట్టు అయింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ తో సయోధ్యకు సిద్ధపడిన ములాయం సింగ్ యాదవ్.. తన అనుయాయిలను ఎస్పీ తరఫున బరిలోకి దింపాలంటూ 38మంది సభ్యుల జాబితాను కొడుకుకు పంపించారు. ఈ జాబితాలో ములాయం సోదరుడు శివ్‌పాల్ పేరు కూడా ఉంది. ములాయంతో సఖ్యత కోరుతున్న అఖిలేశ్ ఈ జాబితాలోని పేర్లకు చాలావరకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే యూపీ ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని 61 ఏళ్ల శివ్‌పాల్ యాదవ్ స్పష్టంచేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ఒకప్పటి తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ కోరికను అఖిలేశ్ అనుమతిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
అందులో శివపాల్ పేరు లేదు
సమాజ్‌వాద్ పార్టీలో తండ్రికొడుకుల మధ్య నెలకొన్న సైకిల్ సమరానికి సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటనతో తెరపడింది. కొడుకు అఖిలేష్‌కే సైకిల్ గుర్తు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించడంతో, ఇక నేతాజీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసీ ప్రకటన అనంతరం రెండో సారి తండ్రితో భేటీ అయిన ఎస్పీ చీఫ్, కొడుకు అఖిలేష్‌కు, ములాయం 38 అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొడుకుకు ఇష్టంలేని తన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ పేరును ములాయం చేర్చలేదని వెల్లడవుతోంది. కొడుకు వ్యతిరేకతతో తీవ్రంగా మనస్తాపం పొందిన సమయంలో నేతాజీకి వెన్నంటే ఉన్న శివ్‌పాల్ పేరును ములాయం తన అభ్యర్థుల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. అయితే శివ్ పాల్ కొడుకు ఆదిత్య యాదవ్ పేరును మాత్రం నేతాజీ తన జాబితాలో చేర్చారు. అంతేకాక, ములాయం వారసత్వం కోసం పాకులాడుతున్న ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్, ఓం ప్రకాశ్ సింగ్, నారద్ రాయ్, షదాబ్ ఫాతిమా, గాయత్రి ప్రసాద్ ప్రజాపతిలకు ములాయం తన జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. అఖిలేష్‌కు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని ఫైర్ అయిన ములాయం సింగ్, ఇక కొడుకు అభ్యర్థనకు తలొగ్గినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సైకిల్ గుర్తు అఖిలేష్‌కే కేటాయిస్తు ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం అఖిలేష్ తండ్రితో భేటీ అయి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం కూడా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని అఖిలేష్ చెప్పారు. ప్రతిఒక్కర్ని తనతో కలుపుకుని పోటీ చేస్తామని పేర్కొన్నారు. నేతాజీని కూడా కలుపుకుని పోటీ చేస్తామని, తమ బంధుత్వం ఎన్నటికీ విడదీయరానిదని అఖిలేష్ అన్నట్టు తెలిసింది. -
బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్
-
బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్
సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ సరికొత్త బాంబు పేల్చారు. అఖిలేష్ వర్గం తమకు మోటార్ సైకిల్ గుర్తు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరిందని, ఇందుకోసం నెల రోజుల క్రితమే ఎన్నికల కమిషన్‌ను కలిసిందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవానికి సోమవారం లోగా పార్టీలో ఎవరికి ఎంత బలం ఉందో తెలియజేయాలంటూ ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు గడువు విధించిన విషయం తెలిసిందే. దాంతో అఖిలేష్ వర్గానికి చెందిన బహిష్కృత సమాజ్‌వాదీ నేత రాంగోపాల్ యాదవ్ భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి కమిషన్‌కు ఇచ్చారు. కానీ వాటి మీద సంతకాలు ఫోర్జరీవని ములాయం, అమర్‌సింగ్ ఇద్దరూ అన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుంచి తొలగించాలని కూడా ములాయం కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివపాల్ యాదవ్ విడుదల చేసిన వీడియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
బలప్రదర్శనకు దిగిన ములాయం!
-
బలప్రదర్శనకు దిగిన ములాయం!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు విషయమై ఇటు ములాయం, అటు అఖిలేశ్ వర్గాల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎస్పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు తనవైపే ఉన్నారని, కాబట్టి ఆ పార్టీ సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని అఖిలేశ్ వర్గం బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అఖిలేశ్ బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి 'ఆధారాల'ను కూడా చూపెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని కోరింది. అయితే, ఎస్పీకి ప్రతీక అయిన సైకిల్ గుర్తును వదులుకోవడానికి ములాయం ఎంతమాత్రం సిద్ధపడటం లేదు. ఈ విషయంలో కొడుకు అఖిలేశ్‌తో అమీ-తుమీకి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం ఆదివారం ఉదయమే కొడుకు అఖిలేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ వెంటనే లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ములాయం మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ్ముడు శివ్‌పాల్‌తోపాటు తన వర్గం కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. అఖిలేశ్‌కు పోటీగా తన బలప్రదర్శన చాటుకోవడానికి ఈ భేటీని ములాయం వర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ములాయం, శివ్‌పాల్ ఢిల్లీకి తరలివెళ్లారు. పార్టీ గుర్తుపై ఈసీని కలిసి ఎట్టిపరిస్థితుల్లో తమ వర్గానికే దక్కేలా చూడాలని ములాయం వర్గం భావిస్తోంది. -
పాట పాడి అలరించిన శివపాల్ యాదవ్
-
అఖిలేశ్ వెన్నుపోటు?.. రగిలిపోతున్న ములాయం!
-
అఖిలేశ్ వెన్నుపోటు?.. రగిలిపోతున్న ములాయం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అనుకున్నది సాధించారు. ఒకవైపు పార్టీపై పూర్తి పట్టు సాధించడమే కాదు.. మరోవైపు తన బాబాయి శివ్‌పాల్ యాదవ్ వర్గానికి గట్టిగా చెక్ కూడా చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి ములాయం అధీనంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తన చేతుల్లోకి తీసుకున్నారు. దాదాపు 5వేల మంది సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలతో అత్యంత అట్టహాసంగా బహిరంగ సభ తరహాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో అఖిలేశ్ పార్టీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు. తండ్రి ములాయం ఇక నుంచి చీఫ్ మెంటర్ పాత్రను నిర్వహిస్తారని ప్రకటించారు. లక్నోలోని జానేశ్వర్ మిశ్రా పార్కు వేదికగా జరిగిన ఈ సభా ప్రాంగణం అఖిలేశ్ అనుకూల నినాదాలతో దద్దరిల్లింది. అఖిలేశ్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఎం అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌తోపాటు ఎస్పీ సీనియర్ ఎంపీలు నరేశ్ అగర్వాల్, రేవతి రమణ్ సింగ్, మంత్రి అహ్మద్ హసన్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. తనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు ములాయం బహిష్కరించిన నేపథ్యంలో శనివారమే అఖిలేశ్ తన బలప్రదర్శన నిరూపించుకున్న సంగతి తెలిసిందే. 200మందికిపైగా ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు, 35మంది ఎమ్మెల్సీలు అఖిలేశ్‌కు అండగా నిలిచారు. దాదాపు 30మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే శివ్‌పాల్ వర్గం వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ బలప్రదర్శనతో దిగొచ్చిన ములాయం అఖిలేశ్‌పై, రాంగోపాల్ యాదవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో తండ్రి-కొడుకుల మధ్య విభేదాలు సమసిపోతుందని భావించారు. కానీ, అలా జరగలేదు. రాంగోపాల్ యాదవ్ పిలుపుమేరకు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో ఏకంగా ములాయం కుర్చీకి అఖిలేశ్ ఎసరుపెట్టారు. ఇది బహిరంగ వెన్నుపోటేనని శివ్‌పాల్ వర్గం భావిస్తున్నది. శివ్‌పాల్ యాదవ్ వర్గానికి గట్టి మద్దతుగా ఉన్న ములాయం కూడా.. అఖిలేశ్ ధిక్కారంపై మండిపడుతున్నారు. ఈ భేటీ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని, దీనికి హాజరైన వారికి చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయినా, ఆయన ఆదేశాలను పార్టీలో ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదని, ఎస్పీలో మెజారిటీ నేతలు అఖిలేశ్ వైపే నిలిచారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
బాబాయ్ ఫొటోను ఎందుకు తొలగించారు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం 24 గంటల్లోనే నాటకీయ పరిణామాల మధ్య సమసిపోయింది. టికెట్ల కేటాయింపులపై విభేదాలు ఏర్పడటంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్‌లను ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించడం.. ఆజాంఖాన్ జోక్యంతో ములాయం ఇంట్లో అఖిలేష్, రాంగోపాల్, శివపాల్ యాదవ్ సమావేశం కావడం.. వివాదాలను మరచి కలసి పనిచేసేందుకు ములాయం కుటుంబ సభ్యులు అంగీకరించడం.. అఖిలేష్, రాంగోపాల్లపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయడం.. చకచకా జరిగిపోయాయి. కాగా ఈ ఎపిసోడ్ తర్వాత ఓ ఆసక్తికర విషయం ఎస్పీలో చర్చనీయాంశమైంది. ఎస్పీ అధికారిక వెబ్సైట్లో అఖిలేష్ బాబాయ్ శివపాల్ ఫొటో మాయమైంది. హోం పేజీలో ములాయం, అఖిలేష్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. శివపాల్ ఫొటోను రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు. ఇక అఖిలేష్, రాంగోపాల్ యాదవ్‌లను బహిష్కరిస్తూ ములాయం చేసిన ప్రకటనలను వెబ్సైట్ నుంచి తొలగించారు. శివపాల్‌తో అఖిలేష్, రాంగోపాల్ విభేదిస్తున్న సంగతి తెలిసిందే. -
'టిక్కెట్లపై బెంగ వద్దు.. నిశ్చింతగా ఉండండి'
లక్నో: పార్టీ టికెట్ విషయంలో ఎవరూ ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన విశ్వసనీయులతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లో ప్రచారం చేయాలని వారితో చెప్పినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 70మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కలిశారంట. అలా కలిసిన వారందరికీ ఆయన పార్టీ టిక్కెట్ల విషయంలో హామీ ఇచ్చారట. అయితే, వాస్తవానికి పార్టీ టిక్కెట్ల పంపకం బాధ్యత సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ తమ్ముడు శివపాల్ యాదవ్‌ది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయనే సీట్ల పంపకాలు కూడా చూసుకుంటున్నారు. ములాయంను కలిసి సీట్ల విషయంలో సమాలోచనలు చేస్తున్నారు. సీఎం అఖిలేశ్‌ను పక్కకు పెట్టారు. అయితే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకన్న అఖిలేశ్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను తన వద్దకు పిలుచుకొని పార్టీ సీట్ల విషయం చర్చిస్తూ పార్టీ హైకమాండ్‌కు తాను కూడా ముఖ్యమే అనే సంకేతాలు పంపిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మధ్య తనను పక్కకు పెడుతున్నారని, పార్టీలో మరోసారి భూకంపం వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హైకమాండ్దేనంటూ ఆయన ఇతాహ్‌లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. తనను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పెద్దలు పక్కకు పెట్టాలన్న ఆలోచన చేయోకూడదని తాజా ఎమ్మెల్యేలతో భేటీ ద్వారా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. -
సమాజ్‌వాదీలో మళ్లీ రగడ
-
సమాజ్‌వాదీలో మళ్లీ రగడ
రజతోత్సవ వేడుకల్లో అఖిలేశ్-శివ్‌పాల్ మాటల యుద్ధం లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. బాబాయ్... అబ్బాయ్ వర్గాలుగా విడిపోయిన పార్టీ... కుటుంబ కలహాలతో జనం సాక్షిగా మళ్లీ రచ్చకెక్కింది. శనివారమిక్కడ జరిగిన ఎస్పీ రజతోత్సవ వేడుకల్లో సీఎం అఖిలేశ్ యాదవ్... పార్టీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్ సోదరుడు, రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్‌యాదవ్ మరోసారి కత్తులు దూసుకున్నారు.ములాయం కుమారుడు కనుకనే అఖిలేశ్ సీఎం కాగలిగారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించి శనివారం సభలో శివ్‌పాల్ మాటల యుద్ధానికి తెర లేపారు. ‘కొంతమందికి అదృష్టంతో కొన్ని దక్కుతాయి. కొంతమందికి కష్టంతో, మరికొంత మందికి వారసత్వంతో లభిస్తాయి. కానీ, జీవితాంతం కష్టపడి పనిచేసినా కొందరికి ఏమీ దక్కవు’ అంటూ అఖిలేశ్‌ను ఉద్దేశించి అన్నారు. . అహర్నిశలూ పార్టీ కోసం శ్రమిస్తూ, నాలుగేళ్లుగా అఖిలేశ్‌కు ఎంతో సహకరిస్తున్నానన్న శివ్‌పాల్... ‘ఇంకా ఏమేం త్యాగాలు చేయమంటావో చెప్పు అఖిలేశ్... అందుకు సిద్ధంగా ఉన్నా. నేనెప్పుడూ సీఎం కావాలనుకోలేదు’ అని అన్నారు. మంత్రిగా తనను తొలగించినా, అవమానపరిచినా పార్టీ కోసం రక్తం చిందించడానికి ఎప్పుడూ వెనుకాడనన్నారు. వెంటనే మైకందుకున్న అఖిలేశ్... ‘ప్రజాపతి (శివ్‌పాల్ వర్గం) నాకు కత్తి బహూకరించారు. మీరు కత్తి ఇచ్చి... దాన్ని ఉపయోగించకూడదంటారు’ అని చురకలంటించారు. ‘అవసరమైతే పరీక్ష పెట్టుకో. నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు సభలో పాల్గొన్నారు. ఇలాంటి కీలక సమయంలో గొడవలు తగవని శివ్‌పాల్, అఖిలేశ్‌కు సర్ది చెప్పారు. లాలూ జోక్యంతో శివ్‌పాల్... అఖిలేశ్ పనితీరు భేషంటూ కితాబిచ్చారు. సీఎం... శివ్‌పాల్‌కు పాదాభివందనం చేశారు. ఇరువురూ చేతులు కలిపారు. -
వేదిక మీద హైడ్రామా.. తోసిపారేసిన బాబాయ్!
-
వేదిక మీద హైడ్రామా.. తోసిపారేసిన బాబాయ్!
సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవ వేడుకలు సాక్షిగా ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లక్నోలో జరిగిన ఈ వేడుక సీనియర్ నేత, బాబాయ్ శివ్‌పాల్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి వేదికగా మారింది. పార్టీ శ్రేణులు, ప్రజల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరోక్ష వాగ్బాణాలు సంధించుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే రజతోత్సవ సభ వేదికపై హైడ్రామా చోటుచేసుకుంది. సభలో ఎస్పీ నేత జావేద్ అబిదీ అఖిలేశ్‌కు మద్దతుగా చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఎన్నికలకు ముందే అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. అఖిలేశ్ మద్దతుదారుడైన ఆయన ఇలా మాట్లాడుతుండగానే బాబాయ్ శివ్‌పాల్ దూసుకొచ్చి.. అబిదీని మధ్యలోనే అడ్డుకున్నారు. బలవంతంగా మైక్ ముందునుంచి అవతలకు గెంటేశారు. దీంతో సభ వేదికపై ఒకింత గందరగోళం నెలకొంది. పార్టీ యూపీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్ కనుసన్నల్లో ఎస్పీ రజతోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్ మద్దతుదారుడికి ఈవిధంగా చేదు అనుభవం ఎదురవ్వడం గమనార్హం. అంతకుముందు కూడా పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ దెప్పిపొడిచారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు. -
కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్
ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య ఉన్న లుకలుకలు మరోసారి బహిరంగ వేదికపై బయటపడ్డాయి. పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంతకుముందు చెప్పారు. మతవాద శక్తులు విజయం సాధించకుండా.. మనం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతామని కార్యకర్తలతో అన్నారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) రక్తమాంసాలు ధారపోసి ఈ పార్టీ పెట్టారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇప్పటికి చాలాదూరం వచ్చామని, ఇక పార్టీని మరో మెట్టు పైకి ఎక్కించాలని, మనమంతా కలిసి ఈ పని చేయాలని చెప్పారు. గత కొన్నేళ్లుగా రోడ్లనిర్మాణం, ఇతర అంశాల్లో చాలా రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. -
కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్
-
'ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) రజతోత్సవ వేడుకల్లో పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో మూడు సార్లు సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి గల కారణం పార్టీ అధ్యక్షుడు ములాయాం సింగ్ యాదవ్ అని అన్నారు. సమస్యలను ఎదుర్కొవడంలో ములాయాం సమర్ధతే ఆయన్ను ఈ స్ధాయికి చేర్చిందని చెప్పారు. పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ విషయాన్ని కార్యకర్తలకు సభాముఖంగా చెబుతున్నానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన బాగుందని కితాబిచ్చారు. ఈ సర్కారులో గత నాలుగేళ్లుగా ప్రజలకు సేవ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ కోసం రక్తం ధారపోయడానికైనా తాను సిద్ధమని, తనను ముఖ్యమంత్రి చేయాల్సిన పనిలేదని చెప్పారు. తనను ఎంతగా అవమానించినా పర్లేదని అన్నారు. తాను ఎన్ని మంచి పనులు చేశానో తన ఆత్మకు తెలుసునని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖిలేశ్ బాగా పనిచేశారు. పీడబ్ల్యూ శాఖలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించానట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం తనను తాను బలి చేసుకోవడానికైనా సిద్ధమని చెప్పారు. నేతాజీ చెప్పినట్లే పాలనను కొనసాగిస్తానని అన్నారు. తాను జనంలో నుంచి పుట్టిన నాయకుడినని చెప్పిన శివపాల్.. తన గురించి తప్పుడు ప్రచారం చేసే వారి గురించి జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. తనను ఎన్నిసార్లు అవమానించినా, ఎన్నిసార్లు పదవి నుంచి తొలగించినా.. తాను చేసిన మంచి పనులు తన ఆత్మకు తెలుసునని అన్నారు. -
మొదటిసారి పండుగకి ఊరెళ్లని ములాయం!
సమాజ్‌వాద్ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇంట కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఇప్పుడిప్పుడే సర్దుమణిగేలా కనిపించడం లేదు. దివాళి వేడుకలతో ప్రతేడాది తమ స్వగ్రామం సైఫై గ్రామంలో సంతోషంగా కలిసే నేతాజీ కుటుంబసభ్యులు, ఈ సారి తలోదిక్కుగా వేడుకలు జరుపుకున్నారు. నేతాజీ అయితే ఈ సారి దివాళి వేడుకలకు అసలు తన స్వగ్రామమే వెళ్లలేదు. మొదటిసారి ఆయన ఈ వేడుకలకు మిస్ అయ్యారు. అయితే నేతాజీ ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే, ఆయన దివాళి వేడుకలకు హాజరుకాలేకపోయారని పలువురు అంటున్నారు. అదేవిధంగా దివాళి వేడుకలకు సైఫై గ్రామం వెళ్లిన పార్టీ కుటుంబసభ్యులు కూడా గెట్ టూ గెదర్ కాలేదట. ముఖ్యమంత్రి అఖిలేష్, బాబాయ్ శివపాల్ ఇద్దరూ విడివిడిగా, వేరువేరు రోజుల్లో సైఫైకు వెళ్లారు. శనివారం సైఫై వెళ్లిన అఖిలేష్ యాదవ్, తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్థానిక పార్టీ వర్కర్లతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ నుంచి బహిష్కృతమైన రాజ్యసభ సభ్యుడు, తన అంకుల్ రాంగోపాల్ యాదవ్ ఇంట్లో 30 నిమిషాల పాటు గడిపారు. మరోవైపు అఖిలేష్ సైఫై నుంచి లక్నోకు బయలుదేరిన అనంతరం తన బాబాయి శివపాల్ యాదవ్ ఆ గ్రామానికి చేరుకున్నారు. రోడ్డుమార్గంలో నేరుగా అతని చౌగుర్జీ రెసిడెన్స్‌కు వెళ్లారు. ఇటావా జిల్లా బకేవార్ క్రాసింగ్ ప్రాంతంలో శివపాల్ మద్దతుదారులు ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఇలా విడివిడిగా దివాళి వేడుకలకు తమ స్వగ్రామానికి వెళ్లిన యాదవ్ కుటుంబ సభ్యుల తీరును చూస్తే... వారి మధ్య ఘర్షణలు ఇప్పుడిప్పుడే సర్దుమణిగేలా కనిపించడం లేదని పలువురంటున్నారు. -
సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..
న్యూడిల్లీ: ములాయం సింగ్ యాదవ్ 'ఆల్ ఈజ్ వెల్' ప్రకటనతో సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగినా.. వచ్చేవారం ఆ పార్టీకి సంబంధించిన రెండు కీలక ఘట్టాలు పాతగొడవల్ని తట్టిలేపుతాయని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకటి నవంబర్ 3నుంచి ప్రారంభం కానున్న అఖిలేశ్ రథయాత్ర, రెండు నవంబర్ 5న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుక. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు తాను కూడా హాజరవుతానని, అయితే అఖిలేశ్ స్వయంగా ఆహ్వానిస్తేనే ఆ అక్కడికి వెళతానని అన్నారు. రథయాత్రపై విలేకరులు అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన శివపాల్..'నన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంటే ఇప్పుడు నేను సీఎం దగ్గర పనిచేయడం లేదు. కాబట్టి రథయాత్రకు విధిగా వెళ్లను. పిలిస్తేనే వెళతా'అని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ తండ్రి మాట వినాలని హితవుపలికారు. సమాజ్ వాదీ పార్టీ 25ఏళ్ల వేడుకకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. అందులో భాగంగా పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్ డీ) చీఫ్ అజిత్ సింగ్ ను కలుసుకుకుని, ఆహ్వాన పత్రిక అందజేశారు. జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితిశ్ కుమార్ తోపాటు ములాయం వియ్యంకుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఇతర పార్టీల ముఖ్యులనూ సమాజ్ వాదీ పాతికేళ్ల వేడుకకు ఆహ్వానించనున్నట్లు శివపాల్ విలేకరులకు చెప్పారు. మరి 'కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను కూడా ఆహ్వానిస్తారా?' అని ప్రశ్నించగా.. 'కేవలం సోషలిస్టు పార్టీలను మాత్రమే పిలుస్తున్నాం'అని బదులిచ్చారు. కొడుకు అఖిలేశ్ తిరుగుబావుటా సంకేతాల నేపథ్యంలో ములాయం.. పార్టీ పాతికేళ్ల వేడుకను కొత్త పొత్తులకు కేంద్రంగా మలుచుకుంటారనే ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది. -
ములాయం తలవంచేది ఎవరికో తెలుసా?
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభంలో ఎవరి పట్టు వారిదే. బాబాయ్ శివపాల్ యాదవ్‌ను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నట్లు అఖిలేష్ ఏకపకక్షంగా ప్రకటించారు. అఖిలేష్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అంతే ఏకపక్షంగా ములాయం తీసేశారు. కానీ.. వీళ్లందరూ తల వంచేది మాత్రం ఒక్కరి ముందే. ఆయనెవరో తెలుసా.. ఆఫ్టరాల్ ఒక పంచాయతీ పెద్దమనిషి. అలాగని ఆయన్ను ఆఫ్టరాల్‌గా తీసి పారేయడానికి ఏమాత్రం లేదు. ములాయం సొంత ఊరైన సైఫై గ్రామానికి ఆయనే పెద్ద. తన కుటుంబ వ్యవహారాల్లో బయటి వ్యక్తులెవర్ని మధ్యలో తలదూర్చనివ్వని సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మాత్రం దర్శన్ సింగ్ యాదవ్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. దర్శన్ సింగ్ కేవలం ఓ సాధారణ వ్యక్తి మాత్రమే కాదట. నేతాజీ స్వస్థలం ఇటావా జిల్లా సైఫై గ్రామానికి అతనే ప్రధానమంత్రి. గత సోమవారం ములాయం, తమ్ముడు శివపాల్, కొడుకు అఖిలేష్లతో పాటు దర్శన్ సింగ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొట్లాటలు అధికార పార్టీకి అంతమంచిది కాదని సర్దిచెప్పి దర్శన్ వారిని ఇంటికి పంపారు. ఈ సమావేశనంతరం అఖిలేష్ కూడా తమ ప్రధాన్జీతో భేటీ అయిన విషయాన్ని ఎంతో గర్వంగా పార్టీ శాసనసభ్యులకు చెప్పుకున్నారు. అసలు దర్శన్‌కు ములాయం ఎందుకంత ప్రాముఖ్యమిస్తారంటే ఒకింత ఆశ్చర్యమే. తన రాజకీయాలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ములాయం ఓ షెడ్యూల్ కులాల వ్యక్తి ఇచ్చిన మంచినీళ్లు తాగినందుకు గ్రామస్తులందరూ నేతాజీని కొట్టడానికి ముందుకు వచ్చారట. అప్పుడు ములాయంను ఆయనే కాపాడారు. ములాయం వండిన బంగాళదుంప కూరను తిని, ఇప్పుడు నేను కూడా అంతే నేరాన్ని చేశాను. నన్ను కూడా శిక్షించండంటూ ముందుకు వెళ్లాడట. దీంతో గ్రామస్తులందరూ వెనక్కి తగ్గారు. అప్పటినుంచి సైఫై గ్రామానికి దర్శన్ ప్రధాన్‌గా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ చూస్తుంటే ఇప్పటికీ యూపీలో ఏమేరకు గ్రామ పెద్దల హవా నడుస్తుందో అర్థమవుతోంది. ఈ విషయంపై దర్శన్‌ను సంప్రదించగా.. ఇవి కేవలం రాజకీయ కొట్లాటలేనని, తకు ఏది మంచి అనిపించిందో అది వారికి సర్ది చెప్పిపంపానని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. మరోవైపు ములాయం ఇంట ఇంతపెద్ద గొడవ జరుగుతున్నా.. ములాయం అన్న మాత్రం తనకేమీ తెలియదన్నట్లే ఉన్నారు. భూదాన్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తండ్రి, ములాయం పెద్దన్న అభయ్ రామ్ యాదవ్‌ను ప్రశ్నిస్తే, ''వ్యవసాయంలో ఏమన్నా సందేహాలుంటే నన్ను అడగండి కానీ లక్నోలో ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు'' అని తేల్చేశారు. -
సరికొత్త పొత్తులు.. కూడికలు, తీసివేతలు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పలు రకాల మలుపులు తిరుగుతున్నాయి. బాబాయ్ - అబ్బాయ్ మధ్య మొదలైన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. ఒక్కో రోజు గడిచేకొద్దీ అది మరింత ముదురుతోంది. గత వారంరోజులుగా ఒకవైపు రాజీనామాలు, మరోవైపు తొలగింపులు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. పార్టీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎల్డీలతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ములాయం కూడా ఈ పొత్తుకు సూత్రప్రాయంగా అనుమతి తెలిపారని, త్వరలో ఆయా పార్టీలతో చర్చలు ఉండొచ్చని అన్నారు. అయితే తాము ఇంతవరకు యూపీలో ఏ పార్టీతోనూ పొత్తు చర్చలు మొదలుపెట్టలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడుతున్న షీలా దీక్షిత్ చెప్పారు. ఆర్ఎల్డీ కూడా పొత్తు వార్తలను ఖండించింది. మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు పలికే నాయకుల సంఖ్య పార్టీలో పెరుగుతోంది. కీలక నేతలు నరేష్ అగర్వాల్, బేణీప్రసాద్ వర్మ, రేవతీ రమణ్ సింగ్ లాంటి వాళ్లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా కూడా సీఎం బ్రిగేడ్‌తో పాటు ఉన్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ మూడో తేదీ నుంచి సీఎం అఖిలేష్ యాదవ్ ప్రారంభించే రథయాత్రలో కిరణ్మయ్ నందా కూడా పాల్గొంటారని అంటున్నారు. మంత్రివర్గంలోకి మళ్లీ తనను తీసుకునే అవకాశం లేదని స్పష్టం కావడంతో శివపాల్ యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు ఇంటిముందు గోడమీద ఉన్న నేమ్ ప్లేటును కూడా తొలగించారు. ఆయన అధికారిక వాహనాన్ని కూడా అప్పగించేశారు. తీసేసిన మంత్రులను మళ్లీ పదవుల్లో నియమించాలని ములాయం చెప్పినా.. అఖిలేష్ మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. మరో చిన్నాన్న.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు.. బహిష్కరణకు గురైన తన అనుచరులను పార్టీలోకి తీసుకునేవరకు మంత్రులను మళ్లీ తీసుకునేది లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. -
అఖిలేష్ చేతుల్లోనే శివపాల్ తలరాత
-
ఆ ముగ్గురు మంత్రుల మాటేంటి?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్.. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శివపాల్ యాదవ్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా సీఎం అఖిలేష్ యాదవ్‌కు ములాయం చెప్పినట్టు సమాచారం. అయితే శివపాల్‌తో పాటు ఉద్వాసనకు గురైన మరో ముగ్గురు మంత్రుల మాటేంటన్న ప్రశ్న ఎస్పీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిని కూడా మళ్లీ కేబినెట్లోకి తీసుకోవాల్సిందిగా ములాయం తన కుమారుడికి చెప్పారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కాగా శివపాల్ అనుచరుడు, ఎమ్మెల్సీ అశు మాలిక్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మంత్రి పవన్ పాండేను తొలగించాలని అఖిలేష్‌కు ములాయం సూచించినట్టు తెలుస్తోంది. అఖిలేష్ తన బాబాయ్ శివపాల్‌తో పాటు నలుగురు మంత్రులను ఆదివారం తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే అమర్ సింగ్‌కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని అఖిలేష్ ఆరోపించారు. అదే రోజు అఖిలేష్‌కు మద్దతుగా ఉన్న సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో, ములాయం కుటుంబంలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. -
అఖిలేష్ చేతుల్లోనే శివపాల్ తలరాత
తన తమ్ముడు శివపాల్ యాదవ్‌కు మంత్రిపదవి మళ్లీ ఇవ్వాలా.. వద్దా అనే విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కే వదిలిపెడుతున్నానని, ఆ విషయంలో అతడే నిర్ణయం తీసుకుంటాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. దాన్ని బట్టి ఆ అంశంపై తాను అంతగా పట్టుబట్టలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎటూ ఉంది కాబట్టి, మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడే ఈ విషయంలో తొందరపడటం ఎందుకని తమ్ముడికి ఆయన నచ్చజెప్పినట్లు సమాచారం. ఎటూ రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పాం కాబట్టి.. అప్పుడే కావల్సిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చన్నది ములాయం వ్యూహంలా కనిపిస్తోంది. ఈ రెండు నెలల్లో అనవసరంగా రచ్చ చేసుకుని పార్టీ పరువును రోడ్డున పడేసుకోవడం ఎందుకన్న ఆలోచనతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని అంటున్నారు. అయితే ములాయం మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివపాల్ యాదవ్ పాల్గొన్నారు గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. అలాగే.. శివపాల్‌ను కేబినెట్లోకి తీసుకోవడం, అమర్‌సింగ్ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. తాను చెప్పదలచుకున్నది నర్మగర్భంగా చెప్పి, అంతటితో ప్రెస్‌మీట్ ముగించి వెళ్లిపోయారు. ప్రస్తుతం వస్తున్న సర్వే ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సొంతంగా అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే అనుమానంగా కనిపిస్తోంది. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాతి పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పడం ఎందుకన్నది ములాయం అభిప్రాయంలా అనిపిస్తోంది. ప్రస్తుతం చెలరేగిన చిచ్చు ఇటు పార్టీతో పాటు అటు కుటుంబంలో కూడా చెలరేగడంతో.. ముందు దాన్ని చల్లార్చిన తర్వాత ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. రెండోభార్య సాధన కోడలు అపర్ణాయాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించడం లాంటి కారణాల వల్ల అప్పుడే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది ములాయం వ్యూహమని ఆయన అనుచరులు చెబుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
-
వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
సమాజ్‌వాదీ పార్టీ, తమ కుటుంబం, తమ బలం, బలగం అంతా ఒక్కటిగానే ఉన్నాయని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకుండా.. తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ములాయం మీడియాతో మాట్లాడారు. కొంతమంది తనను ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతున్న మాట నిజమే కానీ.. ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ఎందుకని అన్నారు. మీరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. తాను మాత్రం వివాదాస్పద సమాధానం ఒక్కటి కూడా ఇవ్వబోనని చెప్పారు. 2012లో మెజారిటీ తన పేరునే ప్రతిపాదించినా, తాను మాత్రం అఖిలేష్ యాదవ్‌నే ముఖ్యమంత్రి చేశానని, ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఆయనేనని తెలిపారు. రాంగోపాల్ యాదవ్ చేసిన ప్రకటనలను తాను ఇప్పుడు పెద్ద సీరియస్‌గా పట్టించుకోనన్నారు. కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను మళ్లీ తీసుకుంటారా. లేదా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి మీదే వదిలిపెడుతున్నానన్నారు. తమ కుటుంబంలోను, పార్టీలోను విభేదాలు సృష్టించే ప్రయత్నం బయటివ్యక్తులే చేశారని, ఇప్పుడు పార్టీలో అంతా సవ్యంగానే ఉందని చెప్పారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అఖిలేష్ నాయకత్వంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనే తమ ముఖ్యమంత్రి అని చెప్పారు. అమర్‌సింగ్‌ను బహిష్కరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. శివపాల్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోవడంపై కూడా దాటవేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూనే అక్కడినుంచి వెళ్లిపోయారు. -
సమాజ్‌వాదీలో పరివార్
పార్టీ సమావేశంలో వీధికెక్కిన కుటుంబ విభేదాలు - ములాయం, అఖిలేశ్, శివ్పాల్ల మధ్య మాటల తూటాలు - నాన్న ఆదేశిస్తే తప్పుకుంటా, కొత్త పార్టీ ఎందుకు పెట్టాలి?: అఖిలేశ్ - నీ సామర్థ్యమెంత? ఎన్నికల్లో గెలవగలవా? అమర్ సోదరుడితో సమానం : ములాయం - సీఎం పగ్గాలను ములాయం చేపట్టాలి: శివ్‌పాల్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సోమవారం రోడ్డెక్కాయి. పార్టీ నేతలు, కార్యకర్తల సాక్షిగా బాబాయ్, అబ్బాయ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్, బాబాయ్ శివపాల్‌లు మాటల తుటాలతో తలపడ్డారు. తండ్రి ఆదేశిస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ స్పష్టం చేయగా... తమ్ముడు శివపాల్, స్నేహితుడు అమర్‌సింగ్‌ల పక్షాన నిలిచిన ములాయం... ‘నువ్వెంత? నీ సామర్థ్యమెంత? గీత దాటితే సహించన’ంటూ కొడుకును తీవ్రంగా హెచ్చరించారు. సీఎంను మార్చే ఉద్దేశం లేదనీ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ భేటీలో, వెలుపల నినాదాలతో హోరెత్తించారు. మూడు నెలల అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలికేందుకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ లక్నోలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. అఖిలేశ్, శివ్‌పాల్‌లు వేదికపైనే గొడవపడడంతో రాజీ లేకుండానే భేటీ అర్ధంతరంగా ముగిసింది. సమావేశానికి అఖిలేశ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆవేశంగా ప్రసంగించారు. ములాయం కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరు నిజాయతీ పరులని ములాయం భావిస్తే వారిని సీఎంగా నియమించండి. నేనేందుకు కొత్త పార్టీ పెట్టాలి?’ అని ప్రశ్నించారు. తండ్రే నాకు గురువు.. అఖిలేశ్: ‘నా తండ్రే నాకు గురువు... చాలా మంది మా కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏదైనా తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలో సొంతంగా నేర్చుకున్నా’ అంటూ అమర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. అక్టోబర్‌లో భారీ మార్పు జరుగుతుందంటూ అతను(అమర్) ముందే చెప్పాడని వెల్లడించారు. పార్టీ రజతోత్సవాలకు సీఎం రాకపోవచ్చని అందరూ భావించగా. ‘నా రథయాత్ర కొనసాగుతుంది... వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం’ అని స్పష్టం చేశారు.తన పరిధి దాటి ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. శివ్‌పాల్ కృషిని మర్చిపోలేను: ములాయం ఎస్పీ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని, పార్టీ సభ్యులు ఒకరితో ఒకరు గొడవపడొద్దని ములాయం సూచించారు. ‘అమర్, శివ్‌పాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించను. నేను జైలుకు వెళ్లకుండా అమర్ నన్ను కాపాడారు. అతను నాకెంతో సాయం చేశారు. అమర్ నాకు సోదరుడితో సమానం. కేవలం ఎర్ర టోపీ పెట్టుకుంటే సమాజ్‌వాదీ సభ్యులు కారు. కొందరు మంత్రులు భజనపరులు. శివపాల్ కృషిని నేను మర్చిపోలేను. శివ్‌పాల్ ప్రజానేత.పార్టీ బలోపేతానికి నేనెంతో కష్ట్టపడ్డా. లోహియా సిద్ధాంతాల్ని అనుసరించి పేదలు, రైతుల కోసం పోరాడాను’ అని పేర్కొన్నారు. ఒక దశలో అఖిలేశ్‌ను ఉద్దేశించి... ‘నీ సామర్థ్యం ఎంత? నువ్వు ఎన్నికల్లో గెలవగలవా? విమర్శల్ని సహించలేనివారు నేతలు కాలేరు. విమర్శ సరైనదైతే, అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుంది’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమర్‌లో నాలుగో వంతు చేయవు: శివ్‌పాల్ అఖిలేశ్‌పై తొలిసారి బాబాయ్ శివపాల్ బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పెడతానని సీఎం నాతో చెప్పారు. అలాగే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటానన్నారు. ఈ విషయంలో గంగాజలంపై ప్రమాణం చేస్తా. ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టమని అన్నయ్యను కోరుతున్నా’ అని ఉద్వేగంతో అన్నారు. ‘నీ విలువ అమర్‌లో నాలుగో వంతు కూడా చేయదు’ అని అఖిలేశ్‌ను పరోక్షంగా తప్పుపట్టారు. మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకి చెందిన క్యూఈడీ పార్టీ ఎస్పీ విలీన అంశంపై స్పందిస్తూ.. అ న్సారీని పార్టీలోకి ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు సులువుగా గెలిచేందుకు విపక్ష ఎమ్మెల్యేల మద్దతుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో నా పాత్ర ఏమీ లేదా? నా ఆధ్వర్యంలోని శాఖలు సమర్థంగా పనిచేయలేదా? విపక్ష నేతలూ నా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఏది సరిగా చేయలేదో సీఎం చెప్పాలి. నన్ను ఆహ్వానించకపోయినా... నేను సీఎం ఇంటికి వెళ్లేవాడిని’ అని అన్నారు. అఖిలేశ్, శివపాల్ వర్గాలకు చెందిన కార్యకర్తలు తామేం తీసిపోలేదంటూ లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అఖిలేశ్‌కు నా ఆశీస్సులు: అమర్‌సింగ్ తనపై ఆరోపణలు, ప్రశ్నలకు కొన్నిసార్లు మౌనం మంచి సమాధానం అవుతుందని అమర్ సింగ్ అన్నారు. అఖిలేశ్ తమ అధినేత కుమారుడని, అతనికి తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. మళ్లీ సయోధ్య? ములాయంతో అఖిలేశ్, శివ్‌పాల్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: అఖిలేశ్, శివపాల్‌ల మధ్య సోమవారం గొడవ అనంతరం తాత్కాలిక సంధి కోసం ములాయం పావులు కదిపారు. సీఎంగా అఖిలేశ్ కొనసాగుతారని, పార్టీ బాధ్యతలు శివ్‌పాల్ చూసుకుంటారనే ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఇక మాట్లాడేది లేదని, తన ఆరోగ్యం సరిలేదని ములాయం స్పష్టం చేశారు. ఇరు వర్గాలు కొంత మేర శాంతించాయని, త్వరలోనే సంధి కుదిరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోమవారం రాత్రి అఖిలేశ్, శివపాల్‌లు ములాయంతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ పార్టీ టికెట్లు తమ వర్గీయులకే ఇప్పించుకునే క్రమంలో ఈ కుమ్ములాటలు మొదలయ్యాయని భావిస్తున్నారు. సీఎంకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇస్తే పార్టీ ఓటమి తప్పదని శివ్‌పాల్ వాదన. తమ వర్గీయులకు టికెట్లు రాకుండా అడ్డుపడుతున్నారనేది అఖిలేశ్ ఆరోపణ. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో తానే నిర్ణయిస్తానని ములాయం వారిద్దరికీ స్పష్టం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉందని, ఈ సమయంలో ఆధిపత్యం కోసం గొడవ అవివేకమని ములాయం చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ కుమ్ములాటలతో పలు వర్గాలతో పాటు ప్రత్యేకించి మైనార్టీలకు పార్టీ దూరమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ తగాదాలతో బహుజన్ సమాజ్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ. అఖిలేశ్ సీఎంగా ఉన్నా.. పాలనలో ములాయం జోక్యం కొనసాగుతూనే ఉం ది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అనితాసింగ్ ద్వారా వ్యవహారాల్ని ములాయం చక్కబెట్టేవారు. ఈ విషయంలో అఖిలేశ్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కీలక శాఖలైన నీటి పారుదల, పీడబ్ల్యూడీ(ప్రజా పనులు) శివ్‌పాల్ ఆధ్వర్యంలో ఉండడం తో భారీ ప్రాజెక్టులు ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆ శాఖలకు సంబంధించి తన మాట చెల్లుబాటు అవ్వకపోవడం అఖిలేశ్‌కు ఆగ్రహం తెప్పించింది. -
మోదీపై ములాయం అనూహ్య వ్యాఖ్యలు
లక్నో: బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాజాగా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్-శివ్‌పాల్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ములాయం లక్నోలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రధాని మోదీని చూడండి. అకింతభావం, అకుంఠిత శ్రమతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన తల్లిని వీడబోనని ఎప్పుడూ చెప్తూ ఉంటారు' అని ములాయం ప్రశంసించారు. అదేవిధంగా తాను తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను, సీనియర్ నేత అమర్‌సింగ్‌ను వీడబోనని స్పష్టం చేశారు. "అమర్ సింగ్ నాకు సోదరుడు లాంటివాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు నాకు అండగా నిలిచాడు. శివ్‌పాల్ ప్రజానాయకుడు. నా కోసం, పార్టీ కోసం శివ్‌పాల్ చేసిన కృషిని నేను ఎప్పటికీ మరువను. వారిద్దరినీ వదులుకోలేను' అని ములాయం అన్నారు. అమర్ సింగ్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని, ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని చెప్పారు. -
మీ కన్నా నేనే పెద్ద గూండాను!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో కొడుకు అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న యువత కన్నా తానే పెద్ద గూండానని తేల్చిచెప్పారు. కొడుకు అఖిలేశ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ మధ్య ఆధిపత్యం కోసం ఎస్పీలో తీవ్రస్థాయిలో రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివ్‌పాల్‌తోపాటు ఆయన సన్నిహిత మంత్రులపై సీఎం అఖిలేశ్ వేటు వేయగా.. అఖిలేశ్ సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి శివ్‌పాల్ యాదవ్ గెంటేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శివ్‌పాల్-అఖిలేశ్ మధ్య నిట్టనిలువుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఎస్పీ అత్యవసర భేటీని ములాయం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఊహించినట్టుగానే అఖిలేశ్‌పై పరోక్ష వ్యాఖ్యలతో ములాయం విరుచుకుపడ్డారు. అదేసమయంలో ఈ సంక్షోభానికి కారణమైనట్టు భావిస్తున్న తమ్ముడు శివ్‌పాల్, సీనియర్ నేత అమర్‌సింగ్‌కు మద్దతు పలికారు. ఆయన ఏమన్నారంటే.. పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఎంతో క్లిష్టమైనదని నాకు తెలుసు. పార్టీలో ఇలాంటి విభేదాలు రావడం బాధ కలిగిస్తోంది ఎంతో కష్టపడి మేం ఈ పార్టీని స్థాపించాం. మేం యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. యువత పార్టీలో ఎక్కువసంఖ్యలో చేరేవిధంగా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశాం. కానీ ఈ పార్టీలో చేరిన యువ నాయకులు తమకుతాము గూండాలం అనుకుంటున్నారు. కానీ నేను వారి కన్నా ఇంకా పెద్ద గూండాను. ఇది నేను స్థాపించిన పార్టీ. ఈ రోజుకూ నేను బలహీన వ్యక్తిని కాదు. యువత నా వెంట లేరని ఎంతమాత్రం అనుకోకండి. విమర్శలను చెవికెక్కించుకోలేని వారు నాయకుడిగా ఎదగలేరు కొంతమంది మంత్రులు భజనపరులుగా మారిపోయారు. పెద్ద మనసుతో ఆలోచించలేనివారు మంత్రులు కాలేరు. పార్టీలోని బలహీనతలపై పోరాడాల్సిన సమయంలో మనలో మనం పోరాడుకుంటున్నాం. భజనపరులతో, నినాదాలతో పార్టీని నడిపించలేం. -
కన్నీళ్లు పెట్టిన అఖిలేశ్ యాదవ్
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో చీలిక దిశగా వెళుతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మౌనం వీడారు. తన తండ్రితో ఎటువంటి విభేదాలు లేవని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. లక్నోలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాదని అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనపై చర్య తీసుకున్నారని వాపోయారు. 'నేను కొత్త పార్టీ పెడతానని కొంత మంది అంటున్నారు. కొత్త పార్టీ ఎవరు పెడుతున్నారు. నేనైతే పార్టీ పెట్టడం లేద'ని అఖిలేశ్ అన్నారు. అయితే అఖిలేశ్ కు భిన్నమైన వాదన వినిపించారు శివపాల్ యాదవ్. కొత్త పార్టీ పెడతానని తనతో అఖిలేశ్ స్వయంగా చెప్పాడని వెల్లడించారు. పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకున్నారు. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నారు. ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ములాయం ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తా. ములాయం కోరితేనే ప్రజాపతిని మంత్రి పదవి నుంచి తొలగించాను. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు. -
తన్నుకున్న బాబాయ్, అబ్బాయ్ ల కార్యకర్తలు
-
తన్నుకున్న బాబాయ్, అబ్బాయ్ ల కార్యకర్తలు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సోమవారం నిర్వహించనున్న సమావేశానికి ముందు శివపాల్ సింగ్ యాదవ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ల సపోర్టర్ల మధ్య కొట్లాట జరిగింది. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆదివారం మంత్రి పదవి నుంచి శివపాల్ యాదవ్(అఖిలేశ్ యాదవ్ కు బాబాయ్ అవుతారు)ను ముఖ్యమంత్రి అఖిలేశ్ రెండో సారి తొలగించారు. దీంతో తమ్ముడు శివపాల్ యాదవ్ కు మద్దతు పలుకుతున్న తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేశ్ చాలెంజ్ విసిరినట్లయింది. అఖిలేశ్ చర్యకు బదులుగా అతనికి అత్యంత సన్నిహితుడైన రామ్ గోపాల్ యాదవ్ ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. రామ్ గోపాల్ బీజేపీతో చేతులు కలపడమే ఇందుకు కారణమని శివపాల్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీతో సమాజ్ వాదీ పార్టీని స్ధాపించి 25 ఏళ్లు పూర్తవుతుండటంతో సంబరాలపై చర్చించేందుకే సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ములాయం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరౌతానని ముఖ్యమంత్రి అఖిలేశ్ కూడా ప్రకటించారు. దీంతో శివపాల్, అఖిలేశ్ ల మధ్య వివాదాలు సమసిపోయేలా ములాయం ఏదైనా చేస్తారనే సమాచారం ఉంది. గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో మహాకూటమి నుంచి బయటకు రావడానికి కారణం రామ్ గోపాలేనని శివపాల్ ఆరోపించారు. కానీ ఇది ములాయం చేసిన తప్పుగా అందరూ చూశారని అన్నారు. శివపాల్ తాజా ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ మరో పార్టీతో జతకట్టే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చీలికపై మాట్లాడిన ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. తనకు పార్టీ నుంచి బయటకు వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ములాయం, శివపాల్ లు సూచించిన పేర్లను అఖిలేశ్ పక్కనబెట్టడంతో పార్టీలో ముసలం ప్రారంభమైన విషయం తెలిసిందే. -
అసలు వాళ్ల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది ?
-
సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయం
-
అఖిలేష్ సంచలన నిర్ణయం
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయాలతో ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సమాజ్ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్ ను అఖిలేష్ కేబినెట్ నుంచి తొలిగించారు. శివపాల్ తోపాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు పడింది. అమర్ సింగ్ అనుకూలురుగా ముద్రపడ్డ మరో నగులురు మంత్రులు, ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్నవారిపైనా వేటు తప్పదని అఖిలేష్ వర్గం ఆదివారం ప్రకటించింది. ఆదివారం నాటి పరిణామాలతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది. వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల నడుమ.. సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో ఆదివారం సీఎం అఖిలేష్ యాదవ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. సమావేశం ఆద్యంతం ఆవేశపూరితంగా మాట్లాడిన అఖిలేష్.. తనకు వ్యతిరేకంగా లేదా అమర్ సింగ్ కు అనుకూలంగా వ్యవహరించే ఏఒక్కరినీ విడిచిపెట్టబోనని హెచ్చరించినట్లు మోయిన్ పురి ఎమ్మెల్యే రాజు యాదవ్ మీడియాకు చెప్పారు. ములాయం సింగ్ కు ప్రియమైన తమ్ముడిగా, కేబినెట్ లో షాడో సీఎంగా కొనసాగుతున్న శివపాల్ యాదవ్ తోపాటు మంత్రులు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్ లు ఉద్వాసనకు గురైనవారిలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి అమర్ సింగ్, శివపాల్ లకు వీరవిధేయిలే కావడం గమనార్హం. సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయంతో శివపాల్ వర్గం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పార్టీ సుప్రిమో ములాయంను సంప్రదించకుండా అఖిలేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయిన శివపాల్.. పరుగున అన్ని ఇంటికి బయలుదేరారు. మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయంపై ములాయం స్పందన వెలువడాల్సిఉంది. -
పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు శివపాల్ యాదవ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని శుక్రవారం ప్రకటించారు. అన్న కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో వివాదం కారణంగా పార్టీలో చీలికల ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. లక్నోలో జరిగిన జిల్లా స్ధాయి నేతల సమావేశంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ వారంలో సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం సమావేశాలను ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. కాగా, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అఖిలేశ్ హాజరుకాలేదని ఎస్పీ అధికార ప్రతినిధి దీపక్ మిశ్రా తెలిపారు. తాను పార్టీ అధ్యక్షుడిగా పదవి చేపట్టడమే ముసలానికి కారణమైతే రాజీనామాకు సిద్ధమని శివపాల్ యాదవ్ సమావేశంలో చెప్పినట్లు మిశ్రా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే అఖిలేశే మరోసారి సీఎం అవుతారని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బెని ప్రసాద్ వర్మ సీఎం, పార్టీ అధ్యక్షుల మధ్య వివాదం పార్టీలో చీలికకు కారణం కాబోదనే నమ్మకం ఉందని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ తో తాను మాట్లాడనని చెప్పుకొచ్చిన వర్మ ఆయన కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కనిపించారని చెప్పారు. ములాయం, అఖిలేశ్ లతో తాను మాట్లాడుతానని తెలిపారు. దాదాపు 90మందికి పైగా పార్టీ లీడర్లతో శివపాల్ మూడు గంటలకు పైగా చర్చించారు. సమావేశానికి మీడియాను అనుమతించ లేదు. సమావేశానికి విచ్చేసిన నాయకుల ఫోన్ లను హాల్ లోకి అనుమతించలేదు. కాగా ఎస్పీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ శనివారం సమావేశం కానుంది. ఈ నెల 24న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ములాయం భేటీ కానున్నారు. -
అబ్బాయ్కు బాబాయ్ మద్దతు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఊహించని మద్దతు లభించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ పేరును తాను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారంటూ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాయం ప్రకటనతో ఆయన కుమారుడు అఖిలేష్ షాకయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనతో విబేధిస్తున్న బాబాయ్ శివపాల్ అండగా నిలబడటం అఖిలేష్‌కు ఊరట కలిగించే విషయం. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు లేవని, అందరూ ఐకమత్యంగా ఉన్నామని శివపాల్ చెప్పారు. -
అబ్బాయికి చుక్కలు చూపిస్తున్న బాబాయి!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ తాజాగా తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గతంలో టికెట్ ఖరారైన 17మందికి షాకిచ్చి.. వారి స్థానంలో కొత్తవారి పేర్లను వెల్లడించింది. ఈ నిర్ణయాలతో సమాజ్‌వాదీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ ఆధిపత్యానికి తెరలేసినట్టు అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో తనదైన ముద్ర ఉండేలా.. అన్నింటా తన పట్టు నిలుపుకొనేలా శివ్‌పాల్ యాదవ్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి బాబాయి శివ్‌పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య విభేదాలు సద్దుమణిగి.. అంతా సర్దుకున్నట్టు పైకి కనిపిస్తున్నా.. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు చూసి విస్తుపోయిన అఖిలేశ్.. పైకి మాత్రం మార్పుల గురించి తనకు తెలియదని చెప్పారు. టిక్లెట్ల పంపిణీలో మీ పాత్ర ఏమిటి అని అడిగితే.. 'అన్ని హక్కులు వదిలేసుకున్నా... కొందరు వ్యక్తులకు వాటిని అప్పగించా' అంటూ కొంత నిర్వేదంగా బదులిచ్చారు. పార్టీ వ్యవహారాలపై నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 'కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం' ఉందంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసంతృప్తిని చాటుతున్నాయి. ఎస్పీ అధినేత ములాయం తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఇటీవల తలెత్తిన అంతర్గత పోరు సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ను తొలగించి.. ఆ స్థానంలో శివ్‌పాల్‌ను ములాయం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోయిన అఖిలేశ్ తన కేబినెట్లో మంత్రి అయిన శివ్‌పాల్ యాదవ్ శాఖలకు కోత పెట్టారు. దీంతో శివ్‌పాల్ యాదవ్ రాజీనామా చేయడం.. ములాయం జోక్యం చేసుకొని ఆయన శాఖలు తిరిగి ఆయనకు కేటాయించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా సోదరుడికి అండగా నిలువడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ సన్నిహితులను అభ్యర్థుల జాబితా నుంచి తొలగించి శివ్‌పాల్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మాజీ మంత్రి అమర్మణి త్రిపాఠీ కొడుకు, నేరచరిత్ర ఉన్న అమన్మణికి మహారాజ్ గంజ్ జిల్లా నౌతన్వా స్థానం టికెట్ ఇవ్వడం, అఖిలేశ్‌కు సన్నిహితుడైన యువ నాయకుడు అతుల్ ప్రధాన్‌కు ఇచ్చిన టికెట్ వేరొకరికి ప్రకటించడం సీఎంకు ఎదురుదెబ్బలని భావిస్తున్నారు. అఖిలేశ్ ప్రభుత్వమే భార్య మృతికేసులో అమన్మణిపై సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది. అయితే, తనకు సన్నిహితుడైన అమర్మణి కొడుకు అమన్మణికి టికెట్ ఇచ్చితీరాలని శివ్‌పాల్ యాదవ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ల కేటాయింపు అంశంతో ఎస్పీపై అఖిలేశ్ పట్టు జారిపోతుండగా.. అదే సమయంలో శివ్‌పాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 229 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో ఈ విషయంలో అబ్బాయి-బాబాయి ఎలాంటి విభేదాలు భగ్గుమంటాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
అబ్బాయికి బాబాయ్ ఝలక్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలు ఆయన జోక్యంతో సమసిపోయినట్టు కనిపించినా అంతర్గత పోరు కొనసాగుతోంది. ములాయం కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఆయన సోదరుడు, సీనియర్ కేబినెట్ మంత్రి, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్‌ల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం శివపాల్ యాదవ్ తొమ్మిదిమంది ఎస్పీ అభ్యర్థులను ప్రకటించారు. మరో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమర్మణి త్రిపాఠి కుమారుడికి టికెట్ ఇచ్చారు. కాగా అఖిలేష్‌కు తెలియకుండానే ఈ జాబితాను విడుదల చేశారు. దీనిపై అఖిలేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, భవిష్యత్‌లో చాలా మంది అభ్యర్థులను మారుస్తామని చెప్పారు. కాగా ఈ రోజు ఉదయం ములాయం ఇంట్లో జరిగిన సమావేశంలో శివపాల్ యాదవ్, అఖిలేష్ పాల్గొన్నారు. అయినా అఖిలేష్‌కు తెలియకుండా శివపాల్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. -
అబ్బాయికి బాబాయ్ దిమ్మదిరిగే షాక్!
-
శివపాల్.. మా నాన్నను అవమానిస్తున్నారు!
