కన్నీళ్లు పెట్టిన అఖిలేశ్ యాదవ్
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో చీలిక దిశగా వెళుతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మౌనం వీడారు. తన తండ్రితో ఎటువంటి విభేదాలు లేవని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. లక్నోలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాదని అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనపై చర్య తీసుకున్నారని వాపోయారు. 'నేను కొత్త పార్టీ పెడతానని కొంత మంది అంటున్నారు. కొత్త పార్టీ ఎవరు పెడుతున్నారు. నేనైతే పార్టీ పెట్టడం లేద'ని అఖిలేశ్ అన్నారు. అయితే అఖిలేశ్ కు భిన్నమైన వాదన వినిపించారు శివపాల్ యాదవ్. కొత్త పార్టీ పెడతానని తనతో అఖిలేశ్ స్వయంగా చెప్పాడని వెల్లడించారు.
పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకున్నారు. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నారు. ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ములాయం ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తా. ములాయం కోరితేనే ప్రజాపతిని మంత్రి పదవి నుంచి తొలగించాను. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు.