సమాజ్‌వాదీ పార్టీ, తమ కుటుంబం, తమ బలం, బలగం అంతా ఒక్కటిగానే ఉన్నాయని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకుండా.. తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ములాయం మీడియాతో మాట్లాడారు. కొంతమంది తనను ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతున్న మాట నిజమే కానీ.. ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ఎందుకని అన్నారు. మీరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. తాను మాత్రం వివాదాస్పద సమాధానం ఒక్కటి కూడా ఇవ్వబోనని చెప్పారు. 2012లో మెజారిటీ తన పేరునే ప్రతిపాదించినా, తాను మాత్రం అఖిలేష్ యాదవ్‌నే ముఖ్యమంత్రి చేశానని, ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఆయనేనని తెలిపారు.