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో మొదలైన చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు. పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివపాల్ యాదవ్ తమ కుటుంబంలో ఉన్న వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ కుమారుడు, అక్షయ్ యాదవ్ దీనిపై నోరు విప్పారు. శివపాల్ప తన తండ్రిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాంగోపాల్ యాదవ్ తమ్ముడి కొడుకైన అరవింద్ ప్రతాప్ యాదవ్‌ను, మరోవ్యక్తిని భూ ఆక్రమణల కేసులో ఆరోపణలున్నాయంటూ పార్టీ నుంచి తీసేశారు. దాంతో అక్షయ్ యాదవ్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. అరవింద్ యాదవ్ తమ కుటుంబ సభ్యుడని, అలాంటి వ్యక్తి నేతాజీ (ములాయం)కు వ్యతిరేకంగా మాట్లాడతాడని కలలో కూడా అనుకోలేమని అన్నారు. శివపాల్ ఇంటి వద్ద తన తండ్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా ఎవరున్నా వాళ్లందరినీ శివపాల్ యాదవ్ పార్టీ నుంచి తీసేస్తున్నారని ఆరోపించారు. దాంతో ములాయం కుటుంబంలో చిచ్చు మరోసారి బయటపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితులైన ఏడుగురిపై కూడా శివపాల్ వేటు వేసిన విషయం తెలిసిందే. -
సమాజ్‌వాదీలో మరో చిచ్చు
అఖిలేశ్ సన్నిహితులైన ఎమ్మెల్సీల తొలగింపు లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో మరో వివాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన శివ్‌పాల్ యాదవ్.. సీఎం అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా ఏడుగురు యువ నేతలను సోమవారం పార్టీ నుంచి తొలగించారు. పార్టీ అధినేత ములాయంను విమర్శించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, క్రమశిక్షణ తప్పినందుకు ఎమ్మెల్సీలు సునీల్సజన్, ఆనంద్ బదౌరియా, సంజయ్‌లను పార్టీ నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపింది. వీరితో పాటు ఎస్పీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర చీఫ్ ఈబాద్, ఎస్పీ యువజన సభ రాష్ట్ర చీఫ్ బ్రిజేష్ యాదవ్, ఎస్పీ యూత్ బ్రిగేడ్ జాతీయ అధ్యక్షుడు గౌరవ్, ఛాత్ర సభ రాష్ట్ర అధ్యక్షుడు దిగ్విజయ్ దేవ్లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. కాగా తొలగింపు నిర్ణయం తర్వాత శివ్‌పాల్ .. అఖిలేశ్ ఇంటికెళ్లి చర్చించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీలో సంస్కరణలు చేపడుతున్న శివ్‌పాల్.. భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ మేనల్లుడు ఎమ్మెల్సీ అరవింద్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. -
అబ్బాయికి బాబాయ్ దిమ్మదిరిగే షాక్!
అబ్బాయి అఖిలేశ్ యాదవ్- బాబాయ్ శివ్ పాల్ యాదవ్ మధ్య సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత ఆధిపత్య పోరు సమసిపోయినట్టు పైకి కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం కుంపటి ఇంకా మండుతున్నట్టే కనిపిస్తోంది. ఎస్పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగడంతో బలవంతంగా అఖిలేశ్-శివ్ పాల్ యాదవ్ మధ్య రాజీ కుదిరింది. ఈ వివాదంలో ములాయం తనయుడిని మందలించి.. తమ్ముడు శివ్ పాల్ కు మద్దతునివ్వడంతో ఆయన వర్గం పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎస్పీ కొత్త అధ్యక్షుడైన శివ్ పాల్ యాదవ్ ముగ్గురు ఎమ్మెల్సీలు సహా ఏడుగురు నేతలపై వేటు వేశారు. వారిని పార్టీ నుంచి తొలగించారు. ఈ ఏడుగురు సీఎం అఖిలేశ్ కు విధేయులు కావడం గమనార్హం. పార్టీ నుంచి బహిష్కృతులైన ఏడుగురిలో సునీల్ సింగ్ యాదవ్ (ఎమ్మెల్సీ), ఆనంద్ బహదూరియా (ఎమ్మెల్సీ), సంజయ్ లాథర్ (ఎమ్మెల్సీ), ఎండీ ఎబాద్ (రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు), బ్రిజేష్ యాదవ్ (సమాజ్‌వాదీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడు), గౌరవ్ దూబే (పార్టీ యూత్ బ్రిగేడ్ జాతీయ అధ్యక్షుడు), దిగ్విజయ్ సింగ్ దేవ్ (ఛత్రా సభ రాష్ట్ర అధ్యక్షుడు) ఉన్నారు. ఇప్పటికే భూకబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోపాల్ యాదవ్ మేనల్లుడు, ఎమ్మెల్సీ అరవింద్ ప్రతాప్ యాదవ్ పై శివ్ పాల్ యాదవ్ వేటువేశారు. పార్టీ సీనియర్ నేత, ములాయం కజిన్ సోదరుడైన రాంగోపాల్ 'బాబాయ్-అబ్బాయి పోరు'లో అఖిలేశ్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే సీఎం అఖిలేశ్ వర్గాన్ని బలహీనపరిచే రీతిలో శివ్ పాల్ యాదవ్ చర్యలు ఉండటం గమనార్హం. అఖిలేశ్ వద్ద ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని ములాయం తాజాగా శివ్ పాల్ కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా అఖిలేశ్ బాబాయి మంత్రిత్వశాఖలకు కోత పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య మొదలైన రగడ చివరకు ములాయం జోక్యంతో ముగిసిన సంగతి తెలిసిందే. -
యాదవ్ కుటుంబంలో మళ్లీ చిచ్చు!
సమాజ్‌వాదీ పార్టీలోను, ఆ పార్టీ పెద్దలు యాదవ్ కుటుంబంలోను మళ్లీ మరో చిచ్చు మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివపాల్ యాదవ్.. ఆ వెంటనే తమ మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువైన ఓ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడన్న ఆరో్పణలతో అతడిని పార్టీ నుంచి తప్పించడంతో కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాంగోపాల్ యాదవ్ సమీప బంధువైన అరవింద్ ప్రతాప్ యాదవ్ అనే ఎమ్మెల్సీని, ఆయనతో పాటు ఇటావా గ్రామ మాజీ సర్పంచ్ అఖిలేష్ కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లిద్దరి మీద భూ ఆక్రమణలతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో అతడిని బహిష్కరించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ఎస్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వెళ్లే ముందు విమానాశ్రయంలో తన అన్న ములాయం సింగ్ యాదవ్‌ను శివపాల్ కలిశారు. బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరూ రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువులే కావడంతో యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో చిచ్చు మొదలయ్యేలా ఉంది. శివపాల్ - అఖిలేష్ మధ్య పోరు జరిగినప్పుడు ములాయం సోదరుల్లో ఒకరైన రాంగోపాల్ యాదవ్.. తన మద్దతును అఖిలేష్‌కే తెలిపారు. దాంతో ఇప్పుడు అఖిలేష్ వర్గం బలాన్ని క్రమంగా తగ్గించే చర్యలను శివపాల్ యాదవ్ మొదలుపెట్టారని అంటున్నారు. ఇంతకుముందు అఖిలేష్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేసినప్పుడు కూడా.. ''మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే, ముందు పార్టీకి అనుకూలంగా, తర్వాత నేతాజీకి అనుకూలంగా, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అనుకూలంగా ఇవ్వండి. అంతే తప్ప పార్టీలో గ్రూపిజానికి చోటులేదు'' అని హెచ్చరించారు. -
'ఆ సీఎంకు చిన్నప్పుడు అన్నీ ఆయనే'
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట. అఖిలేశ్‌కు అసలైన గార్డియన్ కూడా ఆయనేనంట. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీలో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు ప్రధాన కారణం అఖిలేశ్, పినతండ్రి శివపాల్ యాదవ్ లే కారణం. అది కూడా రెండుగా చీలిపోతారా అన్నంతలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో వారి మధ్య వివాదం సర్దుమణిగింది. అయితే, అఖిలేశ్, శివపాల్ మధ్య ఉన్నది చాలా గాఢమైన సంబంధం అని తెలిసింది. 1980, 90 దశకాల్లో ములాయం తన రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా అఖిలేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ మొత్తం శివపాల్ చేతులమీదుగానే జరిగిందట. హాస్టల్లో చేర్పించడం, అవసరాలు చూడటం, విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వడం వగైరా కార్యక్రమాలు మొత్తం శివపాల్ చూసుకున్నారట. అంతేకాదు, అఖిలేశ్ భార్య డింపుల్ కు శివపాల్ భార్య సరళకు చాలా అన్యోన్య సంబంధం ఉందంట. దీంతో వారిమధ్య ఎంతో గాఢమైన అనుభందం ఉందని, ఎలాంటి విభేదాలు వచ్చిన వారిమధ్య అవి నిలబడలేవని చెబుతున్నారు. అఖిలేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే సమయం వరకు కూడా అటు తండ్రికిగానీ, పినతండ్రికి కానీ ఏనాడు 'కాదు, కుదరదు' అని చెప్పలేదట. అఖిలేశ్ కూడా వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన తర్వాత అవి కేవలం రాజకీయాల్లో మాత్రమేనని, తమ కుటుంబంలో కాదని ప్రకటించాడంటే నిజంగానే వారి బంధం విడదీయరానిదే అని అనుకోవాల్సిందే. -
డ్రామాలాడి తమ్ముడిని బలిపశువును చేశారు
శహరాన్‌పూర్: సమాజ్‌వాది పార్టీ కుటుంబ కుంపట్లో అగ్గి చల్లారేలా లేదు. ఎలాగో సర్దుమణిగిందనుకున్న వ్యవహారాన్ని సొంతపార్టీ నేతలే కాకుండా ప్రతి పక్ష పార్టీలు సైతం రెచ్చగొట్టి మరోసారి వారి కుటుంబంలో అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పగ్గాలు అఖిలేశ్ కే ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసి శివపాల్ కు ఆగ్రహం తెప్పించగా తాజాగా మాయావతి వ్యాఖ్యలు కూడా ఆయనను మరోసారి ఆలోచనలో దించేలా ఉన్నాయి. ఆదివారం పార్టీ నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో సమాజ్ వాది పార్టీపై బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్పీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతికి ఇచ్చి ఆయనను బలిపశువును చేశారని ఆరోపించారు. కావాలనే ఎస్పీ అధినేత ములాయం ఈ డ్రామాలు ఆడారని, తన కుమారుడి ప్రతిష్టను కాపాడుకునేందుకు సోదరుడు శివపాల్ ను బలిపశువును చేశారని అన్నారు. 2017 ఎన్నికల్లో ఎలాగో ఎస్పీ ఓడిపోతుందని ముందే ఊహించిన ములాయం తెలివిగా పార్టీ పగ్గాలు శివపాల్ చేతిలో పెట్టాడని ఘాటుగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పీ హయాంలో శాంతి భద్రతల పరిస్థితులు చాలా దారుణంగా దిగజారిపోయాయని, ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె అన్నారు. -
ఎస్పీలో సమసిన సంక్షోభం
శివ్‌పాల్‌కు మద్దతుంటుందన్న అఖిలేశ్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్-అబ్బాయ్ మధ్య బలవంతంగా సంధి కుదిరినట్లు కనబడుతోంది. ఎన్నికలకు ముందు విభేదాలన్నీ పక్కనపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం వరకు పరస్పర బహిరంగ విమర్శలు చేసుకోగా.. శనివారం అఖిలేశ్ మాట్లాడుతూ అంతా సర్దుకుంటుందన్న సంకేతాలిచ్చారు. బాబాయ్ శివ్‌పాల్‌కు పూర్తి మద్దతుంటుందన్నారు. యూపీ పార్టీ అధ్యక్షుడిగా శివ్‌పాల్ నియామకంతోనే వీరిద్దరి మధ్య గొడవ రోడ్డునపడడం తెలిసిందే. పార్టీ అధినేత ములాయం తీసుకున్న ఈ నిర్ణయం తనను బాధపెట్టిందని ఇటీవల చెప్పిన అఖిలేశ్.. శనివారం ‘యూపీ పార్టీ అధ్యక్షుడిని ఆయనింట్లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అభ్యర్థుల ఎంపికలో తన పాత్ర కీలకం కానుందని అఖిలేశ్ తెలిపారు. ‘వచ్చే ఎన్నికలు నాకు పరీక్ష. నేనో క్రీడాకారుడిని. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడాను. సెల్ఫ్ గోల్ చేసుకోను’ అని అన్నారు. అంతకుముందు పలువురు పార్టీ కార్యకర్తలు ‘అఖిలేశ్‌ను అధ్యక్షుడిని చేయాల’నే డిమాండ్‌తో లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. వారిపై ములాయం సింగ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. నేరుగా కార్యకర్తల వద్దకు వెళ్లి ‘రెండ్రోజులుగా నెలకొన్న పరిస్థితి సద్దుమణిగించేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఇలాంటి తమాషాలు ఇకపై కుదరవు’ అని అన్నారు. యూపీలో హంగ్! అతి పెద్ద పార్టీగా బీఎస్పీ ?: సర్వే న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాక త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలున్నాయని, విపక్ష బీఎస్పీ అతిపెద్ద పార్టీగా నిలిచే సూచనలున్నాయని ఓ సర్వే పేర్కొంది. పార్లమెంటేరియన్ పత్రిక సర్వే ప్రకారం.. ఎస్పీ కోల్పోయే 150 సీట్లను బీజేపీ, బీఎస్పీ సమానంగా పంచుకుంటాయి. బీఎస్పీకి అదనంగా 89 సీట్లు దక్కుతాయి. బీజేపీకి ప్రస్తుతమున్న 47 సీట్లకు 88 జమవుతాయి. కాంగ్రెస్‌కున్న 28 సీట్లలో 13 తగ్గుతాయి. 39% మంది అఖిలేశ్ పనితీరు బాగుందన్నారు. 28% మంది మాయావతి సీఎం కావాలన్నారు. -
బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ కుటుంబంలో ఏర్పడిన వివాదం టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయింది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.. యూపీ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌గా నియమితులైన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్‌ను అభినందించారు. అఖిలేష్ స్వయంగా శివపాల్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో విబేధాల్లేవని, తామందరం ఒక్కటేనని చెప్పారు. రాజకీయాలంటే ఆటలు కాదని, సీరియస్ విషయమని అన్నారు. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై అఖిలేష్ వేటువేయడంతో అబ్బాయ్, బాబాయ్ మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ములయాం జోక్యం చేసుకుని పలుమార్లు కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్‌తో చర్చించి సమస్యను పరిష్కరించారు. మంత్రి పదవికి శివపాల్ చేసిన రాజీనామాను అఖిలేష్ తిరస్కరించడంతో పాటు ఆయన్నుంచి వెనక్కు తీసుకున్న శాఖలను మళ్లీ అప్పగిస్తున్నట్ట ప్రకటించారు. అలాగే ములయాంకు సన్నిహితుడైన ప్రజాపతిని మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నట్టు తెలిపారు. -
'అఖిలేశన్నే నడిపిస్తాడు.. ఆయనకే ఇవ్వాలి'
