![నేను చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ?](/styles/webp/s3/article_images/2017/09/5/81489660481_625x300.jpg.webp?itok=Fco7WQ8v)
నేను చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ?
ఎవరికైనా సెక్యూరిటీ తగ్గిస్తే వాళ్లు హత్యలకు గురైన ఘటనలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గించడం వల్ల రేపు తాను మరణిస్తే అందుకు బాధ్యత ఎవరిదని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మండిపడ్డారు. శనివారం నాడు తనకు బెదిరింపు లేఖలు వచ్చాయని, ఆదివారం నాడు తన సెక్యూరిటీని సమీక్షించి తగ్గించేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రుల్లో ఆజమ్ ఖాన్ ఒకరన్న విషయం తెలిసిందే. తనకు భద్రత తగ్గించడంపై తీవ్రంగా ఆవేదన చెందన ఆయన.. రాంపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆజమ్‌ఖాన్‌కు ఇంతకుముందు వరకు వై ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉండేది. ఇప్పుడు ఆయనకు భద్రత కొంత తగ్గించినా, ఇప్పటికీ ఆయన వెంట సాయుధ గార్డులు ఉంటూనే ఉంటారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, డీజీ (సెక్యూరిటీ)లతో కూడిన రాష్ట్ర భద్రతా కమిటీ నిశితంగా పరిశీలించి, వందమంది వ్యక్తులకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను సమీక్షించింది. ఆజమ్‌ఖాన్‌తో పాటు సమాజ్‌వాదీ నేతలు రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ తదితరుల భద్రతను కూడా తగ్గించారు. వంద మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు, సలహాదారులకు కూడా భద్రతను ఇంతకుముందు కంటే కాస్త తగ్గించారు. తాజా సమీక్ష తర్వాత కనీసం 1200 మంది భద్రతా సిబ్బంది తమకు అదనంగా మిగులుతారని, వాళ్లను సంబంధిత జిల్లాల్లో శాంతిభద్రతల విధుల్లో నియమిస్తామని భద్రతా కమిటీ సభ్యులు చెప్పారు.