
బాబాయ్ ఫొటోను ఎందుకు తొలగించారు?
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం 24 గంటల్లోనే నాటకీయ పరిణామాల మధ్య సమసిపోయింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం 24 గంటల్లోనే నాటకీయ పరిణామాల మధ్య సమసిపోయింది. టికెట్ల కేటాయింపులపై విభేదాలు ఏర్పడటంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్‌లను ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించడం.. ఆజాంఖాన్ జోక్యంతో ములాయం ఇంట్లో అఖిలేష్, రాంగోపాల్, శివపాల్ యాదవ్ సమావేశం కావడం.. వివాదాలను మరచి కలసి పనిచేసేందుకు ములాయం కుటుంబ సభ్యులు అంగీకరించడం.. అఖిలేష్, రాంగోపాల్‌లపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయడం.. చకచకా జరిగిపోయాయి.
కాగా ఈ ఎపిసోడ్ తర్వాత ఓ ఆసక్తికర విషయం ఎస్పీలో చర్చనీయాంశమైంది. ఎస్పీ అధికారిక వెబ్‌సైట్‌లో అఖిలేష్ బాబాయ్ శివపాల్ ఫొటో మాయమైంది. హోం పేజీలో ములాయం, అఖిలేష్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. శివపాల్ ఫొటోను రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు. ఇక అఖిలేష్, రాంగోపాల్ యాదవ్‌లను బహిష్కరిస్తూ ములాయం చేసిన ప్రకటనలను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. శివపాల్‌తో అఖిలేష్, రాంగోపాల్ విభేదిస్తున్న సంగతి తెలిసిందే.