లక్నో: సమస్య మొత్తం సర్దుమణిగిందని, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ విజయానికి కృషిచేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశించగా శనివారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. నెత్తిన ఎర్ర టోపీలు ధరించి చేతిలో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ ఉన్న పోస్టర్లను పట్టుకొని నినాదాలు చేస్తూ బారులు తీరారు. 'అఖిలేశ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలి, అఖిలేశన్న పార్టీని నడిపించగల సమర్థుడు' అంటూ గట్టిగా అరుస్తూ పార్టీ కార్యాలయం వద్ద సందడి చేశారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన నాలుగు ఇతర సంస్థలు ఈ డిమాండ్ తో పార్టీ అధినేత ములాయం సింగ్ కు లేఖ కూడా రాశారు. అందులో తాము అఖిలేశ్ నాయకత్వాన్ని తప్ప ఏ ఒక్కరి నాయకత్వాన్ని అంగీకరించబోమని కుండబద్ధలు కొట్టారు. అఖిలేశ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం యువత జీర్ణించుకోలేకపోతుందని, అవసరం అయితే, ఆయన కోసం తమను తాము దహించుకొని ప్రాణత్యాగం చేసేందుకు యువత సిద్ధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తూ ఆ పార్టీ తరుపున ప్రకటన వెలువడింది. -
'నేను బతికుండగా అలా జరగనివ్వను'
లక్నో: తాను బతికున్నంత వరకు పార్టీని ముక్కలు కానివ్వనని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ అతిపెద్ద కుటుంబం అని కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, అయితే వాటిని ఒక్కొక్కటిగా తాము పరిష్కరించుకుంటున్నామని ఆయన చెప్పారు. తన నిర్ణయాలు అటు సోదరుడు శివ్పాల్గానీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గానీ తిరస్కరించబోరని అన్నారు. తాను బతికున్నవరక పార్టీని ముక్కలు కానివ్వనని ములాయం చెప్పగానే అక్కడ ఉన్నవారంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు. పార్టీలో, కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టి పారేశారు. ఎవరూ ఎలాంటి తప్పు చేయలేదని, తాను మాత్రమే పెద్ద తప్పు చేశానని అన్నారు. తన సోదరుడు శివ్ పాల్ పార్టీ కోసం ఎంతో పనిచేశారని, కష్టపడి పని చేసే స్వభావం తనదని, కానీ ఏ ఒక్కరోజు తనకు ఇది కావాలని అడగడంగానీ, తాను తీసుకున్న నిర్ణయాలు కాదని చెప్పడంగానీ చేయలేదని తెలిపారు. అఖిలేశ్ కూడా అలాగే ఉండేవాడని, మరి సమస్య ఎక్కడ వచ్చిందో క్షేత్రస్థాయిలో ఆలోచించి గుర్తిస్తామని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే పార్టీలోనే చర్చించుకోవాలని, వచ్చేది ఎన్నికల సమయం అయినందున ప్రతి ఒక్కరు అప్రమత్తమై మరోసారి సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయిందని, ప్రతి ఒక్కరు పార్టీ ఉన్నతికి కృషి చేయాలని అన్నారు. సీఎం అఖిలేశ్, ములాయం సోదరుడు శివ్ పాల్ మధ్య కొద్ది రోజులుగా తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. -
బాబాయ్-అబ్బాయ్ రాజీ
ములాయం జోక్యంతో ఎస్పీలో ముగిసిన సంక్షోభం శివపాల్‌కు పాత శాఖలు కేబినెట్లోకి మళ్లీ ప్రజాపతి లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు గతంలోని మంత్రిత్వ శాఖల్ని తిరిగి కేటాయించామని, కేబినెట్ నుంచి తప్పించిన గాయత్రి ప్రజాపతిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నామని సీఎం అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ట్వీట్ చేశారు. బాబాయ్-అబ్బాయ్ మధ్య ఆధిపత్య పోరుతో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను చక్కదిద్దేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం రంగంలోకి దిగారు. తను ఉన్నంతవరకూ ఎలాంటి చీలికలు ఉండకూడదన్నారు. అఖిలేశ్ తన మాటకు అడ్డుచెప్పడని, గనుల శాఖ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని తిరిగి యూపీ కేబినెట్లోకి తీసుకుంటామంటూ అంతకముందు పార్టీ శ్రేణులకు చెప్పారు. ‘మాకు పెద్ద కుటుంబం ఉంది. అభిప్రాయభేదాలు వస్తుంటాయి. శివ్‌పాల్, అఖిలేశ్ మధ్య ఏ గొడవా లేదు’ అని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయమని, కలిసికట్టుగా పనిచేసేందుకు అందరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తాను బాధపడ్డానని అఖిలేశ్ పేర్కొన్నారు. లక్నోలో ములాయంతో తమ్ముడు శివ్‌పాల్ 15 నిమిషాలు భేటీ కాగా, వెంటనే అఖిలేశ్ తండ్రితో చర్చించారు. -
శివపాల్ శాఖలు మళ్లీ వెనక్కి!
ఉత్తరప్రదేశ్ సర్కారులోను, యాదవ్ కుటుంబంలోను నెలకొన్న సంక్షోభానికి 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్ నాలుగు పాయింట్ల ఫార్ములాతో ఓ పరిష్కారం కనుగొన్నారు. ప్రధానంగా.. తీవ్రంగా మనస్తాపానికి గురై, మంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తమ్ముడు శివపాల్ యాదవ్ ను అన్ని రకాలుగా బుజ్జగించడం ఇందులో ప్రధానంశంగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఆయన నుంచి తీసేసిన మంత్రిత్వ శాఖలను మళ్లీ ఇవ్వడం సహా అన్నీ శివపాల్ మెప్పుకోసమే చేసినట్లు కనిపిస్తున్నాయి. ములాయం ప్రతిపాదించిన ఫార్ములా ప్రకారం శివపాల్ యాదవ్‌కు ఆయన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వడం, ఇంతకుముందు అవినీతి ఆరోపణలతో తొలగించిన గాయత్రీ ప్రజాపతిని వేరే శాఖ అప్పగించి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రధానమైనవి. ఇవి కాక.. రాబోయే ఎన్నికల నాటికి కూడా శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారు. కానీ టికెట్ల కేటాయింపులో మాత్రం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. దాంతోపాటు.. ప్రధానంగా 'బయటి' వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలన్నది సైతం ఇందులో ప్రధానాంశంగా కనిపిస్తోంది. పార్టీలో గొడవలన్నింటికీ ఇటీవలే మళ్లీ పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు అమర్ సింగ్ ప్రధాన కారణం అన్నది ములాయం సింగ్ భావన. అందుకే త్వరలోనే అమర్ సింగ్ మీద సైతం చర్యలు తప్పకపోవచ్చని అంటున్నారు. అయితే పైకి మాత్రం అమర్ సహా ఎవరి పేరునూ ప్రకటించలేదు. -
'బాబాయ్- అబ్బాయ్' వివాదం ముదిరింది!
-
నేను ఉన్నంత వరకు చిచ్చు పెట్టలేరు: ములాయం
తమది పెద్ద కుటుంబం కాబట్టి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు గానీ, తాను ఉన్నంత కాలం పార్టీలో చీలిక రాదని, అప్పటివరకు కుటుంబంలో ఎవరూ చిచ్చు పెట్టలేరని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఆయన తన తమ్ముడు శివపాల్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. అఖిలేష్ తన మాట ఎట్టి పరిస్థితుల్లో కాదనడని, ఆ నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ఒక కుటుంబమని, ఇంత పెద్ద కుటుంబంలో అభిప్రాయ భేదాలు మామూలేనని తెలిపారు. మామూలుగా తండ్రీ కొడుకుల మధ్య కూడా తేడాలు వస్తాయని అన్నారు. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవని, మీడియాతో మాట్లాడిన తమవాళ్లు చేసిన పొరపాటు వల్లే అలా జరిగిందని తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి అంతా కలిసి పనిచేయాలని.. అఖిలేష్, రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్.. ఈ ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అఖిలేష్ వెళ్లి శివపాల్ యాదవ్‌ను ఆయన ఇంట్లో కలుస్తారన్నారు. అయితే.. ములాయం ఇంట్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, తనకు రెండు విధులున్నాయని, ఒకటి ముఖ్యమంత్రిగాను.. మరొకటి ఒక కొడుకు గాను ఉండాల్సి ఉంటుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడి మాటలను తాను గౌరవిస్తానని, తన తండ్రిని సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అంతా చేస్తానని ఆయన చెప్పారు. మంత్రి పదవికి శివపాల్ యాదవ్ చేసిన రాజీనామాను ఆయన తిరస్కరించారు. -
ఫ్యామిలీ మొత్తం రాజీనామా.. కానీ!
సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అది ఓ కొలిక్కి రాలేదు. పైకి అంతా సమసిపోయినట్లే కనిపిస్తున్నా, ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. పార్టీ పదవులు, ఇతర పదవులకు శివపాల్ యాదవ్, ఆయన భార్య, కుమారుడు అందరూ రాజీనామాలు చేశారు. కానీ వాటిని ఇంకా ఎవరూ ఆమోదించలేదు. మరోవైపు తాజాగా పార్టీ కార్యాలయం నుంచి అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మొత్తం ఒక కుటుంబం లాంటిదని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. మంత్రిపదవికి శివపాల్ చేసిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అఖిలేష్ ప్రకటించినా, శివపాల్ మాత్రం ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ తన ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అఖిలేష్ చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన శివపాల్ వెళ్లిపోతానని చెప్పినా, పార్టీ.. ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన పాత్ర ఉండాల్సిందేనని పెద్దన్న ములాయం సింగ్ యాదవ్ పట్టుబట్టారు. పార్టీలో గట్టిపట్టున్న శివపాల్ లాంటి నాయకులు వెళ్లిపోతే.. అది చీలికకు దారితీస్తుందన్నది పెద్దాయన భయంలా కనిపిస్తోంది. నిమిషానికో రకంగా మారుతున్న యూపీ రాజకీయాలు ఇక మీదట ఏమవుతాయో చూడాల్సి ఉంది. -
చీలిక దిశగా సైకిల్ పార్టీ?
చక్రం తిప్పుతున్న చిన్నాన్న సీఎం పీకేసిన మంత్రిని కలిసిన శివపాల్ అనుచరులంతా పార్టీ ఆఫీసుకు వెళ్లాలని సూచన లక్నో: అంతా అయిపోయింది.. సమాజ్‌వాదీ పార్టీలో చీలికకు అంతా సిద్ధమైంది. రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ క్రమంగా చక్రం తిప్పుతున్నారు. గురువారం రాత్రి తన మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన శివపాల్... శుక్రవారం ఉదయం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయాలని చెబుతూనే, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కార్యాలయానికి వస్తారని, మీరంతా వెళ్లి ఆయనను కలవాలని చెప్పారు. దానికి తోడు.. ఇటీవలే సీఎం అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన ఇద్దరు మంత్రులలో ఒకరైన గాయత్రీ ప్రజాపతిని కూడా వెళ్లి కలిశారు. అవినీతిపరులన్న కారణంగా మంత్రివర్గం నుంచి ఇద్దరిని తప్పించడమే అఖిలేష్ - శివపాల్ మధ్య విభేదాలకు ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింఘాల్‌ను కూడా అఖిలేష్ ఇంటికి పంపేశారు. తన తండ్రి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్తోను, సీఎం అఖిలేష్తోను ఫోన్లో మాట్లాడుతున్నారని శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ చెప్పారు. శివపాల్ గౌరవ మర్యాదలను కాపాడాలని, ఆయన నుంచి తప్పించిన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వాలని, సమాజ్‌వాదీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇవ్వాలని ఆయన మద్దతుదారులు శివపాల్ ఇంటి ముందు నినాదాలు చేశారు. వాళ్లు రాత్రంతా కూడా ఆయన ఇంటి ముందే ఉండిపోయారు. తాము నిద్రపోయేది లేదు.. వాళ్లను నిద్రపోనిచ్చేది లేదంటూ నినదించారు. మొదట్లో కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించిన శివపాల్ యాదవ్‌కు.. ముఖ్యమైన శాఖలను ఆయన నుంచి తప్పించడంతో ఎక్కడలేని కోపం వచ్చింది. అది చాలదన్నట్లు తనవాళ్లు అనుకున్న ఇద్దరు మంత్రులను, సీఎస్‌ను కూడా పంపేయడంతో ఇక ఆయన తాడోపేడో తేల్చుకోవాలన్న దశకు వచ్చేశారు. అయితే, మంత్రిపదవికి ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు. మరో వైపు పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా విషయం ఏంటన్నది ఇంకా తెలియలేదు. -
‘సైకిల్’ దిగిన శివ్‌పాల్
-
‘సైకిల్’ దిగిన శివ్‌పాల్
♦ మంత్రి, పార్టీ పదవులకు రాజీనామా ♦ శివ్‌పాల్ భార్య, కుమారుడు కూడా.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి.. పార్టీ చీఫ్ ములాయం సోదరుడు, మంత్రి శివ్‌పాల్ యాదవ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ములాయంతో అత్యవసర భేటీ తర్వాత వివాదం సద్దుమణుగుతుందన్న సమయంలో శివ్‌పాల్ రాజీనామా ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శివ్‌పాల్ భార్య సరళ (ఎటావా జిల్లా సహకార బ్యాంకు చైర్పర్సన్), కుమారుడు ఆదిత్య (ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్) కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాను ములాయం, అఖిలేశ్ తిరస్కరించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు అధికార సమాజ్‌వాదీ పార్టీ(సైకిల్ గుర్తు)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనబడుతోంది. అఖిలేశ్ ప్రభుత్వ పాలనను, శివ్‌పాల్ యూపీలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారనుకున్న తరుణంలో తాజా పరిణామాలు ములాయం సింగ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫలించని మధ్యవర్తిత్వం బాబాయ్- అబ్బాయ్ మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు శుక్రవారం ములాయం లక్నోకు రావాల్సి ఉంది. అయితే.. శివ్‌పాల్ తీరుపై అనుమానంతో గురువారం సాయంత్రమే ఢిల్లీ నుంచి ములాయం హుటాహుటిన లక్నోకు చేరుకున్నారు. శివ్‌పాల్, కుమారుడు అఖిలేశ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అఖిలేశ్‌ను సీఎం అధికార నివాసంలో కలిసిన శివ్‌పాల్ కాసేపు వ్యక్తిగతంగా చర్చించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. కాసేపటికే శివ్‌పాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే మీడియాతో మాట్లాడుతూ.. ‘అందరినీ కలుపుకుని పోతేనే పార్టీ నిర్మాణం సాధ్యమవుతుంది’ అని తెలిపారు. అంతా ‘ఔట్ సైడర్’ వల్లే.. సమాజ్‌వాదీ పార్టీలో కానీ, యాదవ కుటుంబంలో కానీ భేదాభిప్రాయాలు లేవని.. కేవలం బయటివాళ్ల కారణంగానే.. చిన్న అపార్థాల వల్లే కీలకనేతల మధ్య సమాచార లోపం ఏర్పడిందని ఎస్పీ జాతీయ కార్యదర్శి, ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. ఈ తతంగం జరగటానికి ముందే అఖిలేశ్‌తో సమావేశమైన రాంగోపాల్.. బయటకొచ్చాక.. అఖిలేశ్‌ను పార్టీ యూపీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన అధిష్టానం చాలా పెద్ద పొరపాటు చేసిందన్నారు. పార్టీ కోరితే అఖిలేశ్ రాజీనామా చేసేవారన్నారు. ‘పార్టీలో, కుటుంబంలో సమస్య లేదు. బయటి వారి వల్లే (అమర్‌సింగ్ పేరు తీసుకోకుండా) సమస్యలొస్తున్నాయి. నేతాజీ (ములాయం)తో అఖిలేశ్, శివ్‌పాల్‌తో మాట్లాడితే సమస్య సమసిపోతుంది’ అని తెలిపారు. అటు రాజ్యసభ ఎంపీ నరేశ్ అగర్వాల్, సీనియర్ కేబినెట్ మంత్రి ఆజంఖాన్ కూడా అఖిలేశ్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికలకు కూడా అఖిలేశ్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. -
'బాబాయ్- అబ్బాయ్' వివాదం ముదిరింది!
