లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్‌వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది.
ఇదే కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు.
అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది.
కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్‌పై రాంపూర్‌లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్‌ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి.
2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్‌పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది.
చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment