
'ఆ సీఎంకు చిన్నప్పుడు అన్నీ ఆయనే'
సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట.
లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట. అఖిలేశ్కు అసలైన గార్డియన్ కూడా ఆయనేనంట. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీలో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు ప్రధాన కారణం అఖిలేశ్, పినతండ్రి శివపాల్ యాదవ్ లే కారణం. అది కూడా రెండుగా చీలిపోతారా అన్నంతలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో వారి మధ్య వివాదం సర్దుమణిగింది.
అయితే, అఖిలేశ్, శివపాల్ మధ్య ఉన్నది చాలా గాఢమైన సంబంధం అని తెలిసింది. 1980, 90 దశకాల్లో ములాయం తన రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా అఖిలేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ మొత్తం శివపాల్ చేతులమీదుగానే జరిగిందట. హాస్టల్లో చేర్పించడం, అవసరాలు చూడటం, విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వడం వగైరా కార్యక్రమాలు మొత్తం శివపాల్ చూసుకున్నారట. అంతేకాదు, అఖిలేశ్ భార్య డింపుల్ కు శివపాల్ భార్య సరళకు చాలా అన్యోన్య సంబంధం ఉందంట.
దీంతో వారిమధ్య ఎంతో గాఢమైన అనుభందం ఉందని, ఎలాంటి విభేదాలు వచ్చిన వారిమధ్య అవి నిలబడలేవని చెబుతున్నారు. అఖిలేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే సమయం వరకు కూడా అటు తండ్రికిగానీ, పినతండ్రికి కానీ ఏనాడు 'కాదు, కుదరదు' అని చెప్పలేదట. అఖిలేశ్ కూడా వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన తర్వాత అవి కేవలం రాజకీయాల్లో మాత్రమేనని, తమ కుటుంబంలో కాదని ప్రకటించాడంటే నిజంగానే వారి బంధం విడదీయరానిదే అని అనుకోవాల్సిందే.