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ తన పదవులకు రాజీనామా చేశారు. సోదరుడు ములాయంతో గురువారం రాత్రి భేటీ అయిన తర్వాత తన రాజీనామా లేఖను సీఎం అఖిలేష్ యాదవ్ కు పంపినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎస్పీలో 'బాబాయ్- అబ్బాయ్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కుర్చీలాటలో అఖిలేశ్‌కే ములాయం మద్దతిస్తుండటం యాదవ్ కుటుంబంలో విభేదాలకు కారణమయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్‌ను తప్పించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఆ వెంటనే శివపాల్ మంత్రిత్వ శాఖలను తగ్గిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం మరింత ముదరడంతో ములాయం జోక్యం తప్పనిసరి అయింది. తమ మధ్య వ్యక్తిగత వివాదాలు లేవని కేవలం పార్టీ పరంగా మాత్రమే కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నట్లు శివపాల్ తెలిపారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ, తన పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగదని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన శివపాల్ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా శివపాల్ రాజీనామా చేశారని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. రెండు రోజుల కిందట సమాజ్‌వాదీ పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ కు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
నా పదవులు ఎందుకు పీకేశారో తెలీదు
తన మంత్రిత్వ శాఖల్లో కొన్నింటిని ముఖ్యమంత్రి ఎందుకు తీసేశారో తెలియదని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అన్నారు. దానికి సంబంధించిన నిర్ణయాలను నేతాజీతో సంప్రదించి ముఖ్యమంత్రి తీసుకుంటారని చెప్పారు. స్వయానా అన్న కొడుకైన అఖిలేష్ యాదవ్‌తో విభేదాల అనంతరం అన్న ములాయం సింగ్ యాదవ్ వద్ద పంచాయతీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధించి రావడం ఖాయమని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. నేతాజీ ఆదేశాలను అంతా పాటించాల్సిందేనని.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కాబట్టి తన పని తాను చేస్తానని అన్నారు. ఆయన నిర్ణయాలను ఏ ఒక్కరూ సవాలు చేయడానికి వీల్లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని ప్రశ్నించగా.. నేతాజీ (ములాయం) ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. పదవుల విషయంలో సీఎంతో కూడా ఎలాంటి విభేదాలు లేవని.. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అఖిలేష్ అపాయింట్మెంట్ దొరుకుతుందని తెలిపారు. ఇంత త్వరగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని కూడా తాను అనుకోలేదని చెప్పారు. ఈ సంక్షోభం వెనక అమర్‌సింగ్ పాత్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని ఇప్పటికే అమర్ సింగ్ స్పష్టం చేశారు కదా అని శివపాల్ చెప్పారు. పార్టీలో ఎవరూ చిన్న, పెద్ద ఉండరని.. పనులు చేయడం ద్వారానే ఎవరైనా పెద్దవాళ్లు అవుతారని అన్నారు. ఒక పార్టీలో అందరికీ ఒకేలాంటి సిద్ధాంతాలు కూడా ఉండవన్నారు. -
'శాఖల తొలగింపు ముఖ్యమంత్రి ఇష్టం'
లక్నో: ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న 'బాబాయ్- అబ్బాయ్' వివాదం ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో సర్దుకున్నట్లు తెలుస్తోంది. శివపాల్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఏ బాధ్యతను ఇచ్చినా దానిని నిర్వర్తించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తానని వెల్లడించారు. అన్నయ్య(ములాయం) నిర్ణయమే అతిమం అని.. అందరం దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ 2017 ఎన్నికల్లో అఖిలేశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నయ్య నిర్ణయిస్తే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని శివపాల్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్‌ను తప్పించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో శివపాల్ మంత్రిత్వ శాఖలను తగ్గిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై స్పందించిన శివపాల్ యాదవ్.. శాఖల తొలగింపు అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నాడు. అయితే, అఖిలేశ్ ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ములాయం రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలంటూ బీఎస్పీ నాయకురాలు మాయవతి ఇచ్చిన సలహాలు తమకు అక్కర్లేదని శివపాల్ అన్నారు. -
తమ్ముడికే ములాయం మద్దతు!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబపోరుకు తెరదించేందుకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన గురువారం లక్నో బయలుదేరారు. లక్నోలో గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. అదేవిధంగా తనయుడు, యూపీ సీఎం అఖిలేశ్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య అంతర్గత వర్గ పోరు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్‌ను ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆ పదవిని తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవమానంతో అఖిలేశ్ రగిలిపోతున్నప్పటికీ ములాయం తమ్ముడికే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. స్థానిక టీవీ చానెళ్ల కథనం ప్రకారం పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన అఖిలేశ్ కేబినెట్లోనూ మంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పినట్టు సమాచారం. తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ప్రతీకార చర్యగా శివ్‌పాల్ యాదవ్ మంత్రిత్వశాఖలకు కోతపెట్టి.. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ములాయంను ఎవరూ సవాల్ చేయకూడదు! అన్న కొడుకు అఖిలేశ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ తాను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతానని శివ్‌పాల్ యాదవ్ స్పష్టం చేశారు. తనను ఎస్పీ చీఫ్‌గా నియమిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎవరూ కూడా సవాల్ చేయకూడదని మీడియాతో చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉందని, 2017లో మరోసారి అధికారాన్ని సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
మరో బాబాయి మద్దతు పలికాడు!
లక్నో: యూపీ అధికార పార్టీ సమాజ్‌వాదీ పరివారంలో తలెత్తిన వార్ గురువారం కొత్త మలుపు తీసుకుంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను తొలగించడంతో రగిలిపోతున్న సీఎం అఖిలేశ్ యాదవ్‌కు కుటుంబం నుంచి మద్దతు లభించింది. బాబాయి శివ్‌పాల్ యాదవ్‌తో అమీతుమీ సిద్ధపడ్డ ఆయనకు మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ అండగా నిలిచారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు కజిన్ సోదరుడు, రాజ్యసభ సభ్యుడైన రాంగోపాల్ గురువారం అఖిలేశ్‌ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అఖిలేశ్‌ను ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తప్పేనని తేల్చేశారు. అఖిలేశ్‌కు చెప్పకుండానే ఆయన తండ్రి ములాయం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 'ముఖ్యమంత్రిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో నాయకత్వం కొంత పొరపాటు చేసింది. ఈ విషయాన్ని ముందే సీఎంకు చెప్పాల్సి ఉండేది. ఎన్నికల దృష్ట్యా సీఎం పదవిలో ఉన్న వారు రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగడం అంతగా వీలు కాదు కాబట్టి వేరే వారిని నియమిస్తున్నామని చెప్పి ఉంటే.. అఖిలేశ్ స్వయంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేవారు' అని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. అయితే, ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వివాదం తలెత్తిందని, అంతేకానీ, పార్టీలో కానీ, కుటుంబంలోని కానీ ఎలాంటి సంక్షోభం లేదని చెప్పుకొచ్చారు. ఏమైనా చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని సరిచేసుకుంటామని చెప్పారు. సీఎం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, సీఎం అన్నప్పుడు ఆ అధికారం ఉటుందని అఖిలేశ్‌ను ఆయన వేనకేసుకొచ్చారు. -
బాబాయ్ x అబ్బాయ్
-
బాబాయ్ x అబ్బాయ్
సాక్షి, నేషనల్ డెస్క్ : దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈసారీ గెలవాలని పట్టుదలగా ఉన్న రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్‌కు సొంతింట్లో కుంపటి తలనొప్పిగా మారింది. కొంత కాలంగా కుమారుడు(అఖిలేశ్), తమ్ముడు (శివ్‌పాల్) మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న భేదాభిప్రాయాలు ఇప్పుడ రోడ్డున పడటం ములాయంకు ఇబ్బందిగా మారింది. మళ్లీ గెలవాలంటే.. కీలకమైన మార్పులు తప్పవని, అందరినీ పక్కనపెట్టి ముందుకెళ్లేందుకు అఖిలేశ్ దూకుడు పెంచగా.. ఈ నిర్ణయాలు పార్టీ అభివృద్ధికోసం తను చేస్తున్న ప్రయత్నాలకు సమస్యగా మారాయని శివ్‌పాల్ అంటున్నారు. అయితే.. కుర్చీలాటలో అఖిలేశ్‌కే ములాయం మద్దతిస్తుండటం యాదవ కుటుంబంలో విభేదాలు సృష్టిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’ అనిపించుకోవాలని.. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ విజయానికి శాంతిభద్రతల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. ఎస్పీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య ఎక్కువైందనేది బహిరంగ రహస్యమే. దీంతో కనీసం ఈ ఆర్నెల్లలో వీలైనంత మార్చి..ప్రజానుకూల ప్రభుత్వమని, తను మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలనేది అఖిలేశ్ తాపత్రయం. తండ్రిచాటు బిడ్డ అనే ముద్ర తొలగించుకునేందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్వామీ ఏక్తా దళ్ (గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ స్థాపించిన పార్టీ)ని సమాజ్‌వాద్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియకు అఖిలేశ్ అడ్డుపడ్డారు. అయితే.. తను కుదిర్చిన ఈ డీల్‌ను అఖిలేశ్ అడ్డుకోవటాన్ని శివ్‌పాల్ అవమానంగా భావించారు. మరోవైపు, తన సన్నిహితుడు దీపక్ సింఘాల్‌ను సీఎస్‌గా తొలగించటం.. తన చేతిలోని కీలక శాఖలను తప్పించటం శివ్‌పాల్‌కు ఇబ్బందికరంగా మారింది. అయితే, పార్టీ యూపీ చీఫ్‌గా అఖిలేశ్‌ను తప్పించటం, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ శివ్‌పాల్ నిర్వహణ నైపుణ్యంపై ములాయం ప్రశంసించటం ములాయం కంటితుడుపు చర్యలుగా అర్థమవుతోంది. సీఎం సీటుపై కన్ను.. 2012లో యూపీ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించిన శివ్‌పాల్ అప్పుడే సీఎం పదవిని ఆశించారు. అయితే ములాయం పుత్రుడిపైనే నమ్మకం ఉంచటంతో డీలా పడ్డారు. ఇటీవలి కాలంలో అఖిలేశ్ తీరుపై ఆరోపణలు వస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లోనైనా సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని శివ్‌పాల్ భావిస్తున్నారు. మళ్లీ పార్టీలో చేరిన ఎంపీ అమర్‌సింగ్ పార్టీలో మళ్లీ క్రియాశీలకంగా మారుతుండటాన్ని శివ్‌పాల్ స్వాగతిస్తుండగా.. అఖిలేశ్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇది కూడా విభేదాలకు కారణమైంది. -
ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?
-
అన్నయ్య ఏం చెబితే అది చేస్తా..
న్యూఢిల్లీ: తన సోదరుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఏం చెబితే, అది చేస్తానని ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ములయాంపై తనకు పూర్తి నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో ములయాంను వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్న కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో విబేధాల నేపథ్యంలో శివపాల్ బుధవారం ఢిల్లీ వెళ్లి ములయాంతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై సోదరుడితో చర్చించారు. కాగా అఖిలేష్ కూడా ఢిల్లీకి వెళ్లి ములయాంను కలవనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. శివపాల్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను మంగళవారం అఖిలేష్ తొలగించడంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే రోజు ములాయం.. యూపీ ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్‌ను తొలగించి, శివపాల్‌ను నియమించారు. దీంతో రగిలిపోయిన అఖిలేష్.. బాబాయ్ శివపాల్ దగ్గర నుంచి కీలక శాఖలను తొలగించారు. దీంతో వీరిద్దరి పంచాయతీ ములయాం దగ్గరకు వెళ్లింది. -
ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?
