'శాఖల తొలగింపు ముఖ్యమంత్రి ఇష్టం'
ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న 'బాబాయ్- అబ్బాయ్' వివాదం ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో సర్దుకున్నట్లు తెలుస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న 'బాబాయ్- అబ్బాయ్' వివాదం ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో సర్దుకున్నట్లు తెలుస్తోంది. శివపాల్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఏ బాధ్యతను ఇచ్చినా దానిని నిర్వర్తించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తానని వెల్లడించారు. అన్నయ్య(ములాయం) నిర్ణయమే అతిమం అని.. అందరం దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ 2017 ఎన్నికల్లో అఖిలేశ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నయ్య నిర్ణయిస్తే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని శివపాల్ స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ను తప్పించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో శివపాల్ మంత్రిత్వ శాఖలను తగ్గిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై స్పందించిన శివపాల్ యాదవ్.. శాఖల తొలగింపు అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నాడు. అయితే, అఖిలేశ్ ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ములాయం రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలంటూ బీఎస్పీ నాయకురాలు మాయవతి ఇచ్చిన సలహాలు తమకు అక్కర్లేదని శివపాల్ అన్నారు.