
'టిక్కెట్లపై బెంగ వద్దు.. నిశ్చింతగా ఉండండి'
పార్టీ టికెట్ విషయంలో ఎవరూ ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన విశ్వసనీయులతో చెప్పినట్లు తెలుస్తోంది.
లక్నో: పార్టీ టికెట్ విషయంలో ఎవరూ ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన విశ్వసనీయులతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లో ప్రచారం చేయాలని వారితో చెప్పినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 70మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కలిశారంట. అలా కలిసిన వారందరికీ ఆయన పార్టీ టిక్కెట్ల విషయంలో హామీ ఇచ్చారట. అయితే, వాస్తవానికి పార్టీ టిక్కెట్ల పంపకం బాధ్యత సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ తమ్ముడు శివపాల్ యాదవ్‌ది.
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయనే సీట్ల పంపకాలు కూడా చూసుకుంటున్నారు. ములాయంను కలిసి సీట్ల విషయంలో సమాలోచనలు చేస్తున్నారు. సీఎం అఖిలేశ్‌ను పక్కకు పెట్టారు. అయితే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకన్న అఖిలేశ్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను తన వద్దకు పిలుచుకొని పార్టీ సీట్ల విషయం చర్చిస్తూ పార్టీ హైకమాండ్‌కు తాను కూడా ముఖ్యమే అనే సంకేతాలు పంపిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మధ్య తనను పక్కకు పెడుతున్నారని, పార్టీలో మరోసారి భూకంపం వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హైకమాండ్‌దేనంటూ ఆయన ఇతాహ్‌లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. తనను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పెద్దలు పక్కకు పెట్టాలన్న ఆలోచన చేయోకూడదని తాజా ఎమ్మెల్యేలతో భేటీ ద్వారా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.