
ఒక వేదికపై బాబాయ్, అబ్బాయ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా రోజుల తర్వాత బాబాయ్, ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ యాదవ్తో ఒకే వేదికను పంచుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా రోజుల తర్వాత బాబాయ్, ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ యాదవ్తో ఒకే వేదికను పంచుకున్నారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య విబేధాలున్నాయని వార్తలు రావడం, ఇటీవల అఖిలేష్ యాదవ్ తండ్రి సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్, శివపాల్ పరస్పరం పొగుడుకున్నారు. తమ కుటుంబంలో విబేధాలున్నట్టు సృష్టించవద్దంటూ అఖిలేష్ మీడియాను కోరారు.
అఖిలేష్ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని శివలాల్ అన్నారు. అఖిలేష్ మాట్లాడుతూ.. బాబాయ్ (శివపాల్) సీనియర్ మంత్రిగా అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతున్నారని, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. శుక్రవారం శివపాల్ ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లి అఖిలేష్తో 90 నిమిషాల సేపు సమావేశమయ్యారు. తద్వారా ములయాం కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవనే సంకేతం పంపారు. ఆ మరుసటి రోజు వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించారు.