సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ తన పదవులకు రాజీనామా చేశారు. సోదరుడు ములాయంతో గురువారం రాత్రి భేటీ అయిన తర్వాత తన రాజీనామా లేఖను సీఎం అఖిలేష్ యాదవ్ కు పంపినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎస్పీలో 'బాబాయ్- అబ్బాయ్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కుర్చీలాటలో అఖిలేశ్‌కే ములాయం మద్దతిస్తుండటం యాదవ్ కుటుంబంలో విభేదాలకు కారణమయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ను తప్పించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఆ వెంటనే శివపాల్ మంత్రిత్వ శాఖలను తగ్గిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం మరింత ముదరడంతో ములాయం జోక్యం తప్పనిసరి అయింది.