
ఫ్యామిలీ మొత్తం రాజీనామా.. కానీ!
సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అది ఓ కొలిక్కి రాలేదు.
సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అది ఓ కొలిక్కి రాలేదు. పైకి అంతా సమసిపోయినట్లే కనిపిస్తున్నా, ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. పార్టీ పదవులు, ఇతర పదవులకు శివపాల్ యాదవ్, ఆయన భార్య, కుమారుడు అందరూ రాజీనామాలు చేశారు. కానీ వాటిని ఇంకా ఎవరూ ఆమోదించలేదు. మరోవైపు తాజాగా పార్టీ కార్యాలయం నుంచి అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మొత్తం ఒక కుటుంబం లాంటిదని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు.
మంత్రిపదవికి శివపాల్ చేసిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అఖిలేష్ ప్రకటించినా, శివపాల్ మాత్రం ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ తన ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అఖిలేష్ చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన శివపాల్ వెళ్లిపోతానని చెప్పినా, పార్టీ.. ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన పాత్ర ఉండాల్సిందేనని పెద్దన్న ములాయం సింగ్ యాదవ్ పట్టుబట్టారు. పార్టీలో గట్టిపట్టున్న శివపాల్ లాంటి నాయకులు వెళ్లిపోతే.. అది చీలికకు దారితీస్తుందన్నది పెద్దాయన భయంలా కనిపిస్తోంది. నిమిషానికో రకంగా మారుతున్న యూపీ రాజకీయాలు ఇక మీదట ఏమవుతాయో చూడాల్సి ఉంది.