ఉత్తరప్రదేశ్‌లో వ్యవహారం నిన్న మొన్నటివరకు అంతా సమిష్టి కుటుంబంలా ఉండేది. ప్రభుత్వంలో కూడా అందరూ బంధువులే కనిపించేవాళ్లు. పార్టీ పెద్దాయన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఆయన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ప్రభుత్వంలో ఒకానొక కీలక మంత్రి, నేతాజీ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి. వీళ్లందరికీ సన్నిహితుడైన ఆజంఖాన్ కూడా మంత్రివర్గంలో కీలక సభ్యుడు. ఇలా అంతా 'మనవాళ్లే' అనుకునేవారు. కానీ ఉన్నట్టుండి.. ముసలం పుట్టింది. బాబాయ్ - అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దాయన కలగజేసుకోవాల్సి వచ్చింది. బాబాయ్‌కి కావల్సిన వాళ్లను అబ్బాయ్ తప్పిస్తూ వెళ్లాడు. దాంతో అబ్బాయికి ఉన్న కీలక పదవుల్లో ఒకదానికి పెద్దాయన కత్తెర వేశారు. దాన్ని తమ్ముడికి గిఫ్టుగా ఇచ్చారు. ఒక్కసారిగా సమాజ్‌వాదీ పార్టీ ములాయం-శివపాల్, అఖిలేష్ వర్గాలుగా విడిపోయింది. దీనంతటికీ వెనకాల ఎవరున్నారనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇది కుటుంబంలో గొడవ కాదని.. ఎవరో బయటి నుంచి గొడవ పెట్టారని అఖిలేష్ అంటున్నారు. అంటే.. ఈ మధ్య కాలంలో పార్టీకి వచ్చినవాళ్లని అంతా అనుకుంటున్నారు. అలా వచ్చిన పెద్దమనిషి అమర్ సింగ్ ఒక్కరే. బహుశా ఆయనే ఈ సమస్యలన్నింటికీ మూల కారణం అయి ఉంటారన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. 'ఇందులో కుటుంబ గొడవలు మీకు ఎక్కడ కనిపించాయి, ఇది ప్రభుత్వంలో గొడవ మాత్రమే' అని అఖిలేష్ యాదవ్ మీడియాతో చెప్పారు. బయటినుంచి వచ్చేవాళ్లు పదే పదే వేలు పెడుతుంటే పనపులు ఎలా జరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్‌తో పాటు మాజీ సీఎస్ దీపక్ సింఘాల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారేమోనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అఖిలేష్, శివపాల్ యాదవ్‌ల మధ్య గొడవ మొదలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకమే అని తెలుస్తోంది. జూన్ 30వ తేదీన అప్పటివరకు సీఎస్‌గా ఉన్న అలోక్ రంజన్ పదవీ విరమణ చేశారు. అంతకుముందు శివపాల్ యాదవ్ దగ్గరున్న శాఖల్లో ఒకదానికి ముఖ్య కార్యదర్శిగా ఉండే దీపక్ సింఘాల్ పేరు ముందుకొచ్చింది. అదే ఖరారైంది. కానీ రెండు నెలల్లోనే సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన్ను వెనక్కి పంపేశారు. కొన్ని నిర్ణయాలు ములాయంను సంప్రదించి తీసుకోగా.. మరికొన్నింటిని మాత్రం తాను సొంతంగానే తీసుకున్నానని అఖిలేష్ చెబుతున్నారు. శివపాల్ యాదవ్ శాఖలు పీకేయడమా.. సీఎస్‌ను తప్పించడమా.. ఇలా ఏ నిర్ణయం ఆయన సొంతంగా తీసుకున్నారో మాత్రం తెలియడంలేదు. ఇప్పుడు ఎటూ పంచాయతీ 'నేతాజీ' వద్దకు చేరింది కాబట్టి.. అక్కడ ఒక రాజీ ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నారు. లేనిపక్షంలో మాత్రం రాబోయే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కష్టకాలం తప్పదు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలను బట్టి సమాజ్‌వాదీ, బీజేపీలకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుంటే మాత్రం పార్టీలో కొంతమేరకు చీలిక తప్పదు. అప్పుడు అది బీజేపీకి కలిసొచ్చే అంశం అవుతుంది. ఏం జరుగుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి. -
తండ్రితో అమీతుమీనా.. రాజీనా!
సైఫై: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. క్షణక్షణం ఏం జరుగుతుందా అని అటు రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆరాటం(అఖిలేశ్ యాదవ్), అనుభవం(శివపాల్ యాదవ్) పోటీ పడుతుండగా వారిద్దరిని తిరిగి సమన్వయ పరిచేందుకు సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోపక్క, తాను కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే అనూహ్య నిర్ణయం తీసుకొని తనకు ఝలక్ ఇచ్చిన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో తేల్చుకునేందుకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఢిల్లీకి పయనమవుతున్నాడు. అందులో భాగంగానే నేడు రాష్ట్రంలో ఆయనకు ఉన్న అధికారిక కార్యకలాపాలన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. స్వయంగా బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ కు ఉన్న ప్రముఖ శాఖలన్నింటిని తొలగించి కేవలం సంక్షేమ శాఖ మాత్రమే ఉంచిన అనంతరం తీవ్ర అసంతృప్తికి లోనయిన శివపాల్ తన కేబినెట్ హోదాకు రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అవి అలా ఊపందుకున్నాయో లేదో వెంటనే సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షత బాధ్యతల నుంచి అఖిలేశ్ ను తప్పించి ఆ బాధ్యతలు శివపాల్ కు ఇచ్చి ములాయం గట్టి ఝలక్ ఇచ్చారు. దీంతో తండ్రి కొడుకుల మధ్య పరస్పర యుద్ధ పరిస్థితి మొదలైంది. తన దూకుడుకు ప్రతి క్షణం కళ్లెం వేస్తున్నాడని తండ్రిపై అఖిలేశ్ తీవ్ర అసంతృప్తితో ఉండగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ములాయం తమ్ముడు శివపాల్ మాత్రం తన సోదరుడు ఏది చెప్తే అదే చేస్తానని, ఆయన మాటను తూచ తప్పబోనని ప్రకటించాడు. ఈ రోజంతా ఆయనతో సమావేశం అయిన తర్వాతే తన రాజీనామా అంశం, పార్టీలో పరిస్థితులపై మాట్లాడతానని చెప్పాడు. ప్రస్తుతం ములాయం ఢిల్లీలో ఉన్నారు. ఆయనను కలిసి బాబాయ్, అబ్బాయ్‌లు ఫిర్యాదులు చేయనున్నట్లు తెలిసింది. వారిద్దరిని ఢిల్లీకి రమ్మని ములాయం ఇప్పటికే పిలిచారని కూడా సమాచారం. మరోపక్క, అఖిలేశ్ యాదవ్ చేసిన ఆవేశ పూరిత పనికి సోదరుడు ఎక్కడ చేజారిపోయి చీలిక తీసుకొస్తాడోనన్న భయంతోనే ములాయం అతడికి రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పి ఉంటారని కొందరు అంటుండగా.. ప్రజల దృష్టిని ఒకసారి తమవైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే వారే కావాలని ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారని ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు. -
అఖిలేష్ పదవి ఔట్!
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రంజుగా సాగుతోంది. తాజాగా అది ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పీకల వరకు కూడా వచ్చింది. అవినీతికి పాల్పడుతున్నారన్న కారణంతో ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించిన అఖిలేష్... తాజాగా మంగళవారం తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆ పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను తప్పించి, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ భట్నాగర్ను ఈ పదవిలో నియమించారు. సదరు దీపక్ సింఘాల్.. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌కు బాగా సన్నిహితుడు. ఇక సోమవారం నాడు అఖిలేష్ తప్పించిన ఇద్దరు మంత్రులు గాయత్రీ ప్రజాపతి, రాజ్‌కిషోర్ సింగ్ కూడా ములాయం, శివపాల్‌లకు సన్నిహితులని అంటున్నారు. తాజా పరిణామాలతో కొడుకు దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్‌ను తప్పించి, ఆ స్థానంలో శివపాల్ యాదవ్‌ను నియమించారు. తద్వారా పార్టీకి అసలైన బాస్ తానేనని ములాయం మరోసారి చూపించుకున్నట్లు అయింది. దానికితోడు ఎన్నికలకు ముందు.. అఖిలేష్ కూడా అవినీతి నిరోధక చర్యలు తీసుకుంటున్నారన్న విషయం జనంలోకి వెళ్లడానికి ఒక అవకాశం చూసుకున్నారని అంటున్నారు. ఎప్పుడూ వివాదాలలో ఉంటారని పేరున్న దీపక్ సింఘాల్‌ను రెండు నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పుడే ఈ నియామకం సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఏమాత్రం ఇష్టం లేదన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ములాయం ఒత్తిడి కారణంగా ఒప్పుకోలేక తప్పలేదు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో పాటు మంత్రులకు కూడా ఉద్వాసన పలకడంతో.. ఇక తన తమ్ముడైన శివపాల్ యాదవ్‌ను బుజ్జగించడం కూడా చాలా ముఖ్యమని భావించిన 'నేతాజీ'.. ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. -
ఒక వేదికపై బాబాయ్, అబ్బాయ్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా రోజుల తర్వాత బాబాయ్, ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ యాదవ్‌తో ఒకే వేదికను పంచుకున్నారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య విబేధాలున్నాయని వార్తలు రావడం, ఇటీవల అఖిలేష్ యాదవ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్, శివపాల్ పరస్పరం పొగుడుకున్నారు. తమ కుటుంబంలో విబేధాలున్నట్టు సృష్టించవద్దంటూ అఖిలేష్ మీడియాను కోరారు. అఖిలేష్ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని శివలాల్ అన్నారు. అఖిలేష్ మాట్లాడుతూ.. బాబాయ్ (శివపాల్) సీనియర్ మంత్రిగా అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతున్నారని, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. శుక్రవారం శివపాల్ ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లి అఖిలేష్‌తో 90 నిమిషాల సేపు సమావేశమయ్యారు. తద్వారా ములయాం కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవనే సంకేతం పంపారు. ఆ మరుసటి రోజు వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. -
కుమారుడిపై మండిపడ్డ ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీలో మొదటి రెండుస్థానాల్లో ఉన్న అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన విభేదాలు ములాయం కుటుంబంలో చిచ్చు రగిల్చాయి. మంత్రి, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ తాజా ప్రతిపాదన కారణంగా తండ్రీకొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ ఒక దానితో పొత్తు కుదుర్చుకుందామని అఖిలేశ్‌కు సూచించగా, ఇందుకు ఆయన తిరస్కరించారు. ములాయం మరో సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ సైతం శివ్లాల్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో శివ్‌పాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయమంతా ములాయంకు తెలిసింది. శివ్లాల్ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన ములాయం.. కొడుకుపై మండిపడ్డారు. ‘పార్టీలో శివ్‌పాల్ ఒక్కడే నా మాట వింటాడు. ఇప్పుడు అతడు కూడా రాజీనామా చేస్తానంటున్నాడు. అసలు మీరంతా అతణ్ని ఎందుకు అవమానిస్తున్నారు ?’ అంటూ అఖిలేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. లక్నోలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో అఖిలేశ్‌తోపాటు ములాయం పాల్గొన్నారు. -
ములాయం కుటుంబంలో చిచ్చు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట విభేదాలు భగ్గుమన్నాయి. కువామి ఏక్తాదల్ (క్యూఈడీ)ను ఎస్పీలో విలీనం చేసుకోకపోవడంపై ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. బుధవారం ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలకు ఆలస్యంగా చేరుకున్న శివ్‌పాల్ వేదికపైకి వెళ్లకుండా అతిథుల మధ్యే కూర్చున్నారు. అయితే పార్టీ నేతలు చెప్పడంతో వేదిక వద్దకు వెళ్లినా వెనక వరుసలో కూర్చున్నారు. మళ్లీ సీనియర్ నేతలు కల్పించుకోవడంతో ముందు వరుసలో కూర్చున్నారు. వేడుకలో ములాయం, అఖిలేశ్‌లను శివ్‌పాల్ పలకరించలేదు. గోపాల్‌కు శుభాకాంక్షలు తెలపలేదు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా శివ్‌పాల్ హాజరుకాలేదు. కుయామీ ఏక్తాదల్ను ఎస్పీలో విలీనం చేసుకోడానికి గతవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు అంగీకరించనప్పటి నుంచి శివ్‌పాల్ అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2017 లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ములాయం ఇంట ఈ వివాదం చర్చనీయాంశమైంది. -
ప్రకంపనలు రేపుతున్న బాబాయి-అబ్బాయి!
లక్నో: బాబాయి-అబ్బాయి మధ్య విభేదాలు అధికార సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఎస్పీ సీనియర్ నేత, అఖిలేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ మంత్రిమండలి విస్తరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. రాజ్ భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండటం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గొడవ ఎక్కడ మొదలైంది.. ఎస్పీ అధినేత ములాయం యాదవ్ తమ్ముడైన శివపాల్ యాదవ్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన ఇటీవల ఖవామీ ఎక్త్ దళ్ (క్యూఈడీ) పార్టీని ఎస్పీలో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఒకప్పటి గ్యాంగ్‌స్టర్, ప్రస్తుత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ నేతృత్వంలోని క్యూఈఎంను అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీలో విలీనం చేసుకోవడానికి సర్వం సిద్ధమైన నేపథ్యంలో దీనికి పార్టీ హైకమాండ్ అడ్డుపుల్ల వేసింది. క్యూఈడీని ఎస్పీలో విలీనం చేసుకోవడం లేదని ఎస్పీ శనివారం స్పష్టం చేసింది. తాను సంకల్పించిన ఈ విలీనానికి అడ్డుకోవడంతో అలిగిన శివపాల్ యాదవ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన సోమవారం ఈటాలోనే ఉండిపోయారు. ఈ వ్యవహారం ఎస్పీలో బాబాయి శివపాల్ యాదవ్, అబ్బాయి అఖిలేశ్ మధ్య ముదిరిన విభేదాలను చాటుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సర్వశక్తులొడ్డుతున్న అఖిలేశ్ వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటినుంచి అధికార పార్టీని ఎస్పీ సిద్ధం చేసేందుకు అఖిలేశ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎస్పీని మరోసారి అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లతో ఏడోసారి తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టారు. తాజా విస్తరణలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయమంత్రులను తన మంత్రిమండలిలో చేర్చుకున్నారు. శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి మనోజ్ పాండే పనితీరు నచ్చక వేటువేశారు. -
'శివపాల్ యాదవ్ తక్షణమే రాజీనామా చేయాలి'
ఖాన్ పూర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంపై మాటల బాణం ఎక్కుపెట్టారు. మథుర ఘటనపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ...కేబినెట్ మంత్రి శివ్‌పాల్ యాదవ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని అమిత్ షా శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కాగా శివపాల్ యాదవ్...ములాయం దగ్గర బంధువే కాకుండా, ఎస్పీలో కీలక సీనియర్ నేత.యూపీ పర్యటనలో భాగంగా ఖాన్పూర్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి శనివారం అమిత్ షా మాట్లాడారు. మథుర ఘటనకు బాధ్యత వహిస్తూ శివపాల్ యాదవ్‌ను రాజీనామా చేయమని ములాయం కోరాలని అన్నారు. ఇక జనం ఆయుధాలతో ఉంటే అధికార యంత్రాంగానికి ఏమీ తెలియలేదా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆక్రమణలను నిరోధించడానికి, నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. పనిలో పనిగా అఖిలేష్ సర్కార్‌పైనా అమిత్ షా విమర్శలు చేశారు. రైతులు, యువత సహ అన్ని వర్గాలను వంచించారని దుయ్యబట్టారు. సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులను అఖిలేష్ సర్కార్ కాజేసిందని మండిపడ్డారు. ఇదేం పాలనంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా మథురలో జరిగిన యుద్ధకాండలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.