
అఖిలేష్ పదవి ఔట్!
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రంజుగా సాగుతోంది. తాజాగా అది ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పీకల వరకు కూడా వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రంజుగా సాగుతోంది. తాజాగా అది ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పీకల వరకు కూడా వచ్చింది. అవినీతికి పాల్పడుతున్నారన్న కారణంతో ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించిన అఖిలేష్... తాజాగా మంగళవారం తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆ పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ను తప్పించి, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ భట్నాగర్ను ఈ పదవిలో నియమించారు. సదరు దీపక్ సింఘాల్.. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌కు బాగా సన్నిహితుడు. ఇక సోమవారం నాడు అఖిలేష్ తప్పించిన ఇద్దరు మంత్రులు గాయత్రీ ప్రజాపతి, రాజ్‌కిషోర్ సింగ్ కూడా ములాయం, శివపాల్‌లకు సన్నిహితులని అంటున్నారు.
తాజా పరిణామాలతో కొడుకు దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్‌ను తప్పించి, ఆ స్థానంలో శివపాల్ యాదవ్‌ను నియమించారు. తద్వారా పార్టీకి అసలైన బాస్ తానేనని ములాయం మరోసారి చూపించుకున్నట్లు అయింది. దానికితోడు ఎన్నికలకు ముందు.. అఖిలేష్ కూడా అవినీతి నిరోధక చర్యలు తీసుకుంటున్నారన్న విషయం జనంలోకి వెళ్లడానికి ఒక అవకాశం చూసుకున్నారని అంటున్నారు.
ఎప్పుడూ వివాదాలలో ఉంటారని పేరున్న దీపక్ సింఘాల్‌ను రెండు నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పుడే ఈ నియామకం సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఏమాత్రం ఇష్టం లేదన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ములాయం ఒత్తిడి కారణంగా ఒప్పుకోలేక తప్పలేదు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో పాటు మంత్రులకు కూడా ఉద్వాసన పలకడంతో.. ఇక తన తమ్ముడైన శివపాల్ యాదవ్‌ను బుజ్జగించడం కూడా చాలా ముఖ్యమని భావించిన 'నేతాజీ'.. ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు.